ఇంకా 100 ఏళ్లైనా ఏఐ ఆ పనిచేయలేదు.. ఉద్యోగుల ఆందోళనపై బిల్ గేట్స్

ఏఐ ఆందోళనలు ఉద్యోగులను వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఏఐ వల్ల ఎన్నో ఉద్యోగాలు పోయాయి. భవిష్యత్‌లో మరిన్ని ఉద్యోగాలు పోతాయని పలు సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకులు బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు కీలక రంగాలపై ఏఐ ప్రభావం అంతంతమాత్రంగానే ఉంటుందని చెప్పారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ప్రస్తుతం ఎంతో మంది ఉద్యోగులను భయపెడుతున్న అంశం. దీంతో లాభాలు ఎన్ని ఉన్నాయో, నష్టాలు అన్నే ఉన్నాయి. ఏఐ వల్ల ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగాలు ఊస్ట్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ ఈ అంశంపై మరోసారి స్పందించారు. అత్యంత అధునాతన ఏఐ కూడా ప్రోగ్రామర్లను భర్తీ చేయలేదని అన్నారు. ఇంకా 100 ఏళ్లు అయినా ఇది జరగని పని అని కుండబద్ధలు కొట్టేశారు. కోడింగ్‌కు ఎంతో క్రియేటివిటీ అవసరమని.. ఏఐతో అది సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. ‘‘డీబగ్గింగ్ వంటి విషయాలకు ఏఐ సహాయం చేయగలదని అన్నారు. కానీ ప్రోగ్రామింగ్‌లో నిజమైన సవాల్.. క్లిష్ట సమస్యను క్రియేటివిటీతో పరిష్కరించడం.. అది మెషిన్స్ చేయలేవని చెప్పారు. ‘‘కోడ్ రాయడం అంటే కేవలం టైప్ చేయడం కాదు. ఎంతో లోతుగా ఆలోచించడం’’ అని గేట్స్ అన్నారు.


అభివృద్ధిలో టెక్నాలజీ ఎన్ని కొత్త పుంతలు తొక్కినా.. ప్రోగ్రామింగ్‌కు మాత్రం మనుషులే అవసరమని గేట్స్ చెప్పారు. క్రియేటివిటీ, సిట్యువేషన్‌కు తగ్గట్లుగా మారడం వంటివి ఏఐ చేయలేదన్నారు. 2030 నాటికి AI దాదాపు 85 మిలియన్ల ఉద్యోగాలను భర్తీ చేస్తుందని, అదే సమయంలో 97 మిలియన్ల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంచనా వేస్తున్న సమయంలో గేట్స్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఏఐ ప్రమాదాల గురించి భయపడుతున్నట్లు గేట్స్ చెప్పారు. అయితే తెలివిగా వాడుకుంటే.. ఏఐ ఉత్పాదకతను మెరుగుపరుస్తుందని, ప్రజలకు మరింత ఖాళీ టైమ్ మిగులుతుందని అభిప్రాయపడ్డారు.

ఈ ఏడాది ప్రారంభంలోనూ ఏఐపై గేట్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోడింగ్, ఎనర్జీ, బయాలజీ వంటి రంగాల్లో ఏఐ ముప్పు తక్కువగానే ఉంటుందని అన్నారు. ఈ రంగాల్లో శాస్త్రీయ ఆలోచన, ఆవిష్కరణలు, వ్యూహాత్మక నిర్ణయం తీసుకోవడం వంటివి ఉంటాయని.. ఏఐకి ఇవి సాధ్యం కావని అభిప్రాయపడ్డారు. వైద్య పురోగతికి శాస్త్రవేత్తలే కీలకంగా ఉంటారని నొక్కి చెప్పారు. ఇంధన రంగంలో.. ఏఐ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.. కానీ ప్రణాళిక, సంక్షోభ నిర్వహణ, దీర్ఘకాలిక వ్యూహానికి మానవ నైపుణ్యం అవసరమని ఆయన చెప్పారు. ఏఐ మనిషి మేధస్సును భర్తీ చేయలేదని.. ఈ విషయంలో మనుషులే ముందంజలో ఉంటారని గేట్స్ స్పష్టం చేశారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.