అంతర్వేదిలో స్నానానికి వెళ్లొద్దని పోలీసుల హెచ్చరిక..ఆ నీళ్లలో ఏముంది?

అంతర్వేది సముద్రంలో విష పురుగులున్నాయని, అక్కడ సముద్ర స్నానానికి వెళ్లవద్దని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి పోలీసులు హెచ్చరించారు.


గత ఆదివారం అంతర్వేది బీచ్‌కి వచ్చిన కొందరు పర్యటకులను జెల్లీ ఫిష్‌లు కుట్టడంతో అస్వస్థతకు గురై, ఆసుపత్రిలో చికిత్స పొందారు.

జెల్లీ ఫిష్‌లోని హైడ్రోజోవా వర్గానికి చెందిన వీటిని బ్లూ డ్రాగన్ జెల్లీ ఫిష్ అంటారని చేపలపై పరిశోధనలు చేసిన ఆంధ్రా యూనివర్సిటీ జువాలజీ విభాగం ప్రొఫెసర్ మంజులత చెప్పారు.

మూడేళ్ల కిందట విశాఖ రుషికొండ తీరంలో కూడా జెల్లీ ఫిష్‌లు కనిపించాయి. సందర్శకులను భయాందోళనలకు గురి చేశాయి.

ఇంతకీ ఇవి జెల్లీ ఫిష్‌లా, విషపురుగులా? అంతర్వేదిలో, రుషికొండలో కనిపించిన ఈ రెండూ ఒకే జాతికి చెందినవా? ఇవి ప్రమాదకరమా?

అంతర్వేదిలో ఏం జరిగింది?

జూన్ 30వ తేదీన అంతర్వేది సముద్ర తీరంలో ఊదా రంగులో జిగటగా, ముద్దలా (sticky, jelly like) ఉన్న జీవి కుట్టడంతో ఒళ్లంతా దద్దుర్లు, దురదలతో ఇద్దరు వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారు.

స్థానికులు వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీంతో అంతర్వేది తీరంలో జెల్లీ ఫిష్‌లు కుట్టాయంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి.

అంతర్వేది సముద్ర తీరంలో కనిపించిన జీవి

వీటిని అగ్గిబాట పురుగులు(ఒక రకమైన జెల్లీ ఫిష్‌లు)గా పిలుస్తుంటామని స్థానిక మత్స్యకారులు చెప్పారు.

“మాకు ఈ పురుగులు అప్పుడప్పుడు కనిపిస్తాయి. ఇవి శరీరానికి తాకినా, కుట్టినా ఆ భాగంలో మంటలు, దురదలు వస్తాయి. మేం వెంటనే బీచ్‌లో స్నానం చేస్తాం, తగ్గిపోతుంది” అని అంతర్వేదికి చెందిన మత్స్యకారుడు దుర్గ బీబీసీతో చెప్పారు.

అంతర్వేది సముద్రంలో విష పురుగులున్నాయని, అక్కడ స్నానానికి వెళ్లవద్దని కోనసీమ జిల్లా సఖినేటిపల్లి పోలీసులు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

అయితే గత ఆదివారం నాడు జెల్లీ ఫిష్‌లంటూ వీడియోలో వచ్చినప్పటికీ, ముందురోజు (శనివారం) కూడా ఈ తీరానికి వచ్చిన కొందరు పర్యటకులకి ఇదే తరహా అనుభవం ఎదురైందని దుర్గ చెప్పారు.

ఈ నేపథ్యంలో “అంతర్వేది సముద్రంలో విష పురుగులున్నాయి, సముద్ర స్నానానికి ఎవ్వరు వెళ్లవద్దు” అని సఖినేటిపల్లి పోలీసులు హెచ్చరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

జెల్లీ ఫిష్‌లకు దాడి చేసే స్వభావం ఉండదని, కేవలం తమని తాము రక్షించుకోవడానికే కుడతాయని ప్రొఫెసర్ మంజులత చెప్పారు.

ప్రమాదకరమా?

జెల్లీ ఫిష్ గురించి ప్రొఫెసర్ మంజులత వివరిస్తూ..

