ఆయిల్ పామ్‌ సాగుకు రైతుల మొగ్గు.. మూడేళ్ల కాలం.. ముప్పైఏళ్ల లాభం

ఒకసారి మొక్కలు నాటితే వాటికి ముప్పై ఏళ్ల పాటు దిగుబడి వచ్చే ఆయిల్ పామ్ సాగుపై రైతుల్లో ఆసక్తి పెరుగుతోంది. మొక్కల దగ్గర నుంచి మార్కెటింగ్ దాకా ప్రభుత్వం సహకారం అందిస్తుండడంతో రైతులు కూడా దీని సాగుపట్ల ఆసక్తి కనబరుస్తున్నారు.


ఉద్యాన వన శాఖ అధికారులు రైతులకు ఈ పంటపై అవగాహన కల్పిస్తూ సాగుపై ఆసక్తి పెంపొందించేలా చర్యలు తీసుకుంటున్నారు.

సర్కారు ప్రోత్సాహం..

దేశంలో వంట నూనెల్లో ఎక్కువగా పామాయిల్ వాడుతున్న విషయం తెలిసిందే. అయితే డిమాండ్ కు సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో ప్రభుత్వం ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. దేశీయం ఉత్పత్తి పెంచితే రైతులకు ఆదాయం పెరగడంతో పాటు దేశం ఆర్థికంగా ముందు కెళ్తుందన్న లక్ష్యంతో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా నర్సరీలో ఒక్కో మొక్క రూ.193 ఉండగా, రైతుల నుంచి కేవలం రూ.20 మాత్రమే వసూలు చేస్తున్నారు. మిగతా రూ.173 (దాదాపు 90 శాతం)ను ప్రభుత్వమే చెల్లిస్తోంది.

అంతేకాదు మొక్కలు నాటిన తర్వాత నిర్వహణ ఖర్చుల కింద ఎకరాకు రూ.4,200 చొప్పున నాలుగేళ్ల పాటు ప్రోత్సాహకంగా అందిస్తోంది. డ్రిప్ ఇరిగేషన్ కింద సబ్సిడీపై 12.20 ఎకరాల వరకు డ్రిప్ సదుపాయం కల్పిస్తోంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, బీసీలకు 90 శాతం, ఓసీ రైతులకు ఐదు ఎకరాల వరకు 90 శాతం, ఐదెకరాలు దాటితే 80 శాతం వరకు సబ్సిడీ ఇస్తోంది. అంతే కాదు పంటను కొనుగోలు చేయడానికి జిల్లాకో ఆయిల్ కంపెనీలకు ప్రభుత్వమే కాంట్రాక్టు ఇస్తోంది.

ఎకరాకు 10 నుంచి 15 టన్నుల దిగుబడి

ఆయిల్ పామ్ మొక్కలు ఎకరాకు 55 వరకు నాటుతారు. మూడేండ్లు పూర్తయిన తర్వాత నాలుగో యేడాది నుంచి దిగుబడి (4 నుంచి 6 టన్నులు) మొదలవుతుంది. ఐదో సంవత్సరంలో (8 నుంచి 10 టన్ను లు), ఆరో సంవత్సరం పూర్తి స్థాయిలో (10 నుంచి 15 బన్నులు) దిగుబడి లభిస్తుంది. ఇది 30 నుంచి 35 ఏళ్ల వరకు కొనసాగుతుంది. ప్రస్తుతం టన్నుకు రూ.17 వేలు పలుకుతోంది.

ఈ లెక్కన సరాసరిగా ఎకరాకు రూ.2.50 లక్షలు వస్తుంది. ఇందులో 50- 60 వేలు ఖర్చులు పోనూ దాదాపు రూ.2 లక్షల వరకు ఆదాయం వస్తుంది. మార్కెట్ సీజన్ ను బట్టి ధరలు కొద్దిగా మార్పులు ఉండవచ్చు. అంతేకాదు ఈమొక్కల మధ్య కూరగాయలు, ఆకుకూరలను అంతర పంటలుగా వేసుకోవచ్చు. మొదటి మూడు సంవత్సరాలు మొక్కజొన్న, వేరుశనగ, పత్తి పంటలను కూడా అంతర పంటలుగా సాగు చేసుకోవచ్చు.

కేశంపేటలో 434 ఎకరాలలో సాగు..

కేశంపేట మండలంలో 434 ఎకరాలలో 103 రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారు. 2023-24 సంవత్సరం నుండి రైతులు ఇక్కడ ఆయిల్ ఫామ్ తోటలు సాగు చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు కూడా చాలా మంది రైతులు ఆసక్తి కనబరుస్తున్నారని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. పంటి దిగుబడి ప్రారంభం కాని సమయంలో ఎలాంటి అంతర పంటలైన వీటి మధ్య సాగు చేసుకోవచ్చు. వరి, చెరుకు లాంటి పంటలు, అలాగే దీర్ఘకాలిక పంటలు మాత్రం సాగు చేసుకోరాదని అధికారులు తెలిపారు.

తక్కువ శ్రమతో అధిక లాభాలు

ఉద్యానవన పంటలలో ప్రస్తుతం మార్కెట్ ఉన్న పంట ఆయిల్ ఫామ్ మాత్రమే, ఆయిల్ కంపెనీలతో ఒప్పందం చేసుకొని సాగు చేసే పంట కనుక రైతులకు అమ్మకానికి కూడా ఇబ్బందులు కలగవు. ఆయిల్ పామ్ సాగుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అన్నివిధాలుగా ప్రోత్సాహం అందిస్తోంది. సబ్సిడీ కింద మొక్కలు, డ్రిప్ ను అందించడమే కాకుండా, నాలుగేళ్ల పాటు నిర్వహణ ఖర్చులు కూడా ఇస్తోంది. దిగుబడి ప్రారంభం అయ్యేలోపు అంతర పంటల సాగు ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. వరి, పత్తి లాంటి పంటలతో పోలిస్తే పెట్టుబడి కూడా తక్కువగానే ఉంటుంది. అలాగే తక్కువ శ్రమతో అధిక లాభాలు సాధించే అవకాశం ఉంది. ఫామ్ ఆయిల్ సాగు చేయాలనుకుంటున్న రైతులు నన్ను 8977714220 ఈ నెంబర్ లో సంప్రదించవచ్చు.

నాలుగున్నర ఎకరాల్లో సాగు చేస్తున్నా..

ఆరు నెలల క్రితం నాలుగున్నర ఎకరాలలో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటాను. అంతర పంటగా టమాట, వేరుశనగను కూడా సాగు చేశాను. ఇప్పటికైతే మొక్కలు నాటిన తర్వాత నిర్వహణ ఖర్చుల కింద ఎకరాకు రూ.4,200 చొప్పున అధికారులు అందజేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లి ఆయిల్ ఫామ్ సాగు మెలకువలను కూడా అధికారులు రైతులకు తెలిసేలా చర్యలు తీసుకుంటున్నారు. పంట సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. వీటికి అడవి పందులు, కోతులు, పక్షులు ఇలా వేటి నుండి కూడా బెడద లేదు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.