ఏపీలో ఎన్నికలు ముగిసి ఏడాది మాత్రమే అయింది. ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది. అయితే జమిలి ఎన్నికల ప్రచారంతో ఎన్నికలు ముందుగా జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రతిపక్ష నేత, మాజీ సీఎం జగన్ అంచనా వేస్తున్నారు.
గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన ఆయన తన ఓటమికి ఈవీఎం గోల్ మాల్ అంటూ ఆరోపిస్తున్నారు. సుమారు 40 శాతం ఓటు బ్యాంకు ఉన్న వైసీపీకి కేవలం 11 సీట్లు రావడంపై జగన్, ఆయన పార్టీ నేతలు ఇప్పటికీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో 2029 ఎన్నికల్లో మళ్లీ గెలిచి అధికారం చేపట్టాలని ఇప్పటి నుంచే ప్రణాళిక రచిస్తున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మరోవైపు అధికార కూటమి కూడా ప్రతిపక్షానికి 11 సీట్లు మాత్రమే వచ్చాయని అజాగ్రత్తగా ఉండొద్దని తన ఎమ్మెల్యేలను నిరంతరం అప్రమత్తం చేస్తూనే ఉంది. వచ్చే ఎన్నికలలో వరుసగా గెలిచి అధికారాన్ని సుస్థిరం చేసుకునేలా వ్యూహాలు రచిస్తోంది. ఇటీవల సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం, ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు టార్గెట్ 2029పై విస్పష్ట సంకేతాలు పంపారు. ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా వచ్చే ఎన్నికల నాటికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి జగన్ మధ్య పోటీ ఎలా ఉంటుందన్న ప్రశ్నకు ఆసక్తికర విశ్లేషణ తెలియజేసింది.
2024 ఎన్నికల్లో మూడు పార్టీల కూటమి ద్వారా సుమారు 55 శాతం ఓటు బ్యాంకు సాధించి ఘన విజయం సాధించింది. ఇందులో టీడీపీకి సొంతంగా 45.6 శాతం ఓటు షేరు సాధించింది. ఈ ప్రజామద్దతు నిలుపుకుని 2029 ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారని ఏఐ తెలియజేసింది. అంతేకాకుండా తమ అధికారాన్ని నిలుపుకునేందుకు మూడు పార్టీల కూటమి బలంగా ఉండాలని కోరుకుంటున్నారని, డబుల్ ఇంజిన్ సర్కారుతో అభివృద్ధి సాధిస్తున్నామని ప్రచారం చేస్తున్నారని తెలిపింది. ముఖ్యంగా కేంద్రీకృత అభివృద్ధి అజెండాతోనే ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని ఏఐ విశ్లేషించింది. అదేసమయంలో ప్రతిపక్ష నేత జగన్ ఎస్సీ, ఎస్టీలతోపాటు తనకు ఉన్న 40 శాతం ఓటు బ్యాంకును నిలుపుకుని ఇతర వర్గాలను ఆకట్టుకునేలా ప్రణాళిక బద్ధంగా నడుస్తున్నారని ఏఐ తెలిపింది. 2029 ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తానన్న నమ్మకంతో ఉన్న జగన్ ముందుగా పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేసేలా అడుగులు వేస్తున్నారని అంచనా వేసింది.
ఇక ఇరువురు నేతల బలాబలాలు, బలహీనతలపైనా ఏఐ ఆసక్తికర విశ్లేషణ తెలియజేసింది. 2024 ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై కొంత వ్యతిరేకత కనిపిస్తున్నా పట్టణ మధ్య తరగతి, అగ్రవర్ణాలు, ఓబీసీల మద్దతు చెక్కుచెదరలేదని అంచనా వేసింది. అదేవిధంగా కూటమి పాలన ద్వారా మౌలిక సదుపాయాలు కల్పన, సంక్షేమ పథకాలు ద్వారా గ్రామీణ పేదలు, ఎస్సీ, ఎస్టీలను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పింది. కూటమి భాగస్వామ్య పక్షాలు బీజేపీ, జనసేనతో సమన్వయం కొనసాగించడం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబును బలానికి కారణంగా చెబుతోంది. అదే సమయంలో వైసీపీలో జగన్ నాయకత్వంపై కేడర్ కు పూర్తి విశ్వాసం ఉండటం ఆయనకు బలం చేకూర్చుతోందని ఏఐ విశ్లేషించింది.
అభివృద్ధి, పెట్టుబడుల సాధన, కొత్త ఉద్యోగాల సృష్టి వంటి అంశాలను ఎన్నికల ప్రచార అస్త్రాలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు వాడుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతున్న ఏఐ .. అదే విషయంలో జగన్ మాత్రం తనకు ఉన్న గ్రామీణ మద్దతుదారులు, ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకుపైనే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారని తెలిపింది. అదేవిధంగా టీడీపీ పట్టణ పార్టీగా.. వైసీపీ గ్రామీణ పార్టీగా అభివర్ణించింది. మంచి వాగ్దాటి, గ్యారెంటీ హామీల అమలు, భాగస్వామ్య పక్షాలతో సంయుక్త పోరాటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమవుతుండగా, జగన్ గ్రామ స్థాయి నుంచి పార్టీని పునః నిర్మించుకోడానికి జిల్లాల పర్యటనలు, పాదయాత్ర వంటి కార్యక్రమాలతో పార్టీని 2029 ఎన్నికలకు సిద్ధం చేయాలని చూస్తున్నారని ఏఐ విశ్లేషించింది.
































