రామోజీ ఫిలిం సిటీలో దెయ్యాలున్నాయా..? అక్కడ గతంలో ఏం జరిగింది

క్షిణాదిలో పలువురు సినిమా షూటింగ్స్‌ కోసం ఎంచుకునే హైదరాబాద్‌ శివార్లలోని రామోజీ ఫిలిం సిటీ లో దయ్యాలు ఉన్నాయా? తరచుగా సినీతారలు ఆ ఫిలిం సిటీ గురించి ప్రకటిస్తున్న భయాలు, అనుభవాలు దేనికి సంకేతం?


విశేషం ఏమిటంటే, సదరు ఫిలిం సిటీలో తాము ఎదుర్కున్న భయానక అనుభవాలు వెల్లడిస్తున్న వారు కూడా ఏదో చిన్నా చితకా నటీమణులు కాకపోవడం, ఇండియన్‌ మూవీ ఇండస్ట్రీలో అత్యంత పేరున్న ప్రముఖ తారలు కావడమే విశేషం.

హైదరాబాద్‌ శివార్లలో విస్తరించిన ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రామోజీ ఫిల్మ్‌ సిటీ హంటెడ్‌ స్థలం అనే ఊహాగానాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఇటీవల ప్రముఖ బాలీవుడ్‌ హీరోయిన్‌ కాజోల్‌ ఫిలిం సిటీ గురించి చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ షూటింగ్స్‌ సమయంలో కొన్నిసార్లు రాత్రంతా నిద్రపోలేని ప్రదేశాలలో గడిపాపనని, అలాంటి సమయంలో అక్కడ నుంచి ఎంత త్వరగా వెళ్లిపోతే అంత బాగుంటుందని భావించానని కాజోల్‌ చెప్పారు. అందుకు ఉదాహరణగా ఆమె రామోజీ ఫిల్మ్‌ సిటీని పేర్కొన్నారు, ”అది ప్రపంచంలోనే అత్యంత భయానక ప్రదేశాలలో ఒకటిగా పరిగణించవచ్చు” అన్నారామె. అయితే, అదృష్టవశాత్తూ తనకు ఏ దయ్యమో భూతమో లాంటివి తనకు కనపడలేదంటూ తీవ్రమైన భయాలను ఆమె వ్యక్తం చేశారు.

భారతదేశంలోనే ఒక ప్రముఖ సీనియర్‌ నటి, అదే విధంగా అజయ్‌ దేవగణ్‌ వంటి స్టార్‌ హీరో భార్య ఫిలిం సిటీ గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన సంచలనం కలిగించాయి. ఇవి దేశవ్యాప్తంగా సినిమా రూపకర్తలను ఆందోళనకు గురి చేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యల ప్రభావం తీవ్రంగా ఉంటోందని గ్రహించిన ఫిలింసిటీ యాజమాన్యం చేసిన ప్రయత్నాలు ఫలించి కొన్ని రోజుల తర్వాత ఫిలింసిటీ చాలా గొప్ప ప్రదేశం అంటూ కాజోల్‌ కితాబిచ్చారు. అయితే అప్పటికే జరగాల్సిన డ్యామేజి జరిగిపోయిందని సినీ ట్రేడ్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే… కేవలం కాజోల్‌ మాత్రమే కాకుండా గతంలోనూ టాలీవుడ్‌ కి చిరపరిచితమైన రాశి ఖన్నా తాను అక్కడ బస చేసినప్పుడు ఒంటరిగా ఉన్న సమయంలో తనను ఎవరో అనుసరిస్తున్నట్టుగా అడుగుల శబ్ధం వినిపించింది అంటూ వ్యాఖ్యానించారు. అలాగే మరో అగ్ర తార తాప్సీ పన్ను కూడా అక్కడేదో అసహజ వాతావరణ ఉంది అంటూ మాట్లాడారు. అదే విధంగా తమిళ దర్శకుడు సుందర్‌ సి వంటి సెలబ్రిటీలు సైతం తమకు అక్కడ షూటింగ్‌ సందర్భంగా ఎదురైన అనుభవాలను పంచుకోవడం… గమనార్హం.

ఫిలింసిటీ…హారర్‌కి అడ్రెస్సా?
రామోజీ ఫిల్మ్‌ సిటీని వందల ఎకరాల్లో నెలకొల్పిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రాంతంలో ఒకప్పుడు నిజాం సైనికుల సమాధులు ఉండేవని కొందరు అలాగే ఆ స్థలం పూర్వపు యుద్ధభూమి అని మరికొందరు నమ్ముతున్నారు. దీనివల్ల అక్కడ చుట్టుపక్కల నివాసితులకు శాంతి లేదని, అక్కడ ఆత్మలు సంచరిస్తున్నాయని ఈ తరహా విషయాలను నమ్మేవారు చెబుతున్నారు. ఏదేమైనా ఇలాంటి మూఢనమ్మాకాలను వ్యాప్తి చెందించడం మంచిది కాదనేది నిజమే అయినప్పటికీ, ఎన్నో రకాల అనుభవాలను చవి చూసిన ధైర్యవంతులైన సినీ తారలు వ్యక్తం చేసే అభిప్రాయాలను కొట్టిపారేయలేం. మూఢనమ్మకాల సంగతెలా ఉన్నా, ఆయా తారలకు ఎదురవుతున్న అనుభవాల వెనుక ఉన్నవి అతీంద్రీయ శక్తులా? లేక అనుమానాస్పద వ్యక్తులా? అనే నిజాల నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.