ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు త్వరలోనే కౌన్సెలింగ్‌లు ప్రారంభం కానున్నాయి. అన్ని ప్రవేశాల్లో రిజర్వేషన్లు అమల్లో ఉండడంతో విద్యార్థులకు కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. ఈ పత్రం కోసం విద్యార్థులు మీసేవ, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వస్తోంది. ఈ పత్రం జారీకి పేర్కొన్న నిర్దిష్ట సమయం 30 రోజులు కావడం గమనార్హం. కుల ధ్రువీకరణ పత్రాలు సకాలంలో రాక గత ఏడాది అనేకమంది జాతీయ, రాష్ట్రస్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాలనూ కోల్పోయారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మీసేవల్లో కొత్త సేవ అందుబాటులోకి తేనుంది. నిమిషంలోనే కుల ధ్రువీకరణ పత్రం ఇచ్చే ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం పాత ధ్రువీకరణ పత్రం సంఖ్యను చెపాల్సి ఉంటుంది. అది నమోదు చేసిన వెంటనే కొత్త సర్టిఫికెట్ తీసుకోవచ్చు. పాత సర్టిఫికెట్ నంబరు తెలియకపోతే ఆధార్ నంబరుతోనే తీసుకునే వెసులుబాటు కల్పించారు. అలాగే రిజిస్ట్రేషన్ శాఖ అందించే మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్ కోసం సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాలి ఉంటుంది. ఇకపై రాష్ట్రంలో ఎక్కడి మీసేవ నుంచైనా ఈ ధ్రువపత్రాన్ని పొందవచ్చు. ఈ కొత్త సేవలను ఈ నెల 27న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించనున్నారు. పౌరులకు సత్వర సేవలు అందించాలన్న లక్ష్యంతోనే వీటిని అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి తెలిపారు.
ఇంటి వద్దకే ఇసుక ఇసుక బుకింగ్‌ను ఇకపై మీసేవ కేంద్రాల ద్వారా చేసుకోవచ్చు. కావాల్సినంత ఇసుక ఇంటి వద్దకే వస్తుంది. ఈ సేవలను మంత్రి శ్రీధర్‌బాబు మంగళవారం ప్రారంభించారు. మీసేవల ద్వారా ఇటీవల 20 కోట్ల లావాదేవీలు పూర్తయిన సందర్భంగా మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఈ కొత్త విధానానికి మంత్రి శ్రీకారం చుట్టారు. దీని ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందన్నారు. ఇసుక కావాల్సిన వారు సమీప మీ సేవ కేంద్రానికి వెళ్లి మొబైల్ నంబరుతో రిజిస్టర్ చేసుకొని.. వాహనం రకం, ఇసుక పరిమాణం, ఇసుక రీచ్, డెలివరీ తేదీని ఎంచుకోవాలి. అనంతరం ఆన్లైన్ చెల్లింపు ద్వారా బుకింగ్ ప్రక్రియ పూర్తవుతుందని, ఇచ్చిన చిరునామాకు ఇసుక వస్తుందని మంత్రి తెలిపారు. ప్రజల ఇళ్ల వద్దకే సేవలను తీసుకెళ్లాలన్న లక్ష్యంతో కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు.
