”జెల్లీ ఫిష్..పేరులో చేప ఉంటుంది కానీ, ఇవి సినిడారియా అనే ఒక జలచరాల వర్గానికి చెందిన జీవులు. చేప జాతికి చెందినవైతే కావు. కానీ, ఇవి కూడా నీటిలోనే ఎక్కువగా ఉంటూ, జిగటగా ఉంటాయి. కుట్టగలిగే సెల్స్, నెమటోసిస్టులు అంటే సూది లాంటి భాగంలో విషాన్ని నింపుకున్న వ్యవస్థ కలిగి ఉంటాయి.

ఇవి కుట్టినప్పుడు దద్దుర్లు, దురద కలుగుతాయి. కొన్నిసార్లు తీవ్ర అస్వస్థతకు గురవ్వొచ్చు. కానీ, ఇవి ప్రాణాంతకం కాదు.

జెల్లీ ఫిష్‌లకు దాడి చేసే స్వభావం ఉండదు. కేవలం తమని తాము రక్షించుకోవడానికే నెమటోసిస్ట్ (విషం ఉండే సూది)లతో కుడతాయి. జెల్లీ ఫిష్‌లు పెద్దగా ఈత వచ్చినవీ కావు, నీటి వాటం ఎటువైపు ఉంటే అటువైపు తేలిపోతూ ఉంటాయి. ఆ విధంగా జెల్లీలు తీరాలకు కొట్టుకుని పోతుంటాయి”

తూర్పు తీరంలో జెల్లీ ఫిష్‌లు

ఇంకా ఆమె ఏం చెప్పారంటే…

”భారతదేశపు తూర్పు తీరంలో (విశాఖ, చెన్నై, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో) జెల్లీ ఫిష్‌లు కనిపిస్తాయి. తూర్పు తీరంలో పోర్చుగీస్ మ్యాన్ ఓవార్, మూన్ జెల్లీ ఫిష్, బ్లూ డ్రాగన్ జెల్లీ ఫిష్‌లతో పాటు మరికొన్ని జెల్లీ ఫిష్ రకాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి.

అయితే వీటిలో పోర్చుగీస్ మ్యాన్ ఓవార్ జెల్లీ కుట్టినప్పుడు లేదా కాటు వేసినప్పుడు తీవ్రమైన మంటలా అనిపించి, వాంతులై.. అస్వస్థతకు గురయ్యే ప్రమాదముంది. మూన్ జెల్లీ తక్కువ విషపూరితమైనది.

ఇక, అంతర్వేది బీచ్‌లో కనిపించింది బ్లూ డ్రాగన్ జెల్లీ ఫిష్. ఇవి కాస్త విషపూరితమే. అంటే వీటి స్టింగ్‌ (కొండి)లో మనిషిని అస్వస్థతకు గురి చేసే స్థాయిలో విషం ఉంటుంది. ఇవి ఊదారంగులో ఉంటాయి. మరికొన్ని జెల్లీ ఫిష్‌లు గోధుమరంగులో ఉంటాయి. అవి కుట్టినప్పుడు చర్మంపై దద్దుర్లు ఏర్పడి, దురదగా ఉంటుంది.

జెల్లీ ఫిష్‌లు సముద్రాల్లోనే కాదు, చెరువులు, సరస్సులు అంటే ఫ్రెష్ వాటర్ బాడీలలో కూడా ఉంటాయి. అయితే ముఖ్యంగా వేసవి చివరి రోజుల్లో, వర్షాలు ప్రారంభం అవుతున్న సమయంలో ఈ జెల్లీలు తీర ప్రాంతాల్లో ఎక్కువగా కనపడతాయి.

ఈ సమయంలో ఒడ్డుకు వచ్చి జెల్లీ ఫిష్‌లు పిల్లలను వదులుతాయి. ఆహారం కోసమూ తీవ్రంగా వెతుకుతాయి. అప్పుడు మనుషులు, ఇతర ప్రాణులు ఎదురైతే తమని కాపాడుకునేందుకు కుడతాయి. తీరంలో జెల్లీలు కనిపిస్తే అందంగా ఉన్నాయని కొందరు పట్టుకునే ప్రయత్నం చేస్తారు. అది మంచిది కాదు. ఎందుకంటే అవి ఆందోళనకు గురై కుడతాయి” అని ప్రొఫెసర్ మంజులత వివరించారు.

విశాఖ రుషికొండ బీచ్‌లో డైవింగ్‌కు వెళ్లిన వారికి జెల్లీఫిష్‌లు కనిపించాయి.

రుషికొండ తీరంలోనూ..

