రేపు భారత్​ బంద్​- మరి స్కూల్స్​, కాలేజీలు, బ్యాంకులకు సెలవు ఉందా?

బ్యాంకింగ్, బీమా, పోస్టల్, నిర్మాణం వంటి ప్రభుత్వ సేవల రంగాలు సహా 25 కోట్లకు పైగా కార్మికులు జులై 9, బుధవారం దేశవ్యాప్త సమ్మెకు దిగనున్నారు. రేపు జరగనున్న ఈ ‘భారత్ బంద్’ కారణంగా దేశవ్యాప్తంగా అనేక సేవలకు తీవ్ర అంతరాయం కలిగించే అవకాశం ఉంది!


“ప్రభుత్వ కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, దేశ వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలకు” వ్యతిరేకంగా పలు కార్మిక సంఘాల కార్మికులు నిరసన తెలపనున్నారు.

10 కేంద్ర కార్మిక సంఘాలు, వాటి అనుబంధ సంస్థల వేదిక జులై 9న సార్వత్రిక సమ్మె/ ‘భారత్ బంద్’కు పిలుపునిచ్చింది. “దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను ఘన విజయం సాధించాలని” కార్మికులను కోరింది. అధికారిక, అనధికారిక/అసంఘటిత ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలలో యూనియన్ల సన్నాహాలు జరుగుతున్నాయని కూడా పేర్కొంది.

ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నుంచి అమర్‌జీత్ కౌర్ పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. “25 కోట్లకు పైగా కార్మికులు సమ్మెలో పాల్గొంటారని అంచనా. రైతులు, గ్రామీణ కార్మికులు కూడా దేశవ్యాప్తంగా నిరసనలలో చేరతారు,” అని తెలిపారు.

కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాకు గత ఏడాది 17-సూత్రాల డిమాండ్ పత్రాన్ని సమర్పించినట్లు కార్మిక సంఘాల వేదిక తమ తాజా ప్రకటనలో తెలిపింది.

రేపు భారత్ బంద్ ఎందుకు?

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఈ బంద్‌కు పిలుపునిచ్చారు. 10 సంవత్సరాలుగా ప్రభుత్వం వార్షిక కార్మిక సదస్సును నిర్వహించడం లేదని, కార్మిక శక్తి ప్రయోజనాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటోందని యూనియన్ల వేదిక తన ప్రకటనలో ఆరోపించింది. సమిష్టి బేరసారాలను బలహీనపరచడానికి, యూనియన్ల కార్యకలాపాలను అణచివేయడానికి, ‘వ్యాపారం చేయడంలో సౌలభ్యం’ పేరుతో యజమానులకు అనుకూలంగా ఉండేలా నాలుగు కార్మిక కోడ్‌లను అమలు చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించింది.

దేశ సంక్షేమాన్ని ప్రభుత్వం విడిచిపెట్టిందని, విదేశీ భారత కార్పొరేట్‌ల ప్రయోజనాల కోసం పనిచేస్తోందని, ఇది దాని విధానాల ద్వారా స్పష్టంగా కనిపిస్తోందని వేదిక పేర్కొంది. “ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రజా సేవల ప్రైవేటీకరణ, అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టరీకరణ, కార్మికులను సాధారణీకరణ చేసే విధానాలకు” వ్యతిరేకంగా కార్మిక సంఘాలు పోరాడుతున్నాయని తెలిపింది.

బ్యాంకులు, పాఠశాలలు, కళాశాలలు రేపు తెరిచి ఉంటాయా?

సమ్మె కారణంగా బ్యాంకింగ్, పోస్టల్, బొగ్గు గనులు, కర్మాగారాలు, ప్రభుత్వ రవాణా సేవలు ప్రభావితమవుతాయని హింద్ మజ్దూర్ సభ నుంచి హర్భజన్ సింగ్ సిద్ధూ పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు.

అంతేకాకుండా, బ్యాంకు ఉద్యోగుల సంఘం సోమవారం మాట్లాడుతూ.. బ్యాంకింగ్ రంగం ఈ భారత్ బంద్‌లో పాల్గొంటుందని తెలిపింది. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్​కు అనుబంధంగా ఉన్న బెంగాల్ ప్రావిన్షియల్ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్, బీమా రంగం కూడా సమ్మెలో చేరాలని నిర్ణయించుకున్నాయి.

జులై 9న దేశంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగవచ్చు, ఎందుకంటే 27 లక్షలకు పైగా విద్యుత్ కార్మికులు రేపటి భారత్ బంద్‌లో పాల్గొననున్నారు.

జులై 9న బ్యాంకులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు అధికారిక సెలవు ప్రకటించనప్పటికీ, సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.

భారత్ బంద్ కారణంగా పాఠశాలలు, కళాశాలలకు ఎటువంటి సెలవు నోటిఫికేషన్లను రాష్ట్రాలు ఇంకా జారీ చేయలేదు. కనుక అవి తెరిచే ఉంటాయని భావిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.