ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్ ప్రపంచంలోనే తొలిసారిగా 2030 నాటికి పూర్తిగా నీరు లేకుండా మిగిలిపోయే నగరంగా ఉండనుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
మారుతున్న పర్యావరణ పరిస్థితులు వాతావరణ మార్పులతో కాబూల్ పట్టణం నానాటికి కరువు కోరల్లోకి చిక్కుకుంటోంది. అక్కడ ప్రతి సంవత్సరం వర్షపాతం అతి తక్కువగా నమోదు అవుతోంది. ఫలితంగా త్వరలోనే కాబూల్ ప్రపంచంలోనే నీరు లభించని తొలి నగరంగా మిగిలిపోయే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. అందుకు దారితీస్తున్న కారణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాబూల్ లో భూగర్భ జలాల స్థాయి గత దశాబ్దంతో పోల్చి చూస్తే దాదాపు 25 మీటర్ల స్థాయికి పడిపోయాయి అని చెప్పవచ్చు. ప్రతి ఏడాది 44 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు అధికంగా తోడుతున్న నేపథ్యంలో త్వరలోనే ఈ నీరు కూడా ఇంకిపోవడంతో కాబుల్ పూర్తిగా నీరు లేకుండా మిగిలే నగరంగా మారనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. . యూనిసెఫ్ తెలిపిన సమాచారం ప్రకారం ఇప్పటికే సగానికి పైగా బోర్ వెల్స్ పూర్తిగా ఎండిపోయాయి. కాబూల్ పట్టణంలో దాదాపు 1.2 లక్షల బోర్వెల్స్ ఉన్నాయి. వీటిలో దాదాపు 40% పైగా ఎండిపోయినట్లు అంచనా వేస్తున్నారు. ఇందులో 60% మాత్రమే పని చేస్తున్నాయి.
సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేక పోవడంతో కాబుల్ భూగర్భ జలాలు దాదాపు 80% కలుషితమైనట్లు అంచనా వేస్తున్నారు ముఖ్యంగా ఇక్కడి భూగర్భ జలాల్లో ఆర్సినిక్ వంటి విష పదార్థాలు సైతం లభ్యమవుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. దీనికి ప్రధానమైన కారణం కాబూల్ నగరం జనాభా ప్రధాన ఎక్కువగా పెరిగిపోవడమే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా కాబూల్ జనాభా 2001లో 10 లక్షలు ఉండగా ఇప్పుడు అది 60 లక్షలకు చేరింది. గడచిన ఈ రెండు దశాబ్దాల్లో యుద్ధాలు జరిగిన నేపథ్యంలో ప్రజలంతా గ్రామీణ ప్రాంతాలను విడిచిపెట్టి కాబూల్ పట్టణం వైపే సాగారు. దీని ఫలితంగా ప్రజల కోసం మంచినీటిని సరఫరా చేసే కంపెనీలు సైతం పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. వీరికోసమని పెద్ద ఎత్తున భూగర్భ జలాలను దుర్వినియోగం చేయడం ప్రారంభించాయి. ఉదాహరణకు అల్కాజాయి అనే ఒక కంపెనీ దాదాపు 25 లక్షల లీటర్ల నీటిని ప్రతిరోజు తోడేస్తుందని ఒక రిపోర్టులో పేర్కొంది.
దీనికి తోడు వాతావరణ మార్పులు కూడా ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితిని రోజు రోజుకు దెబ్బతీస్తున్నాయని రిపోర్టులు చెబుతున్నాయి. ముఖ్యంగా గడచిన పది సంవత్సరాల్లో కేవలం 45% మాత్రమే వర్షపాతం నమోదైనట్లు ఒక అధ్యయనంలో వెలువడింది అలాగే ఆఫ్ఘనిస్తాన్కు నీటి వనరును అందించే హిందూ కుష్ పర్వతాల్లోని మంచు నానాటికి తగ్గిపోతుంది దీనికి ప్రధాన కారణం ఉష్ణోగ్రతలు పెరగడమే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ లో నిర్మిస్తున్న భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం సైతం నిలిచిపోవడంతో ప్రస్తుతం ఈ పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు గతంలో జర్మన్ బ్యాంకు మద్దతుతో ప్రారంభించిన లోగార్ నీటి ప్రాజెక్టు ప్రస్తుతం నిలిచిపోయింది. అలాగే భారత్ నిర్మిస్తున్నటువంటి షాహ్ తూత్ డ్యాం పనులు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో కాబూల్ కరువు కోరల్లోకి చిక్కుకుంది.































