ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మరో శుభవార్త అందించింది. వారసత్వ భూముల సంక్రమణ భాగస్వామ్య (సక్సెషన్) రిజిస్ట్రేషన్లను సర్కారు మరింత సులభతరం చేసింది.
ఇకపై గ్రామ/వార్డు సచివాలయాల్లోనే నామమాత్రపు ఫీజుతో జరగనున్నాయి.
సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ నుంచి త్వరలోనే ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు రానున్నాయి. ఇది భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేయడంతో పాటు, రైతులు, సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించనుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కొత్త విధానం వివరాలు..
నామమాత్రపు ఫీజు..
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం నిర్ధారించిన మార్కెట్ విలువ ప్రకారం ఆస్తి విలువ రూ.10 లక్షల లోపు ఉంటే రూ.100.. ఆపైన ఉంటే రూ.1,000 ఫీజును స్టాంపు డ్యూటీ కింద తీసుకోనున్నారు.
ఎవరికి వర్తిస్తుంది..
ఈ సౌకర్యం ఆస్తి యజమానులు మరణించిన అనంతరం వారసులకు సంక్రమించే ఆస్తులకు మాత్రమే వర్తిస్తుంది. మిగిలిన అన్ని రకాల రిజిస్ట్రేషన్లు యథావిధిగా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే జరుగుతాయి.
ప్రక్రియ సరళీకరణ..
తల్లిదండ్రులు మరణించిన తర్వాత వారసత్వంగా వచ్చే ఆస్తులను వారసులు ఇప్పుడు తహసీల్దారుకు దరఖాస్తు చేసుకోవడానికి, మ్యుటేషన్ల కోసం పదే పదే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. గత ఏడాదిలో సుమారు 55 వేల ఫిర్యాదులు మ్యుటేషన్ల ఆలస్యంపై ప్రభుత్వానికి అందాయి. ఈ కొత్త విధానంతో ఆ సమస్య పరిష్కారం కానుంది.
వారసులకు కలిగే ప్రయోజనాలు..
గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా ఇప్పటికే మరణ ధ్రువీకరణ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు జారీ అవుతున్నాయి. యజమాని మరణించిన అనంతరం ఆస్తులను వారసులు భాగాలు చేసుకుని లిఖితపూర్వకంగా ఏకాభిప్రాయంతో సచివాలయానికి వస్తే, అక్కడ పనిచేసే డిజిటల్ అసిస్టెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తారు. ఈ రిజిస్ట్రేషన్లు ఎలా చేయాలన్న దానిపై డిజిటల్ అసిస్టెంట్లకు కూడా మరోదఫా శిక్షణ ఇవ్వనున్నారు.
ఆటోమేటిక్ మ్యుటేషన్..
రిజిస్ట్రేషన్ చేయడం వల్ల భూముల రికార్డుల్లో వివరాల నమోదు (మ్యుటేషన్) ఆటోమేటిక్‌గా జరుగుతుంది.
ఈ-పాస్‌బుక్ జారీ..
వారసులకు ఈ-పాస్‌బుక్ కూడా జారీ అవుతుంది.
ఈ-కేవైసీ..
వారసులుగా ఉన్న వారి నుంచి ఈ-కేవైసీ సైతం తీసుకుంటారు.
సమస్యల పరిష్కారం..
తమ ఆస్తికి ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించాలి అనే ఉద్దేశంతో కొందరు ఉండటం వల్ల, చనిపోయిన వారి పేర్లు భూముల రికార్డుల్లో అలాగే ఉండిపోయి అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ కొత్త విధానం ఈ సమస్యలకు చెక్ పెడుతుంది.
అమలు ప్రణాళిక..
సీఎం చంద్రబాబు ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో జారీచేసిన ఆదేశాల మేరకు, రెవెన్యూ శాఖ నుంచి ఈ విధానం అమలుపై మార్గదర్శకాలు రానున్నాయి. దీనికి అనుగుణంగా రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ చర్యలు తీసుకుంటుంది. ఈ ప్రక్రియ అమలు కావడానికి కనీసం రెండు, మూడు నెలల సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు.































