వివిధ రకాల సేవలు లేదా సర్టిఫికేట్ల కోసం తరచూ ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంటుంది. మీ సేవ అందుబాటులో వచ్చాక ఈ పరిస్థితి చాలావరకు తప్పినా ఇప్పటికీ కొన్ని రకాల సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
తెలంగాణ ప్రభుత్వం మీ సేవ సేవల్ని విస్తృతం చేసింది. కొన్ని రకాల సర్టిఫికేట్ల కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా మరిన్ని సేవలు అందించనుంది. కొన్ని ధృవపత్రాల జారీలో జాప్యాన్ని నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం సులభంగా వేగంగా నినాదం తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఏర్పాటైన మీ సేవ దశలవారీగా విస్తరిస్తోంది. రెవిన్యూ, రవాణా, పోలీసు, జీహెచ్ఎంసీ, మున్సిపల్, ఎలక్ట్రికల్, దేవదాయ, వ్యవసాయం, రిజిస్ట్రేషన్, పౌర సరఫరాలు, విద్యాశాఖలకు చెందిన 3 వందల సేవలు ఉన్నాయి. ఇటీవలే మరో 9 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. రెవిన్యూ శాఖ పరిధిలోని గ్యాస్ సర్టిఫికేట్, పేరు మార్పు, కులం , ఇన్‌కం సర్టిఫికేట్, మైనార్టీ సర్టిఫికేట్, క్రిమీ లేయర్ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్, వయో వృద్ధుల నిర్వహణ వంటి సేవలు ఉన్నాయి.
ఇప్పుడు కొత్తగా మరో రెండు సర్వీససులు ప్రవేశపెట్టింది. వివాహ ధృవీకరణ నమోదు, వ్యవసాయేతర మార్కెట్ విలువ పత్రాలు ఇక నుంచి మీ సేవలోనే అందుబాటులో ఉంటాయి. గృహ నిర్మాణాలు, ఇతర బ్యాంకు రుణాల కోసం వ్యవసాయేతర భూములకు మార్కెట్ విలువ ధృవపత్రాలు కూడా ఇప్పుడిక మీ సేవలోనే తీసుకోవచ్చు. గతంలో వీటి కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది.
మీ సేవల్లో కులం, ఆదాయం సర్టిఫికేట్లు, భూముల రిజిస్ట్రేషన్ స్లాట్స్ బుకింగ్, స్టడీ గ్యాప్ డాక్యుమెంట్, ఆధార్ సంబంధిత సేవలు, క్రిమీలేయర్, నాన్ క్రిమీలేయర్ సేవలు ఉన్నాయి. ఈ సేవలన్నీ ఇప్పుడున్న సేవలకు అదనం.
































