ఛార్జర్‌ను ప్లగ్‌లో పెట్టి అలాగే వదిలేస్తున్నారా? ఈ చిన్న అలవాటు వల్ల మీరు తెలియకుండా చేస్తున్న పొరపాటు ఎంత పెద్దదో మీకు తెలుసా? మనలో చాలా మంది ఫోన్ పూర్తిగా చార్జ్ అయిన తర్వాత కూడా ఛార్జర్‌ను స్విచ్లోనే పెట్టి వదిలేస్తుంటారు.
చాలా సార్లు అది ఆన్ లోనే ఉంటుంది. తాజాగా ఈ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. ఇలా చేస్తే కరెంట్ బిల్లు పెరుగుతుందా? అనే ప్రశ్న అందరిలోనూ కలవరం రేపుతోంది.
అంతేకాదు, ఈ అలవాటు కేవలం కరెంట్ బిల్లుకే కాదు, మన ఇంటి భద్రతకూ, పర్యావరణానికీ సంబంధించి కీలకమైనదని నిపుణులు చెబుతున్నారు. నిజానికి, ఛార్జర్‌ను ప్లగ్‌లో పెట్టి ఆన్‌లో వదిలేసినప్పుడు, దానికి ఫోన్ కనెక్ట్ అయి లేకపోయినా కొద్దిగా కరెంట్‌ను ఉపయోగిస్తూనే ఉంటుంది. దీన్ని “వ్యాంపైర్ పవర్” లేదా “స్టాండ్‌బై పవర్” అని పిలుస్తారు. ఇది ప్రతిరోజూ 0.1 నుంచి 0.5 వాట్స్ వరకు విద్యుత్తును ఉపయోగిస్తుంది. అయితే ఇది చాలా తక్కువ అని అనిపించినా, దీర్ఘకాలంలో చూస్తే ఖర్చు పెరుగుతుంది.
ఒక నెల పాటు రోజుకు 24 గంటలు ఇలా వదిలేస్తే దాదాపు 1 నుంచి 2 యూనిట్ల కరెంట్ వాడుక జరుగుతుంది. అంటే నెలకు రూ.5 నుండి రూ.10 ఖర్చవుతుంది. ఇది చిన్న మొత్తమే అయినా, ప్రతి ఇంట్లో మూడు నాలుగు ఛార్జర్లు ఉండటం, టీవీలు, కంప్యూటర్లు, మైక్రోవేవ్‌లు కూడా స్టాండ్బైలో ఉండటం వల్ల ఈ వ్యాంపైర్ పవర్ వాడకం భారీగా పెరుగుతుంది. దీనివల్ల నెలాఖరుకు వచ్చే కరెంట్ బిల్లు ఆశించినదానికంటే ఎక్కువగా వచ్చేదీ ఇదే కారణం.
విద్యుత్ వినియోగంతో పాటు భద్రతాపరంగా కూడా ఇది ప్రమాదకరం. ఛార్జర్‌ను ఎక్కువసేపు ప్లగ్‌లో ఉంచితే అది వేడెక్కుతుంది. ముఖ్యంగా నాణ్యత లేని, పాత ఛార్జర్ల వల్ల షార్ట్ సర్క్యూట్లతో మంటలు చెలరేగే ప్రమాదం ఉంటుంది. ఫోన్ కనెక్ట్ చేయకపోయినా, లోపలి సర్క్యూట్స్ పని చేస్తూనే ఉంటాయి.
ఈ సమస్యకు పరిష్కారం చాలా సులభం. మీరు ఫోన్ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత వెంటనే ఛార్జర్‌ను స్విచ్ ఆఫ్ చేసి, ప్లగ్ నుంచి తీసేయండి. ఇది కేవలం మీ బిల్లును తగ్గించడమే కాదు, మీ ఇంటిని సురక్షితంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. చిన్న అలవాట్లు పెద్ద తేడా తీసుకువస్తాయి. కాబట్టి ఇకమీదట, ఛార్జింగ్ అయిపోయిన వెంటనే ప్లగ్ తీయడం మర్చిపోవద్దు.
































