యాంటీబయాటిక్స్.. మన ఆరోగ్యానికి అత్యంత ప్రమాదంగా మారుతున్న టువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా గ్రామాలలో యాంటీబయాటిక్స్ వినియోగం అధికంగా ఉండడం ఆందోళన కలిగిస్తుంది.
చిన్నచిన్న అనారోగ్యాలకు సైతం యాంటీ బయాటిక్స్ వినియోగించడం గ్రామాలలో ప్రధానంగా కనిపిస్తుంది. యాంటీ బయాటిక్స్ వాడకం గురించి గ్రామాలలో సరైన అవగాహన లేకపోవడం కారణంగా, ప్రజలు వాటి గురించి తెలియక విపరీతంగా వినియోగిస్తున్నారు.
విచ్చలవిడిగా యాంటీ బయాటిక్స్ వాడకం
అంతేకాదు జలుబు, దగ్గు, జ్వరం వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు కూడా యాంటీబయాటిక్స్ ను ఉపయోగిస్తే త్వరగా ఉపశమనం కలుగుతుందని భావించి వాటిని వాడుతున్నారు. ఇంకా కొన్ని గ్రామాలలో ఇప్పటికీ సరైన వైద్య సహాయం లేకపోవడం వల్ల మెడికల్ షాపులలో అడిగి యాంటీబయాటిక్స్ కొనుగోలు చేసి వాటిని వినియోగిస్తున్న పరిస్థితులు ప్రస్తుతం గ్రామాలలో ఉన్నాయి. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
యాంటీ బయాటిక్స్ రెసిస్టెన్స్ సమస్య
వీటివల్ల అనేక దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. విపరీతంగా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల బాక్టీరియా అభివృద్ధి చెందినప్పుడు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ సంభవిస్తుంది, ఫలితంగా మనం వాడిన మందులు ప్రభావవంతంగా ఉండవు. గ్రామీణ ప్రాంతాలలో, ఇది యాంటీబయాటిక్స్ అధిక వినియోగం ఒక ముఖ్యమైన సమస్యగా మారుతోంది. ఈ ప్రాంతాలలోని అనేక మంది ప్రజలు ప్రిస్క్రిప్షన్ల లేకుండా స్థానిక ఫార్మసీలపై ఆధారపడి ఇష్టారాజ్యంగా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల ఇది రెసిస్టెన్స్ ప్రమాదాన్ని పెంచుతుంది.
యాంటీబయాటిక్స్ సైడ్ ఎఫెక్ట్స్
యాంటీబయాటిక్స్ వినియోగం వల్ల అనేక దుష్ప్రభావాలు కూడా కలుగుతాయి. కొన్ని రకాల యాంటీబయాటిక్స్ సైడ్ ఎఫెక్ట్స్ కు కారణమవుతాయి. వాంతులు, విరోచనాలు, వికారం, ఎలర్జీ వంటి ఇతర సమస్యలకు కూడా కారణమవుతాయి. ఇక అవసరం లేనప్పుడు యాంటీబయాటిక్స్ వాడడం అనవసరమైన ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. నిజంగా అవసరం అయినప్పుడు యాంటీబయాటిక్స్ సరిగా పనిచేయని పరిస్థితి వస్తుంది. ఇది అనవసరమైన వైద్య ఖర్చులకు కారణంగా మారుతుంది.
గ్రామాల్లో యాంటీ బయాటిక్స్ వాడకం తగ్గించేలా ఇలా చెయ్యాలి
ముఖ్యంగా గ్రామాలలో ఉన్నటువంటి ఈ సమస్యను తగ్గించడానికి గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రజలను యాంటీబయాటిక్స్ వాడకం విషయంలో చైతన్యవంతుల్ని చేయాలి. అంతేకాదు గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలను మెరుగుపరిచి, మెడికల్ షాపులలో నేరుగా మందులు ఇచ్చే విధానాన్ని అరికట్టాలి. వైద్య సలహా లేకుండా యాంటీబయాటిక్స్ వాడకుండా నిరోధించేలా చర్యలు తీసుకోవాలి.
































