ఇల్లు కడుతున్నారా.. ఈ తప్పులు చేయకండి

ల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అని పెద్దలు ఊరికే అనలేదు. సొంతంగా గృహం కట్టుకునేవారు నైపుణ్యం లేని పనివారితో తిప్పలు పడటంతోపాటు అవగాహన లేక చేస్తున్న పొరపాట్లతో తర్వాత ఇబ్బంది పడుతున్నారు.


సొంతంగా నిర్మించుకుంటే ఖర్చు తగ్గాల్సింది పోయి పెరిగిందేమిటి అని వాపోతున్నారు. అందుకే ఇల్లు కట్టుకునేవారు ఈ తప్పులు చేయవద్దని ఇంజినీర్లు సూచిస్తున్నారు.

స్థలాలు కొని గృహం నిర్మించే వారు అనుమతి పొందిన లేఅవుట్‌లోని స్థలమా? కాదా? అనేది నిర్ధారించుకోవాలి. ఎల్‌ఆర్‌ఎస్‌ ఉందా? లేదా చూసుకోవాలి. అనుమతి ఉన్న లేఅవుట్‌ అయితే నిర్మాణ అనుమతులు పొందడం సులువు. చెరువుల చెంత కొనేటప్పుడు బఫర్‌జోన్‌లో లేదని నిర్ధారించుకోండి. తెలియక ఇలాంటి వాటిలో కొన్నా… నిర్మాణ అనుమతులు రావు. వచ్చినా ఎవరైనా హైడ్రాకి ఫిర్యాదు చేస్తే ఏ దశలోనైనా కూల్చే అవకాశం ఉంటుంది.

కుటుంబంతో చర్చించి..

తమకున్న స్థలంలో ఇంటి నిర్మాణం ఎలా ఉండాలి? ఎన్ని అంతస్తులు? ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే గ్రౌండ్‌ఫ్లోర్‌లో పడక గది కడితే సరిపోతుందా? పై అంతస్తుల్లోనే ఉండాలంటే లిఫ్ట్‌ అవసరమా కాదా? వంట గది చిన్నగా ఉండాలా? పెద్దగానా? వాష్‌ ఏరియా, దేవుడి గది, ఇంట్లో స్నానాల గదుల వరకు ప్రతిదీ కుటుంబ సభ్యులు ముందుగా చర్చించుకోవాలి. ఇంట్లో పిల్లలు ఉంటే వారి అవసరాలు, ఆలోచనలను పరిగణనలోకి తీసుకోవాలి. గృహిణులు, పిల్లల అభిప్రాయాలు తెలుసుకోకుండా చాలామంది ప్లాన్‌ గీయించి ఆ తర్వాత మళ్లీ మార్పులు చేర్పులు చేస్తుంటారు.

ఆర్కిటెక్ట్, స్ట్రక్చరల్‌ ఇంజినీర్‌ తప్పనిసరి

అందుబాటులో ఉన్న కొద్దిపాటి స్థలంలో మంచి ఇంటి ప్లాన్‌ కావాలంటే ఆర్కిటెక్ట్‌ను సంప్రదించాల్సిందే. ప్లాన్‌ ప్రకారం నాణ్యంగా నిర్మాణం జరగాలంటే స్ట్రక్చరల్‌ ఇంజినీర్‌ పర్యవేక్షణ తప్పనిసరి. ఫీజులకు భయపడి చాలామంది వీరిని సంప్రదించరు. మేస్త్రీలు, పనులు చేయించే గుత్తేదారుల మీద ఆధారపడుతుంటారు. ఇక్కడే అనుభవం లేని వారి కారణంగా పలు తప్పులు దొర్లుతుంటాయి. ఇంజినీరు ఉంటే ప్రతి విషయానికి సంబంధించి అనుభవమున్న కన్సల్టెన్సీల సేవలు తీసుకుని పనిచేయిస్తారు. నీటి లీకేజీలు లేకుండా, కమోడ్స్‌ ఎంపిక, విద్యుత్తు, డ్రైన్‌ లైన్ల వరకు అన్నీ చూసుకుంటారు.

నిర్మాణ సమయంలో..

