గత 70 ఏళ్ల పాటు ఉద్యోగులు, పెన్షనర్లు పోరాడి పెన్షన్‌కు సంబంధించి కొన్ని హక్కులను సాధించుకున్నారు. ‘పెన్షన్ దయాధర్మ బిక్షం కాదు. ఉద్యోగుల హక్కు, తాము పనిచేసిన కాలంలో భవిష్యత్తు కోసం పొదుపు చేసుకున్న సొమ్ము’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
ఇలాంటి చక్కని తీర్పులను, హక్కులను ఒకే ఒక్క దెబ్బతో మోడీ ప్రభుత్వం బూడిదలో కలిపేస్తోంది.
మార్చి 25న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ రూల్స్‌కు అతి ప్రమాదకరమైన, తీవ్ర నష్టదాయకమైన సవరణలను లోక్‌సభలో ఆర్థిక బిల్లులో భాగంగా ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వం పాస్ చేయించుకుంది. “సీసీఎస్ నిబంధనలు, భారతదేశ కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి పెన్షన్ బాధ్యతలపై ఖర్చు కోసం “సీసీఎస్(పెన్షన్) నియమాలు, సూత్రాల ధ్రువీకరణ” అనే చట్టాన్ని లోక్‌సభ ఆమోదించింది. ఇప్పుడు అది రాజ్యసభకు వెళ్లనుంది.
సుప్రీంకోర్టు చెప్పినా..
ఇప్పటివరకు, పే కమిషన్ల సిఫార్సులన్నీ పెన్షనర్లకు ఒకే విధంగా వర్తించబడ్డాయి. కానీ, మొదటిసారిగా, మోడీ ప్రభుత్వం పెన్షనర్లలో వివక్ష చూపడానికి చట్టం ద్వారా ఏకపక్ష అధికారాలను తీసుకుంది. ఇది పెన్షనర్లపై తీవ్రమైన దెబ్బ. రాజ్యసభలో కూడా ఈ బిల్లు పాసయితే అది చట్టమై, 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు నష్టం అవడమే గాక, కోట్లాది మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, బీమా, బ్యాంకు తదితర అన్ని రంగాల ఉద్యోగులకు, పెన్షనర్లకు కూడా ఉరితాడు అవుతుంది. ఈ సవరణలు పెన్షన్ విధానంలో ముఖ్యమైన మార్పులకు దారి తీస్తున్నాయి. పే కమిషన్ లాభాలు భవిష్యత్‌కు మాత్రమే.. అంటే పే కమిషన్ సిఫార్సులు అమలైన తేదీ తరువాత పదవీ విరమణ పొందిన ఉద్యోగులకే వర్తించనున్నాయి. ఆ తేదీకి ముందు రిటైర్ అయిన పెన్ష నర్లకు పెరిగిన వేతన ప్రయోజనాలు వర్తించవు.. పే కమిషన్ సిఫార్సులను ఎప్పుడు, ఎలా అమలు చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వం కలిగి ఉంటుంది. సుప్రీంకోర్టు గతంలో పెన్షనర్లను పదవీ విరమణ తేదీ ఆధారంగా వేరుచేయడం అసమంజసమని తీర్పు చెప్పింది. అయినప్పటికీ ఈ బిల్లు ద్వారా ప్రభుత్వం ఆ తీర్పును కాలరాస్తూ పెన్షన్లను పదవీ విరమణ తేదీ ఆధారంగా నిర్ణయించడానికి అధికారం కల్పిస్తోంది.
అప్రజాస్వామికంగా బిల్లు ఆమోదించుకొని..
ఈ పెన్షన్ సవరణ బిల్లును సరాసరి లోక్‌సభలో ప్రవేశ పెడితే తీవ్ర వ్యతిరేకతకు గురై అభాసుపాలు అయిపోతామన్న భయంతో దొంగ చాటుగా ‘ఆర్థిక బిల్లులో’ చొప్పించి ఆమోదింపచేసుకోవడంలోనే దీని దుర్నీతి అర్థమవుతుంది. ఈ బిల్లు చట్టం అయితే దేశంలోని సీనియర్ పెన్షనర్లు అందరూ రిటైర్ అయ్యాక ఫిక్స్ అయిన పెన్షన్ తప్ప ఎటువంటి ‘అప్డేషన్’ లేక జీవితం గడపాల్సి ఉంటుంది. మోడీ ప్రభుత్వ విధానాలను లోతుగా అర్థం చేసుకున్న వారెవరికీ ఈ నిర్ణయమేమీ ఆశ్చర్యం కలిగించదు.. ‘కాకులను కొట్టి గద్దలకు వేసే’ చందంగానే కోట్లాది మంది శ్రామికుల కష్టార్జితాన్ని కొద్ది మంది సంపన్నులకు దోచిపెట్టడమే మోడీ ప్రభుత్వ విధానం. ఈ ప్రభావంతో నేడు దేశంలో అసమానతలు తీవ్రంగా పెరుగుతున్నాయి.
