ఇంటర్ విద్యార్థి ప్రతిభకు పవన్ కళ్యాణ్ ఫిదా.. లక్ష రూపాయల నజరానా

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఓ ఇంటర్ విద్యార్థి ప్రతిభను గుర్తించి ఆయనకు ప్రోత్సాహకంగా లక్ష రూపాయల నజరానా ప్రకటించి ఉదారతను చాటారు.


సాధారణ కుటుంబానికి చెందిన విద్యార్థి రూపొందించిన వినూత్న సైకిల్‌ను స్వయంగా తొక్కుతూ, అతడి ప్రతిభను మెచ్చుకున్నారు.

విజయనగరం జిల్లా జాడవారి కొత్తవలసకు చెందిన రాజాపు సిద్ధూ, ప్రయాణ ఖర్చులు తగ్గించుకునేందుకు తానే స్వయంగా బ్యాటరీతో నడిచే సైకిల్ రూపొందించాడు. ఈ సైకిల్ కేవలం మూడు గంటల ఛార్జ్‌తో 80 కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేయగలదని అతను తెలిపాడు.

సిద్ధూ ప్రతిభకు సంబంధించిన వివరాలు సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న పవన్ కల్యాణ్, ఆయనను మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించారు. అక్కడ సిద్ధూ రూపొందించిన సైకిల్‌పై కూర్చుని స్వయంగా తొక్కి అతడికి మరింత ఉత్సాహాన్నిచ్చారు.

అంతేకాకుండా, సిద్ధూకు భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణల దిశగా దూసుకెళ్లేందుకు ప్రోత్సాహంగా లక్ష రూపాయల చెక్కును అందజేశారు. అలాగే సిద్ధూ రూపొందించిన ‘గ్రాసరీ గురూ’ అనే వాట్సాప్ సేవా బ్రోచర్‌ను కూడా పవన్ పరిశీలించి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.