  • మార్కింగ్‌ దగ్గరే చాలామంది పొరపాటు చేస్తుంటారు. మార్కింగ్‌ సక్రమంగా లేకపోతే నిర్మాణం పూర్తయ్యాక బీమ్స్‌ గోడల బయటకు కన్పిస్తుంటాయి.
  • బీమ్స్, గోడల అతుకుల వద్ద మెష్‌ వంటివి పెట్టకపోతే కాలం మారినప్పుడు వ్యాకోచ గుణంతో పగుళ్లు వచ్చే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా కట్టే ఇళ్లలో వీటిని విస్మరిస్తుంటారు. పని ఆలస్యం అవుతుందని కొందరు మేస్త్రీలు వాటి అవసరం లేదంటూ దాటవేస్తుంటారు.
  • ఇటుకల మధ్య, గోడలకు ప్లాస్టరింగ్‌ నిర్ణీత మందం కంటే ఎక్కువ చేసినా పగుళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. అవసరం మేరకు మాత్రమే చేయాలి.
  • ప్రస్తుతం నిర్మాణాల్లో ఎక్కువగా రోబో శాండ్‌ను వాడుతున్నారు. ప్రమాణాల మేరకు ఉంటేనే ఈ ఇసుక మంచిదని ఇంజినీర్లు చెబుతున్నారు. రోబో శాండ్‌లో డస్ట్‌ ఎక్కువగా కలుస్తుండటం పగుళ్లకు కారణం అవుతోందంటున్నారు. అందులో డస్ట్‌ మిశ్రమాన్ని గుర్తించడం ఒకింత కష్టమే. సర్టిఫైడ్‌ సంస్థల నుంచి కొనుగోలు చేయడం మేలు. నది ఇసుకతో రోబో శాండ్‌ను మిళితం చేసి కూడా నిర్మాణంలో వాడవచ్చు అని ఇంజినీర్లు పేర్కొంటున్నారు.
  • ప్లాస్టరింగ్‌కు రోబోశాండ్‌ వినియోగించేటప్పుడు నీటి అవసరం ఎక్కువ. తగినపాళ్లలో కలపకపోతే త్వరగా పొడిగా మారుతుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇంజినీర్లు గమనించిన పొరపాట్లు కొన్ని…

  • స్నానాల గదిలో కమోడ్‌కు కుడివైపు నీటి గన్‌ ఉండాలి. కొందరిళ్లలో ఎడమవైపు ఏర్పాటు చేశారు. మళ్లీ మార్చాలంటే ఖర్చు అవుతుందని అలాగే వదిలేశారు.
  • ఒకవైపు రహదారికి దిగువన ఇంటి స్థలం ఉంది. ముందు భాగంలో రహదారి మామూలుగానే ఉంది. దిగువగా ఉన్న వైపు సెల్లార్‌గా మార్చుకుని పార్కింగ్‌ ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఎత్తు పెంచి ప్లాట్‌ లెవెల్‌ చేశారు. ఇందుకోసం చాలా ఖర్చు పెట్టారు. పార్కింగ్‌ కోసం గ్రౌండ్‌ ప్లోర్‌లో స్థలం లేక వాహనాలు రహదారి మీదనే నిలుపుతున్నారు. ఇంజినీర్‌ను సంప్రదించి ఉంటే రెండు సమస్యలకు పరిష్కారం చూపేవారు.
  • కింద, మొదటి అంతస్తుల్లో స్నానాల గదులు ఒకే దగ్గర వచ్చేలా ఇంజినీర్‌ ప్లాన్‌ ఇస్తారు. కానీ సొంతంగా ప్లాన్‌ చేసుకున్న ఒక యజమాని కింద ఒక చోట, పైన మరో చోట ఏర్పాటు చేశారు. లీకేజీ సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. ఇలా చాలా మంది చేస్తున్నారని ఇంజినీర్లు అంటున్నారు.

ఇంటీరియర్‌ డిజైనర్‌ను ముందే మాట్లాడుకోవాలి..

ఇల్లంతా పూర్తయ్యాక కొందరు ఇంటీరియర్‌ డిజైనర్‌ను సంప్రదిస్తున్నారు. దీంతో స్విచ్‌ బోర్డులు మార్చాల్సిరావడం.. అందుకోసం గోడలను పగలగొట్టాల్సి వస్తోంది. ఒకసారి అలా చేస్తే అవి ప్యాచులుగానే కన్పిస్తాయి. ఈ పరిస్థితి లేకుండా సివిల్‌ వర్క్స్‌ పూర్తికాగానే ఎలక్ట్రికల్, ప్లంబింగ్‌ పనులు మొదలు పెట్టే సమయంలోనే ఇంటీరియర్‌ డిజైనర్‌ను సంప్రదిస్తే.. ఎక్కడ బెడ్‌లు వస్తాయి? ఎక్కడ వార్డ్‌రోబ్‌లు వస్తాయి? వంటివి సూచిస్తారు. రెండుసార్లు చేసే పని తప్పుతుంది. సమయం, డబ్బు ఆదా అవుతాయి. స్ట్రక్చరల్‌ ఇంజినీర్, కాంట్రాక్టర్, ఇంటీరియర్‌ డిజైనర్‌ సమన్వయంతో పని చేసుకోవడం అవసరం. ప్లానింగ్‌ దగ్గర్నుంచి నిర్మాణం వరకు ఆర్కిటెక్ట్, ఇంజినీర్‌ వంటి నిపుణుల సేవలను పొందాలి. ఖర్చుకు భయపడి వెనక్కి తగ్గకూడదు.

 

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.