ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి పార్టీలు వచ్చే ఎన్నికలే లక్ష్యంగా తమ వ్యూహాలను సిద్దం చేస్తున్నాయి. సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు తాజాగా కార్యాచరణ ఖరారు చేసారు.
వైసీపీ లక్ష్యంగా టీడీపీ రాజకీయ అడుగులు వేస్తోంది. అటు జగన్ ప్రభుత్వం పైన పోరు బాట ప్రారంభించారు. ఇదే సమయంలో ఎన్నికల్లో ఓటమి తరువాత జగన్ ను వీడి కూటమిలో చేరిన మాజీ మంత్రులు ఆ పార్టీల్లో ఒంటరి పోరాటం చేస్తున్నారు. వారికి కనీస గుర్తింపు దక్కటం లేదు. దీంతో, ఇప్పుడు వారి ముందున్న ప్రత్యామ్నాయాలు ఏంటి.. ఏం జరుగుతోంది..
జగన్ ను వీడి
2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తరువాత జగన్ వద్ద మంత్రులుగా పని చేసిన నేతలు పార్టీ వీడి కూటమిలోకి వెళ్లారు. జగన్ అధికారంలో ఉన్న సమయంలో వీరంతా ప్రాధాన్యత పొందినవారే. జగన్ కు బంధువు.. వైసీపీలో కీలకంగా వ్యవహరించిన నేత బాలినేని జనసేనలో చేరారు. ఆ పార్టీ లో చేరి నెలలు అవుతున్నా… ఆయనకు తగిన గుర్తింపు లేదనే వాదన ఉంది. జనసేన మిత్రపక్షం టీడీపీ స్థానిక ఎమ్మెల్యేలు, నేతలు బాలినేనితో కలిసి పని చేయటానికి సుముఖంగా లేరు. అదే సమయంలో బాలినేనికి ఎలాంటి పదవి.. బాధ్యతలు అప్పగించలేదు. దీంతో, తన వర్గాన్ని కాపాడు కోవటానికి బాలినేని ప్రయత్నం చేస్తున్నారు.
దక్కని గుర్తింపు
ఇక, కాపు వర్గం నుంచి డిప్యూటీ సీఎంగా పని చేసిన ఆళ్ల నాని పరిస్థితి ఇదే విధంగా ఉందని చర్చ జరుగుతోంది. ఆళ్లనాని తెలుగుదేశం పార్టీలో చేరి నెలలు గడుస్తున్నాయి. నాని చేరికను తొలి నుం చి టీడీపీ ఏలూరు నేతలు వ్యతిరేకిస్తున్నారు. అయినా, పార్టీలో చేరారు. టీడీపీ శ్రేణులు మాత్రం నాని తమ నేతగా అంగీకరించటం లేదు. పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానం లేదు. ఇంత దానికి పార్టీ మారటం ఎందుకని అనుచరుల నుంచి ప్రశ్నలు మొదలయ్యాయి. టీడీపీ కార్యాలయం వద్దకు నాని వెళ్లలేని పరిస్థితి. జగన్ ఇచ్చిన ప్రాధాన్యతను మర్చిపోయి.. పార్టీ ఓడగానే టీడీపీలోకి వెళ్లిన నానికి ఇప్పుడు భవిష్యత్ అంతు చిక్కటం లేదు. కేడర్ నుంచి సరైన నిర్ణయం తీసుకోవాలనే ఒత్తిడి పెరుగుతోంది. అదే విధంగా ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మోపిదేవి పరిస్థితి ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది.
భవిష్యత్ ఏంటి
మోపిదేవి వెంకటరమణ 2019 ఎన్నికల్లో ఓడినా.. ఎమ్మెల్సీ చేసి మంత్రిగా జగన్ అవకాశం కల్పించారు. ఆ తరువాత రాజ్యసభకు పంపారు. అయితే, 2024 ఎన్నికల్లో పార్టీ ఓడిన తరువాత రాజ్యసభతో పాటుగా వైసీపీకి రాజీనామా చేసిన మోపిదేవి టీడీపీలో చేరారు. ఇప్పటి వరకు ఆయన కు ఎలాంటి పదవి దక్కలేదు. టీడీపీ కార్యక్రమాల్లోనూ కనిపించటం లేదు. అదే విధంగా..వైసీపీ నుంచి కూటమి పార్టీల్లోకి ఎన్నికల ముందు వెళ్లిన వారి పరిస్థితి బాగానే ఉంది. కొందరు మంత్రు లు అయ్యారు. ఈ మాజీ మంత్రులు మాత్రం ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఆ పార్టీల్లోకి వెళ్లిన తరువాత వెనక్కు రాలేక.. ఆ పార్టీ శ్రేణుల నుంచి మద్దతు లేక డైలమాలో పడ్డారు. అయితే, వీరు ఎన్నికల నాటికి తిరిగి వైసీపీలోకి వస్తారనే చర్చ నియోజకవర్గాల్లో సాగుతోంది. కానీ, వైసీపీ నేతలు మాత్రం వారికి తమ పార్టీలో డోర్స్ క్లోజ్ అని చెబుతున్నారు. మరి.. వీరు రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.
































