ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కొమ్ములు తిరిగిన కంపెనీలు కూడా దీని బారిన పడుతున్నాయి.
భారీగా ఉద్యోగాల్లో కోత పెడుతున్నాయి. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్.. వంటి సంస్థలు సైతం ఇదివరకే దశలవారీగా లేఆఫ్స్ ప్రకటించాయి.
మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగుల తొలగింపును ప్రకటించింది. సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగంగా లేఆఫ్స్ ను తెర మీదికి తీసుకొచ్చింది. 9,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించనున్నట్లు సియాటెల్ టైమ్స్ వెల్లడించింది. దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
ముందుగా ఊహించినట్టే- ఈ విడతలో కూడా వేల సంఖ్యలో ఉద్యోగాల్లో కోత పెట్టింది మైక్రోసాఫ్ట్. అమెరికా కాలమానం ప్రకారం- బుధవారం నుంచి ఉద్యోగాల తొలగింపు చేపట్టనున్నట్లు సియాటెల్ టైమ్స్ తెలిపింది. లేఆఫ్స్ వేటు ఎదుర్కొంటోన్న ఈ 9,000 మందికి పైగా ఉద్యోగుల తుది జాబితా రూపొందించిందని, దీని ప్రకారం.. వారిని ఇంటికి పంపించనున్నట్లు పేర్కొంది.
ఈ సంవత్సర కాలంలో ఇది మైక్రోసాఫ్ట్ చేపట్టిన మూడో విడత లేఆఫ్స్ ఇవి. సేల్స్ డివిజన్ లో ఎక్కువ కోతలు కనిపించాయి. అలాగే- ఎక్స్ బాక్స్ వీడియో డివిజన్ లోనూ పెద్ద ఎత్తున కోత పడింది. ఈ నెల 30వ తేదీ నాటికి ఉద్యోగుల తొలగింపు, పునర్వ్యవస్థీకరణ పూర్తి కానుంది.
ఈ ఏడాది మే నెలలో సుమారు 6,000 మంది ఉద్యోగులను మైక్రోసాఫ్ట్ తొలగించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఆ సంస్థకు ఉన్న మానవ వనరులతో పోల్చుకుంటే ఇది సుమారు మూడు శాతం. దీని తరువాత మరో భారీ లేఆఫ్ ఇదే. మే నెలలో చోటు చేసుకున్న తొలగింపులు- ఇంజినీరింగ్, కస్టమర్ సపోర్ట్, మార్కెటింగ్ వంటి వివిధ విభాగాలపై ప్రభావం చూపాయి.
గత ఏడాది జూన్ నాటికి మైక్రోసాఫ్ట్ లో పని చేసిన ఉద్యోగుల సంఖ్య సుమారు 2,28,000. గత సంవత్సరంతో పోలిస్తే ఉద్యోగుల సంఖ్యలో పెద్దగా మార్పు లేదు. సంస్థలోని అతిపెద్ద విభాగాలలో ఒకటిగా ఉన్న సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగంలో 45,000 మంది ఉద్యోగులు పని చేస్తోన్నారు. ఆపరేషన్స్-86,000, ప్రొడక్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్- 81,000 మంది ఉద్యోగులు ఉన్నారు.
AI-ఆధారిత ఆటోమేషన్ వైపు కంపెనీ యాజమాన్యం మొగ్గు చూపుతున్న నేపథ్యంలో.. దీనికి అనుగుణంగా మానవ వనరులను తగ్గించుకోవచ్చని బ్లూమ్ బర్గ్ అంచనా వేసింది. ఈ పునర్వ్యవస్థీకరణ- టెక్ రంగంలో విస్తృతంగా ఉంటోంది. ఏఐ ఆటోమేషన్ పై పూర్తిస్థాయిలో ఆధారపడే పరిస్థితికి వచ్చాయి.
కంపెనీలు తమ ఉత్పాదకతను పెంచడానికి, వర్క్ ఫ్లోను క్రమబద్ధీకరించడానికి, సంప్రదాయ మ్యాన్ పవర్ పై ఆధారపడటాన్ని తగ్గించుకుంటోన్నాయి. ప్రత్యేకించి- సేల్స్, కస్టమర్ సపోర్ట్, అడ్మినిస్ట్రేషన్ వంటి విభాగాలలో జనరేటివ్ ఏఐ మోడళ్లపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి.
































