ఒక్క ఫోన్ కాల్..ఏకంగా ప్రధాని పదవికే ఎసరు తెచ్చింది

 కంబోడియా లీడర్‌తో మాట్లాడిన ఫోన్‌ కాల్‌ థాయ్‌లాండ్‌ ప్రధాని పెటోంగ్‌టర్న్‌ షినవత్రను ఇరుకున పడేసింది.


దేశ సరిహద్దు విషయాలు పొరుగు దేశ నాయకుడితో మాట్లాడి ఆమె రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించారంటూ సెనేటర్లు వేసిన పిటిషన్‌పై కోర్టు మంగళవారం విచారించింది. ఆమెను ప్రధాని పదవి నుంచి సస్పెండ్‌ చేసింది. తుది తీర్పు వచ్చేదాకా సస్పెన్షన్‌ కొనసాగుతుందని, అప్పటివరకు ప్రధాని విధులకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది.

అంకుల్‌ అని పిలవడంతో దుమారం!

కంబోడియా, థాయ్‌లాండ్‌ దేశాల మధ్య కొద్దిరోజులుగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. నెల రోజుల కింద ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరగ్గా కంబోడియా సైనికుడు చనిపోయాడు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు థాయ్‌ ప్రధాని షినవత్ర.. కంబోడియా మాజీ పీఎం హూన్‌సేన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయనను అంకుల్‌ అని సంబోధిస్తూ షినవత్ర దేశ పరిస్థితులపై చర్చించారు. థాయ్‌ సైన్యంలోని ఉన్నతాధికారి ఒకరు తనకు ప్రత్యర్థిగా మారారని ఆమె పేర్కొన్నారు.

ఈ ఫోన్‌ కాల్‌ సంభాషణ లీక్‌ అవడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. సొంత పార్టీ నేతల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. షినవత్ర సంకీర్ణ ప్రభుత్వం నుంచి ఓ పార్టీ వైదొలిగింది. షినవత్రపై కొందరు సేనేటర్లు కోర్టుకెక్కారు. ఈ కేసును విచారించిన రాజ్యాంగ న్యాయస్థానం షినవత్రను సస్పెండ్‌ చేసింది.

కాగా, కోర్టు తీర్పును పాటిస్తానని షినవత్ర పేర్కొన్నారు. ఏ తప్పూ చేయలేదని నిరూపించుకుంటానన్నారు. పొరుగు దేశ లీడర్‌తో తాను మాట్లాడినదాంట్లో దేశానికి నష్టం కలిగించే ఏ అంశం లేదని అన్నారు. ప్రస్తుతం షినవత్ర సస్పెన్షన్‌తో డిప్యూటీ ప్రైమ్‌ మినిస్టర్‌గా ఉన్న జంగ్రుంగ్రుంగ్‌ కిట్‌ తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.