ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా సాధికారతను బలోపేతం చేయడం కోసం మరో ముందడుగు వేసింది. డ్వాక్రా సంఘాలను దృష్టిలో ఉంచుకొని.. స్త్రీనిధి సంస్థలో చోటుచేసుకుంటున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.
రుణాల వసూలు ప్రక్రియను పారదర్శకంగా మార్చడం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ‘రికవరీ యాప్’ను అందుబాటులోకి తీసుకు రానుంది. ఈ యాప్ ద్వారా ఆగస్టు నెల నుంచి డ్వాక్రా సంఘాల మహిళలు తమ రుణ వాయిదాలను నేరుగా ఆన్‌లైన్ ద్వారా చెల్లించేందుకు సిద్దం చేస్తున్నారు.
గతంలో మహిళలు తమ వాయిదాలను విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకు (VOA) నగదు రూపంలో చెల్లించేవారు. అనంతరం వారు వాటిని గ్రామ సంఘాల ద్వారా స్త్రీనిధి ఖాతాలో జమ చేయాల్సి ఉండేది. అయితే ఈ ప్రక్రియలో రెండు ప్రధాన సమస్యలు ఎదురయ్యాయి. వాటిలో ముందుగా చెల్లింపు చేసినప్పటికీ VOA లు ఖాతాలో జమ చేయకపోవడం.. అందువల్ల మహిళలకు జరిమానాలు, క్రెడిట్ స్కోర్ దెబ్బతినే పరిస్థితులు రావడం జరిగాయి. అంతే కాకుండా స్థానిక అధికారులపై అక్రమ లావాదేవీల ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
రికవరీ యాప్ లక్ష్యాలు..
మహిళలు ఇక తమ వాయిదాలను యాప్ ద్వారా నేరుగా స్త్రీనిధి ఖాతాలో జమ చేయగలుగుతారు.
విలేజ్ స్టాఫ్‌పై ఆధారపడాల్సిన అవసరం లేకుండా మధ్యవర్తిత్వ వ్యవస్థకూ చెక్ పెట్టడం
వాయిదా చెల్లించిన వెంటనే మొబైల్‌కు మెసేజ్, రసీదు, లావాదేవీ స్టేటస్ లభించనుండటం.
సకాలంలో క్రెడిట్ అప్‌డేట్ అవ్వడంతో.. భవిష్యత్‌లో రుణాలు పొందడం సులభం అవుతుంది.
బ్యాంక్ లింకేజ్ రుణాల పంపిణీ కూడా ఈ యాప్ ద్వారా మరింత సమర్థవంతంగా జరుగుతుంది.
గత ప్రభుత్వం మీద ఆరోపణలు..
గత ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు రుణాలు ఇవ్వడానికి వాణిజ్య బ్యాంకుల నుండి రూ.1,000 కోట్లు అప్పు తెచ్చిందని, కానీ ఆ డబ్బును ఇతర అవసరాలకు మళ్లించారని ఆరోపణలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో మహిళలు వాయిదాలు సక్రమంగా చెల్లించినా, ఆ డబ్బు సంస్థకు చేరకుండా పక్కదారి పట్టించారని విమర్శలు ఉన్నాయి. ‘రికవరీ యాప్’ ద్వారా ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
































