‘ఈ-సైకిల్‌’ తయారు చేసిన ఇంటర్ స్టూడెంట్.. సింగిల్ ఛార్జ్ తో 80KM రేంజ్

ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ట్యాలెంట్ ఉంటుంది. సమయాన్ని బట్టి అది బయటపడుతుంది. ఇదే రీతిలో ఓ ఇంటర్ స్టూడెంట్ తన ట్యాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఏకంగా ఎలక్ట్రిక్ సైకిల్ ను ఆవిష్కరించాడు. ఇంటర్ స్టూడెంట్స్ అంటే దాదాపు కాలేజీకి వెళ్లడం, ఫ్రెండ్స్ తో సరదాగా గడపడం, చదువుకోవడం ఇవే వ్యాపకాలు ఉంటాయి. ఈ విద్యార్థి మాత్రం వీటిన్నిటితో పాటు వినూత్నంగా ఆలోచించి సరికొత్త ఆవిష్కరణకు ఆజ్యం పోశాడు. ఆ ఇంటర్ విద్యార్థి మరెవరో కాదు.. విజయనగరం జిల్లా తెర్లాం మండలం పూనివలస పంచాయతీ జాడవారి కొత్తవలసకు చెందిన రాజాపు సిద్ధు.


రాజాపు సిద్ధు తన ఫ్రెండ్ తో కలిసి ఎలక్ట్రికల్‌ సైకిల్‌ రూపొందించాడు. అందుకు ప్రభుత్వ పాఠశాలలో చదివే సమయంలో ఉపాధ్యాయులు అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌లో నేర్పిన పాఠాలతో పాటు చాట్‌జీపీటీ, గూగుల్‌ సహాయం తీసుకున్నాడు. అవసరమైన సామగ్రిని రూ.35 వేలతో కొన్నాడు. ఇంకేముంది తను అనుకున్న ఈ సైకిల్ ను తయారు చేశాడు. ప్రతి రోజు అదే సైకిల్ పై కాలేజీకి వెళ్తున్నట్లు తెలిపాడు. ఈ సైకిల్‌ను మూడున్నర గంటల్లో ఫుల్‌ ఛార్జింగ్‌ చేయొచ్చు.

సింగిల్ ఛార్జింగ్ తో 80 కి.మీ ప్రయాణించొచ్చని తెలిపాడు. 50కి.మీల గరిష్ఠ వేగంతో దూసుకెళ్తుందని తెలిపాడు. మార్గ మధ్యలో ఛార్జింగ్ అయిపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎంచక్కా సాధారణ సైకిల్ లాగా తొక్కుకుంటూ గమ్యానికి చేరుకోవచ్చు. ఈ సైకిల్ తయారు చేసిన రాజాపు సిద్ధుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. నేటి తరానికి ఆదర్శంగా నిలిచిన సిద్దును అభినందిస్తున్నారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.