భారతదేశంలో పేద, మధ్యతరగతి జనాభా ఎక్కువగా ఉంటారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వీరంతా కూడా కార్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. క్రమంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం, కుటుంబ అవసరాల కోసం బస్సులు, ఆటోలు, రైళ్లు వంటి వాటిల్లో ప్రయాణించడానికి బదులుగా అందరు కలిసి ఒకే కారులో హాయిగా వెళ్లడానికి ఇష్టపడటం వంటి పలు కారణాల వలన దేశంలో ఇప్పుడు కార్ల అమ్మకాలు భారీగా పుంజుకున్నాయి.
తక్కువ బడ్జెట్లో మంచి మైలేజ్, శక్తివంతమైన పనితీరు అందించగల కార్లు ఇప్పుడు మార్కెట్లో చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో దేశీయ అతిపెద్ద కార్ల తయారీదారు అయినటువంటి మారుతీ సుజుకీ (Maruti Suzuki)కి చెందిన ప్రసిద్ద ఆల్టో K10 ఒకటి.
తక్కువ ధరలో మంచి కారు అన్న మాట వినగానే ఈ కారే ముందు కళ్లకు కనిపిస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆల్టో K10లో అవసరమైన ప్రతి అంశం ఉంటుంది. చిన్నది, చక్కగా డిజైన్ చేయబడింది, రోజువారీ ఉపయోగానికి సరిగ్గా సరిపోయేంత స్పేస్, సౌలభ్యం కలిగి ఉంటుంది. చూడటానికి చిన్నగా ఉన్నప్పటికి కూడా ఇంజిన్ పనితీరు విషయంలో మైలేజ్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అందరి అంచనాలకు తగ్గట్టు ఉంటుంది.
ఈ కారు గ్రామాలకు సరిపోయేలా స్టడీగా ఉంటుంది. సిటీ లైఫ్‌లోనూ ఎలాంటి తిప్పలు లేకుండా డ్రైవ్ చేయవచ్చు. పార్కింగ్ టెన్షన్ ఉండదు. స్మార్ట్‌గా తిరగొచ్చు. దీని ధర రూ.4.23 లక్షల నుండి రూ.6.21 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండటం వల్ల బడ్జెట్‌కు భారం కాకుండా కుటుంబానికి సరిపోయే ఎంపికగా నిలుస్తుంది. ఇందులో ఐదుగురు సౌకర్యవంతంగా ప్రయాణించగలిగేంత స్థలం ఉంటుంది. వీకెండ్ ట్రిప్స్‌కి, ఫ్యామిలీ టూర్లకు ఇది బాగానే పని చేస్తుంది.
*214 లీటర్ల బూట్ స్పేస్ ఉండటం వల్ల పెద్ద బ్యాగులు, లగేజ్ పెట్టుకోవచ్చు. పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, ఆల్టో K10 రెండు ఇంజిన్ వేరియంట్లతో వస్తుంది,మొదటిది 1 లీటర్ పెట్రోల్, రెండోది CNG. ఇంకా చెప్పాలంటే, మైలేజ్ విషయంలో ఇది బైక్‌లకే పోటీ ఇస్తుంది. పెట్రోల్ వేరియంట్లో లీటరుకు 24.39 కిలోమీటర్లు, CNG వేరియంట్లో 33.85 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందంటే ఆశ్చర్యమే!
ఫీచర్ల పరంగా ఆల్టో K10 అద్భుతమే. అందంగా డిజైన్ చేసిన ఇంటీరియర్ ఆకట్టుకుంటుంది. మారుతీ సుజుకీ ఆల్టో K10 ఇప్పుడు కేవలం బడ్జెట్ కారుగా కాకుండా, సురక్షితమైన కారుగా కూడా తన స్థానాన్ని సంపాదించుకుంటోంది. ఇప్పటి వరకూ చిన్న కారుల్లో సేఫ్టీకి తక్కువ ప్రాధాన్యత ఇవ్వబడ్డా, ఇప్పుడు మారుతీ ఈ నియమాన్ని తిరగరాసింది. బేస్ మోడల్ నుంచే టాప్ వేరియంట్ వరకూ 6 ఎయిర్‌బ్యాగ్స్‌ను అందించడం ఒక పెద్ద మార్పు.
ఇంకా ఇందులో ABS, EBD వంటి అధునాతన బ్రేకింగ్ టెక్నాలజీలు కూడా స్టాండర్డ్‌గా ఉండటం వల్ల, అత్యవసర పరిస్థితుల్లోనూ కారు నియంత్రణ కోల్పోకుండా సురక్షితంగా నిలబడగలదు. ఇలాంటి ఫీచర్లతో, మీరు సిటీ లోనైనా, హైవే మీద అయినా,కంఫర్ట్‌తో పాటు కేర్ ఉంటుంది. డిజైన్ విషయానికి వస్తే కొత్త ఆల్టో K10 మినిమలిస్ట్ డిజైన్‌తో, హెడ్‌ల్యాంప్-గ్రిల్ లుక్స్‌తో స్మార్ట్‌గా కనిపిస్తుంది.
కారు లోపల కూడా లేటెస్ట్ ఫీచర్స్ చాలా ఉన్నాయి. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, బ్లూటూత్, యూఎస్బీ, ఏఎక్స్ ఫంక్షన్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్ డిజిటల్ స్పీడోమీటర్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్,మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే (MID), ఫ్రంట్ పవర్ విండోలు వంటి మొదలగు సౌకర్యాలు ఈ కారులో ఉన్నాయి. తక్కువ ధరలో మంచి కారు కావాలనుకునే వారికి ఇది బాగా సూట్ అయ్యే మోడల్.
































