పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో పాటు అనేక కఠిన ఆంక్షలు విధించింది. అందులో సింధూ జలాల పంపిణీ నిలుపుదల ఒకటి.
అయితే భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కాస్త తగ్గుముఖం పట్టిన క్రమంలో చైనా సైలెంట్ గా ప్రతీకారం తీర్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. పాక్ కు భారత్ ఏ విధంగా ఆంక్షలు పెట్టిందో ఇప్పుడు చైనా కూడా భారత్ పై ఆంక్షలను ఒక్కొక్కటిగా విధిస్తూ వస్తోంది. ఈ క్రమంలో భారత్ పై చైనా పెద్ద ప్లానే వేసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
భారత్ పై చైనా సైలెంట్ గా ప్రతీకారం తీర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. తన మిత్ర దేశం పాకిస్థాన్ పై భారత్ విధించిన కఠిన ఆంక్షలకు బదులుగా ఇప్పుడు చైనా భారత్ పై పలు ఆంక్షలు విధిస్తూ వస్తున్న క్రమంలో ఇరు దేశాల వాణిజ్యంపై కొంత ఆందోళన నెలకొంది. గత కొద్ది రోజులుగా చైనా నుంచి భారత్ కు కీలకమైన ఎరువుల పంపిణీ నిలిచిపోయింది. ప్రపంచంలోని అనేక దేశాలకు ఎరువులను ఎగుమతి చేస్తున్న డ్రాగన్.. సరిహద్దు దేశమైన భారత్ కు మాత్రం ఎగుమతి చేయకుండా అడ్డుపడుతూ వస్తోంది. ఈ క్రమంలో భారత్ పై చైనా పలు ఆంక్షలు విధించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఈ కీలకమైన ఎరువులతో భారత్ లోని పండ్లు, కూరగాయల వ్యాపారం సమృద్ధిగా సాగేది. చైనా నుంచి దిగుమతి చేసుకునే ఈ ప్రత్యేకమైన ఎరువులను భారత్ లోని రైతులు వ్యవసాయంలో వినియోగించి భారీగా లాభాలు పొందారు. పంటల దిగుబడిని పెంచేందుకు ఈ ఎరువులు బాగా ఉపయోగపడతాయని రైతులు భావిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా చైనా నుంచి ఈ కీలకమైన ఎరువుల దిగుమతి ఆగిపోయింది. ఇప్పుడు పంటల సీజన్ కావడంతో చైనా నిర్ణయంతో దేశంలోని రైతులు ఇబ్బందులు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
భారత్ దాదాపు 80 శాతం కీలకమైన ఎరువులను చైనా నుంచి దిగుమతి చేసుకుంటుంది. అయితే గత నాలుగైదు ఏళ్లుగా ఈ ఎరువులపై చైనా పలు ఆంక్షలు విధిస్తూ వచ్చింది. ఇటీవల పూర్తిగా చైనా నుంచి భారత్ కు ఎరువుల ఎగుమతి నిలిపివేసింది. సాధారణంగా భారత్ ఏటా 1,50,000 టన్నుల నుంచి 1,60,000 టన్నుల ఎరువులను దిగుమతి చేసుకుంటుంది. జూన్ నుంచి డిసెంబర్ మధ్య ఈ దిగుమతులు సాగుతాయి. చైనా నుంచి దిగుమతి చేసుకునే ఈ కీలకమైన ఎరువులు దేశంలోని మృత్తికల సారాన్ని సైతం పెంచుతాయట. అందుకే ఈ ఎరువులకు భారత్ రైతుల నుంచి ఫుల్ డిమాండ్ ఉంది. కానీ అంతర్జాతీయంగా ప్రస్తుతం నెలకున్న అనిశ్చితి కారణంగా ఈ ఎరువులను భారత్ కు ఎగుమతి ఆపేసింది చైనా.
































