సీఎం చంద్రబాబు భారీ గిఫ్ట్‌.. ఇళ్లు, పాస్‌బుక్‌లపై కీలక ప్రకటన

పేదలకు ఇళ్ల స్థలాలపై రెవెన్యూ, మునిసిపల్, హౌసింగ్ మంత్రులతో ఉప సంఘాన్ని నియమిస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.


అభ్యంతరం లేని నివాస స్థలాకు డిసెంబర్‌లోగా రెగ్యులరైజేషన్ పూర్తికి ఆదేశించారు. 2027 డిసెంబర్ నాటికి రీ సర్వే 2.0 చేయాలని.. భూ వివరాలు దృశ్యరూపంలో కనిపించేలా ప్రత్యేక పోర్టల్ రూపొందించాలని తెలిపారు. ఫ్రీ హోల్డ్ భూములపై జీవోఎం సూచనల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ప్రొటోకాల్ విధుల నుంచి రెవెన్యూ సిబ్బందికి మినహాయింపు, ఏ మంత్రి పర్యటనకు వెళితే ఆ శాఖ అధికారులే ప్రోటోకాల్‌లో వెళ్లాలని ఆదేశాలు ఇచ్చారు.

అమరావతిలోని సచివాలయంలో శుక్రవారం రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం ప్రధాన లక్ష్యంగా రెవెన్యూ శాఖ అనునిత్యం పని చేయాలని.. శాఖ పరిధిలో తెచ్చే ప్రతి కార్యక్రమం కూడా ఆ దిశగానే ఉండాలని చేశారు. రెవెన్యూ శాఖలో ప్రజల సమస్యలకు పరిష్కారం చూపితే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందని తెలిపారు. గ్రామ స్థాయి ఉద్యోగి నుంచి రాష్ట్ర స్థాయి అధికారి వరకు సాంకేతికతను ఉపయోగించుకుని క్షేత్రస్థాయిలో ఫలితాలు వచ్చేలా చూడాలని సీఎం సూచించారు.

భూ సమస్యలు, ప్రజల అర్జీలు, రెవెన్యూ శాఖలో సేవలు సులభం చేసేందుకు తీసుకుంటున్న చర్యలతో పాటు వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. ‘అక్టోబర్ నాటికి ప్రతి ఒక్కరికీ శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందించాలి. ప్రభుత్వం వచ్చిన తరువాత 43.89 లక్షల మందికి కుల ధ్రువీకరణ ప్రతాల అందించాలి. మిగిలిన వారికి కూడా వీటిని ఇవ్వాలి. ఒకసారి ధృవీకరణ పత్రం పొందితే, వారి కుటుంబ సభ్యులకు ఆటోమేటిక్‌గా ఆ డాటా ఆధారంగా కుల ధృవీకరణ పత్రం వచ్చేలా చూడాలి’ అని అధికారులకు ఆదేశించారు. ఎస్సీలకు శ్మశాన వాటికల స్థలాల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని.. 363 హేబిటేషన్స్‌కు శ్మశాన వాటికలకు స్థలాలు ఇవ్వాలని సీఎం చెప్పారు. భూ సేకరణ కోసం రూ.137 కోట్లు అవసరం అని.. రెండు, మూడేళ్లలో పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమం పూర్తి చేయాలని నిర్దేశించారు.

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు
సమీక్షలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల అంశంపై కూడా సీఎం చంద్రబాబు చర్చించారు. ‘ప్రభుత్వం గ్రాంట్స్ కింద ఇచ్చే అంశాన్ని పరిశీలించాలి. ఈ విషయంలో సుప్రీం కోర్టు తీర్పు ఉండడంతో.. ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంలో న్యాయపరమైన సలహాలు తీసుకోవాలి’ అని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో ఇల్లు, ఇంటి స్థలం లేని వాళ్లు ఉండకూడదని స్పష్టం చేశారు. రెండేళ్లలో అందరికీ ఇంటి స్థలం ఇవ్వాలని తెలిపారు. మరో రెండేళ్లలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని.. అంటే వచ్చే నాలుగేళ్లలో ప్రతి ఒక్కరికి ఇల్లు అనే లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.