మూడేళ్ల కిందట విశాఖ రుషికొండ బీచ్‌లో జెల్లీఫిష్‌లు కనిపించాయి. తీరానికి ఐదారు కిలోమీటర్ల దూరంలో సముద్రంలో కొందరు డైవింగ్ చేసినప్పుడు పసుపు రంగు జెల్లీ ఫిష్‌లు ఈదుతూ కనిపించాయి. వాటిని ఫోటోలు, వీడియోలు తీశారు.

అలాగే ఏడేళ్ల కిందట ముంబయిలో, ఐదేళ్ల కిందట గోవాలో జెల్లీ ఫిష్‌లు వందల సంఖ్యలో తీరం వద్దకు వచ్చి, అక్కడున్న సందర్శకులు, లైఫ్ గార్డులపై దాడి చేసిన సంఘటనలు ఉన్నాయని మాజీ నేవీ ఉద్యోగి, సీనియర్ స్కూబా డైవర్ బలరామ్ నాయుడు బీబీసీతో చెప్పారు.

“సముద్రంలో జెల్లిఫిష్ ఉండటం సహజమే. కానీ తీరంలో అరుదుగానే కనిపిస్తాయి. కానీ, బే ఆఫ్ బెంగాల్ లో వివిధ రంగుల్లో అంటే పసుపు, ఎరుపు, నారింజ, నీలం, తెలుపు రంగుల్లో జెల్లీ ఫిష్‌లు కనపడతాయి. రుషికొండ బీచ్‌లో కనిపించినవి 4 నుంచి 5 మీటర్ల పొడవు ఉన్నాయి. ఈ ఫిష్ బాడీలో 95 శాతం నీరే ఉంటుంది. ఇవి చిన్నవైతే గుంపులుగా, పెద్దవైతే ఒంటరిగా కనిపిస్తాయి” అని బలరామ్ నాయుడు వివరించారు.

తీరానికి ఎందుకు వస్తాయి?

“సాధారణంగా జెల్లీ ఫిష్‌లు సముద్రం మధ్య భాగాల్లో తేలియాడుతూ జీవిస్తాయి. కానీ, సముద్రపు గాలుల దిశ మారడం, ప్రవాహాల ప్రభావం వల్ల ఇవి ఒడ్డుకు కొట్టుకు వస్తాయి. అలాగే సముద్రపు ఉష్ణోగ్రత పెరిగినపుడు, కొన్ని జెల్లీ ఫిష్‌లు చల్లటి నీటిని వెతుకుతూ తీరం వైపు కదులుతుంటాయి. మరికొన్ని రకాల జెల్లీ ఫిష్‌లు చిన్న జీవులను ఆహారంగా తీసుకుంటూ, అవి ఎక్కువగా ఉండే తీర ప్రాంతాల దిశగా వస్తుంటాయి. అలాగే సముద్రాల్లో పెరుగుతున్న నీటి కాలుష్యంతో తీరం సమీపానికి వస్తుంటాయి” అని ప్రొఫెసర్ మంజులత అన్నారు.

జెల్లీ ఫిష్ కుడితే ఏం చేయాలి?

జెల్లీఫిష్ శరీరంలోని ఏదైనా భాగాన్ని తాకితే, అక్కడ మంట, నొప్పి, ఎర్రబారడం, పొక్కులు ఏర్పడే ప్రమాదం ఉందని విశాఖలోని డెర్మటాలజిస్ట్ డాక్టర్ ఆర్. కుమారి బీబీసీతో అన్నారు.

“జెల్లీఫిష్ శరీరానికి తాకితే ఆ భాగాన్ని కొబ్బరినూనె, వెనిగర్, ఉప్పునీరుతో శుభ్రపరచాలి. ఎందుకంటే విషపూరితమైన సూదుల్లాంటి నెమటోసిస్ట్‌లు మీ చర్మంలో ఉండిపోతాయి. అవి మళ్లీ విషం విడుదల చేసే ప్రమాదం ఉంటుంది. శరీర భాగాన్ని శుభ్రపరిస్తే నెమటోసిస్టులు చనిపోతాయి. జెల్లీఫిష్ కుడితే చర్మరోగాలే కాదు, అస్వస్థతకు గురయ్యే ప్రమాదమూ ఉంది. అందుకే, వెంటనే ప్రాథమిక వైద్యం పొందాలి” అని డాక్టర్ ఆర్. కుమారి చెప్పారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.