ఏపీలో స్కూల్ విద్యార్థులకు అతి భారీ గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.6,000లు… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సంతోషకరమైన వార్త అందించింది.
ఒక్కో విద్యార్థి పాఠశాల ఇంటి నుంచి ఒక కిలోమీటరు కంటే దూరంగా ఉంటే, రవాణా ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది.
ఈ సదుపాయం కింద, ప్రతి విద్యార్థికి నెలకు రూ.600 చొప్పున, 10 నెలలకు రూ.6,000 తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారని అధికారులు తెలిపారు. ఈ విషయంపై జులై 5న జరిగే ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశంలో చర్చించి, విద్యార్థులు ఆటో లేదా సొంత రవాణా సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలా అనే విషయంపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.
అదే రోజు, రాష్ట్రవ్యాప్తంగా మెగా తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో గత విద్యా సంవత్సరంలో విద్యార్థుల ప్రగతి, మెరుగుపరచాల్సిన అంశాలు, విద్యార్థులు వెనుకబడిన రంగాలు, కొత్త విద్యా సంవత్సరంలో చేపట్టబోయే కార్యక్రమాలను తల్లిదండ్రులకు వివరిస్తారు. అలాగే, తల్లిదండ్రుల అభిప్రాయాలు, సూచనలను స్వీకరించి, వాటిని పరిగణనలోకి తీసుకుంటారు.
కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యామిత్ర కిట్లను పంపిణీ చేశారు. ఈ కిట్లలో యూనిఫామ్, షూస్, పుస్తకాలు, నిఘంటువులు ఉన్నాయి. విద్యార్థులపై పుస్తకాల భారాన్ని తగ్గించేందుకు సెమిస్టర్ వారీగా పుస్తకాలను అందిస్తున్నారు. శనివారం నో-బ్యాగ్ డేగా ప్రకటించారు. అంతేకాదు, మధ్యాహ్న భోజనం కోసం సన్న బియ్యం సరఫరా చేస్తున్నారు. ఈ విధంగా, ప్రభుత్వం విద్యార్థుల కోసం ఈ విద్యా సంవత్సరంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఇక విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్ పాస్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంతో, ఆర్టీసీ ఉచిత మరియు రాయితీ బస్ పాస్‌లను అందిస్తోంది. బస్ పాస్ కోసం ఆర్టీసీ బస్టాండ్ కౌంటర్లలో దరఖాస్తు చేసుకోవచ్చు. పాత పాస్ ఉన్నవారు రెన్యూవల్ కోసం కౌంటర్లలో దరఖాస్తు చేయవచ్చు. ఇంటర్, డిగ్రీ విద్యార్థుల కోసం నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చెల్లుబాటు అయ్యే పాస్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్‌లో buspassonline.apsrtconline.in ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు తమ డిపో పరిధిలోనే దరఖాస్తు చేయాలని అధికారులు సూచించారు.
12 ఏళ్లలోపు బాలురకు, 15 ఏళ్లలోపు పదో తరగతి బాలికలకు ఉచిత బస్ పాస్‌లు అందిస్తారు. అలాగే, పల్లె వెలుగు బస్సుల్లో 20 కి.మీ. లోపు పాఠశాలలకు ఉచితంగా ప్రయాణించవచ్చు. దీనికోసం హెడ్మాస్టర్ సంతకం, సీల్ ఉన్న దరఖాస్తు ఫారం, ఆధార్ కార్డు కాపీ, ఫొటో అందించాలి. ఐడీ కార్డు కోసం రూ.70 రుసుము చెల్లించాలి. ఈ ఫారమ్‌ను ఆర్టీసీ అధికారులకు సమర్పిస్తే, వారు పరిశీలించి పాస్ జారీ చేస్తారు.
































