మనిషి జీవితకాలం వందేళ్లు కాదు.. బాబా రాందేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్‌ (Baba Ramdev) మరోసారి వార్తల్లోకెక్కారు. ఈసారి ఆయన చేసిన వ్యాఖ్యలు మనిషి ఆయుర్దాయంపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీశాయి.


ప్రముఖ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సహజంగా మనిషి జీవిత కాలం (Human Lifespan) అందరూ అనుకుంటున్నట్లుగా వందేళ్లు కాదని, 150 నుంచి 200 ఏళ్ల వరకు ఉంటుందన్నారు. అయితే, ఆధునిక జీవనశైలి, అనియంత్రిత ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి వల్ల ఈ ఆయుర్దాయం క్రమంగా తగ్గిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

2021లో గుండెపోటుతో మృతిచెందిన నటుడు సిద్ధార్థ్‌ శుక్లా, ఇటీవల మరణించిన నటి షఫాలీ గురించి మాట్లాడుతూ మానవ శరీరం లోపలి నుంచి బలంగా ఉండాలన్నారు. మన శరీరంలో ప్రతీ కణానికి సహజమైన జీవితకాలం ఉంటుందని తెలిపారు. దానిపై ప్రభావం పడేలా ఏదైనా చేసినప్పుడు.. అది అంతర్గతంగా ఇబ్బందులు తలెత్తేలా చేస్తుందన్నారు. మనిషి 100 ఏళ్లలో తినాల్సిన ఆహారాన్ని ఇప్పటి తరాలు 25 ఏళ్లలోనే తినేస్తున్నారని, ఫలితంగా మెదడు, గుండె, కళ్లు, కాలేయంపై అధిక ఒత్తిడి పడి త్వరగా పాడవుతున్నాయని అన్నారు.

అలాగే, ప్రకృతిని అనుసరించిన జీవనశైలి, యోగాసనాలు, ఆయుర్వేదం వంటివి అనుసరిస్తే ఈ సమస్యలకు పరిష్కారం కనుగొనవచ్చని అభిప్రాయపడ్డారు. శరీరాన్ని సరైన మార్గంలో ఉపయోగిస్తే, 200 ఏళ్ల వరకూ జీవించడంలో ఆశ్చర్యం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారటంతో.. ఆరోగ్యాన్ని ప్రోత్సహించే వారంతా దీనిని ప్రశంసిస్తుండగా, శాస్త్రీయ ఆధారాలపై పలు వర్గాలు ప్రశ్నలు వేస్తున్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.