పేరులోనే పెన్షన్ కానీ..
దేశంలో అత్యధిక మందికి వర్తించే ‘ఎంప్లాయిస్ పెన్షన్ స్కీం 1995’లో నేడు పెన్షన్ అత్యంత తక్కువగా ఉంది. మూడు దశాబ్దాలకు పైగా సర్వీసు చేసిన ఒక ప్రభుత్వ ఉద్యోగికి మూడు వేల రూపాయల పెన్షన్ రావడం గగనంగా మారింది. అందుకే కనీస పెన్షన్ 9 వేల రూపాయలకు పెంచాలని, దానిపై కరవు భత్యం చెల్లించాలనే పెన్షనర్ల డిమాండుకు మోడీ ప్రభుత్వం ససేమిరా నిరాకరిస్తోంది. వాజపేయ్ ప్రధానిగా ఉన్న సమయంలో అప్పటి వరకు ఉద్యోగులకున్న పాత పెన్షన్ స్కీం(ఓపీస్)ను రద్దు చేసి, 2004 జనవరి తరువాత కేంద్ర సర్వీసుల్లో చేరిన వారికి నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్) అనే పథకాన్ని ఇలాగే ఏకపక్షంగా ప్రవేశ పెట్టింది. పెన్షన్ ఎంత వస్తుందో కూడా తెలియని పథకం ఇది. దీన్ని రద్దు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తే.. కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తూ, దాని కంటే ఘోరంగా యూనిఫైడ్ పెన్షన్ స్కీం(యూపీఎస్) అనే పొదుపు సొమ్మును హరించే మరో పథకాన్ని ప్రవేశ పెట్టింది. దీనిని కూడా ఉద్యోగ, పెన్షనర్ల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే ఈ పెన్షన్ పథకాలన్నీ, వాటి నిధులతో షేర్ మార్కెట్లో జూదమాడడం ద్వారా కార్పొరేట్లకు సిరులు కురిపించేవే. అందుకే ఇవన్నీ పేరులోనే ఉద్యోగుల పెన్షన్ తప్ప ఆచరణలో కార్పొరేట్ సంక్షేమ పథకాలే.
ఉద్యోగులు, పెన్షనర్లు ఏకమై..
‘ఉన్ని బట్టలు ఇమ్మంటే ఉన్న బట్టలే పీకేసినట్లు’, నేడు మోడీ ప్రభుత్వం ఉద్యోగుల సమంజస డిమాండ్లనింటినీ బేఖాతరు చేస్తూ, ఓపీస్ పెన్షన్ దారుల హక్కులను కూడా హరించి వేస్తూ ఈ చట్ట సవరణకు శ్రీకారం చుట్టింది. ఇది ఏ రకంగానూ సమర్ధనీయం కాదు. ఆ దారిలోనే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పయనిస్తాయండంలో సందేహం లేదు. ఒకవేళ అవి చేయకపోయినా, వాటితో ఆ పని చేయించే కళ మోడీ ప్రభుత్వం వద్ద ఉంది. అందువల్ల మోడీ ప్రభుత్వ ఈ చట్టం దేశంలోని పెన్షన్ దారులందరికీ ఉరితాడే అనడంలో సందేహం లేదు. అందుకే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలందరూ సమైక్యంగా ఉద్యమించి, ఓపీస్ సాధన, ఇటువంటి తిరోగమన చర్యలను తిప్పి కొట్టడమే ఏకైక మార్గం. ఇటువంటి ఉద్యోగ వ్యతిరేక ప్రభుత్వ కపటత్వాన్ని చైతన్యంతో ఎదుర్కోవడమే పరిష్కారం.
































