దేశ వ్యాప్తంగా రుతు పవనాల ప్రభావం కనిపిస్తోంది. మే చివరి వారంలో భారీగా వర్షాలు కురిసి జూన్ ప్రారంభంలో తగ్గుముఖం పట్టాయి. అయితే మళ్లీ రుతుపవనాల ప్రభావం పుంచుకుంటోంది. పలు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నారు అధికారులు..
ఈ వారం రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున కర్ణాటక, కేరళలోని అధికారులు అనేక జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. వివిధ ప్రాంతాలలో నివసించే వారికి భద్రతా సలహాలు కూడా జారీ చేశారు అధికారులు. కర్ణాటకలో, దక్షిణ కన్నడ జిల్లాలోని బెల్తంగడి తాలూకాలోని అన్ని అంగన్వాడీ, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు జూన్ 26న ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూసివేశారు. అయితే వర్షాలు భారీగా కురుస్తుండటంతో మరిన్ని రోజులు సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. దక్షిణ కన్నడ జిల్లా యంత్రాంగం జిల్లా అంతటా అధికారికంగా సెలవు ప్రకటించనప్పటికీ, గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా బెల్తంగడి తాలూకాలోని పాఠశాలలు మూసి ఉంచారని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది.
రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో కొడగు జిల్లా కూడా పాఠశాలలకు వర్షపు సెలవు ప్రకటించింది. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న, లోతట్టు ప్రాంతాలలో జిల్లా అధికారులు తనిఖీలను పెంచారు. అధికారికంగా ప్రకటించే వరకు పాఠశాలలు తెరవవద్దని విద్యాశాఖ సూచించింది. అలాగే తరలింపు సన్నాహాలు, తాత్కాలిక ఆశ్రయాలు వంటి భద్రతా చర్యలను బలోపేతం చేశారు.
































