ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పెట్టుబడుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం వివిధ రంగాలకు చెందిన పెట్టుబడిదారులకు రాష్ట్రంలో పరిస్ధితుల్ని వివరించడంతో పాటు భూములు, రాయితీలు కూడా ఆఫర్ చేస్తోంది.
అయినా పెట్టుబడుల రాక అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో రాష్ట్ర ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ పరిస్ధితికి కారణం వైసీపీ అధినేత వైఎస్ జగనే అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా జగన్ అడ్డుపడుతున్నారని ఆర్థికమంత్రి పయ్యావుల ఆరోపించారు. ముఖ్యంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టొద్దంటూ పారిశ్రామికవేత్తలకు లేఖలు రాయిస్తున్నారని ఆరోపించారు. ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తితో పెట్టుబడిదారులకు ఏకంగా 200 మెయిల్స్ పెట్టించారని జగన్ పై పయ్యావుల సంచలన ఆరోపణలు చేశారు. ఆ తర్వాత లేళ్ల అప్పిరెడ్డిని తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు. తాను పక్కా ఆధారాలతోనే మాట్లాడుతున్నానని పయ్యావుల తెలిపారు.
రాష్ట్రంలో భయంకర కుట్రలకు జగన్ తెరలేపుతున్నారంటూ ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ ఇవాళ షాకింగ్ ఆరోపణలు చేశారు. ఏపీ బ్రాండ్ దెబ్బతీసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారన్నారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా జగన్ వైఖరిలో ఎలాంటి మార్పూ రాలేదని ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే జగన్ ఓర్వలేక కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తనకు ఓట్లు వేయలేదని ప్రజలపై అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆక్షేపించారు.
జగన్ ఎన్ని కుట్రలు చేస్తున్నా ఏపీ బ్రాండ్ మాత్రం ఎక్కడా తగ్గలేదని ఆర్ధికమంత్రి తెలిపారు. గత వైసీపీ హయాంలో ఆర్థిక విధ్వంసం సృష్టించారని, జగన్ నీ ఏడుపు ఇంకెంతకాలమని ఆయన్ను పయ్యావుల ప్రశ్నించారు.
ఏపీ బ్రాండ్ ను దెబ్బతీసేందుకై మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఆర్థిక శాఖ మంత్రి కుట్రలు చేస్తూ రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నదంటూ గగ్గోలు పెడుతున్నారని జగన్, బుగ్గన రాజేంద్రనాథ్ పై పయ్యావుల మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వ ఖజానా మరియు ప్రజలపై అవ్యాజమైన ప్రేమను చూపిస్తున్నట్లు నటిస్తూ రాష్ట్రాభివృద్దిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రజలు తమకు ఓట్లు వేయలేదనే అక్కసుతో ప్రజల సంక్షేమాన్ని, అభివృద్దిని అడ్డుకునేందుకు పరోక్షంగా ప్రయత్నిస్తున్నారన్నారు.
రాష్ట్రాభివృద్దికై ఏపిఎండిసి ద్వారా రూ.9 వేల కోట్ల మేర రుణం తెచ్చేందుకు ప్రభుత్వం జి.ఓ.నెం.32 ను ఈ ఏడాది మార్చిలో జారీ చేసినప్పటి నుండి ఆ ఋణం రాకుండా అడ్డు పడేందుకు విఫలయత్నం చేశారన్నారు. జర్మనీలో పనిచేస్తున్న విప్రో ఉద్యోగి ఉదయభాస్కర్ అనే అతనితో బాంబో మార్కెట్లోని పెట్టుబడిదాలు అందరికీ పెట్టుబడులు పెట్టవద్దు అంటూ దాదాపు 200 మెయిల్స్ పంపించారన్నారు. వైసీపీ రాజ్య ఎంపీలు, ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీ సభ్యులతో కేంద్ర ప్రభుత్వానికి , ఆర్.బి.ఐ.కి , సెబీ కి ఫిర్యాదులు పెట్టించారన్నారు. వారి పార్టీ సభ్యులు లేళ్ల అప్పరెడ్డితో హైకోర్టులో పిల్ వేయించారన్నారు.
































