రివ్యూ: ‘ది 100’.. ఆర్కే సాగర్ నటించిన పోలీస్‌ డ్రామా ఎలా ఉందంటే

నటీనటులు: ఆర్కే సాగర్, మిషా నారంగ్, ధన్య బాలకృష్ణ, వీవీ గిరిధర్, ఆనంద్, లక్ష్మీ గోపాల స్వామి, కల్యాణి నటరాజన్, బాలకృష్ణ, జయంత్, విష్ణు ప్రియ, తారక్ పొన్నప్ప, వంశీ నెక్కంటి, టెంపర్ వంశీ, తదితరులు, సంగీత దర్శకుడు: హర్షవర్ధన్ రామేశ్వర్, ఛాయాగ్రహణం: శ్యామ్ కె.నాయుడు, నిర్మాతలు: రమేష్ కరుటూరి, వెంకీ పూషడపు, రచన, దర్శకత్వం: రాఘవ్ ఓంకార్ శశిధర్, విడుదల: 11-07-2025.


బుల్లితెరపై పోలీస్ ఆర్కే నాయుడుగా ఇంటింటికీ చేరువయ్యారు ఆర్కే సాగర్‌. ఆయన సుదీర్ఘకాలం తర్వాత ‘ది 100’ సినిమా (The 100) కోసం మరోసారి ఖాకీ దుస్తులు ధరించారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ మొదలుకొని పలువురు రాజకీయ ప్రముఖులు ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు హాజరయ్యారు (The 100 Movie Review). అలా విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్‌ పంచింది?

కథేంటంటే: నగరంలో ఓ ముఠా చేస్తున్న వరుస దోపిడీలు, హత్యలు కలకలం సృష్టిస్తాయి. అప్పుడే ఐపీఎస్‌గా శిక్షణ పూర్తిచేసుకొని విధుల్లో చేరతాడు విక్రాంత్ (ఆర్కే సాగర్‌). సవాల్‌గా మారిన ఈ కేసుపై ప్రత్యేకంగా దృష్టిపెడతాడు. ఒడిశాకి చెందిన ఓ ముఠా దీని వెనుక ఉన్నట్టు పసిగడతాడు. తాను ఇష్టపడిన యువతి ఆర్తి (మిషా నారంగ్‌) కూడా ఈ ముఠా బాధితురాలే అనే విషయం పరిశోధనలో తెలుసుకుంటాడు. పక్కా ప్రణాళికతో ఆ ముఠాని పట్టుకుంటాడు. అయితే ఆర్తికి జరిగిన అన్యాయానికి, ఈ ముఠాకీ సంబంధం లేదని తెలియడంతో… ఈ కేస్‌లో మరో కోణాన్ని వెలికితీసేందుకు ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. ఆ క్రమంలో ఎలాంటి విషయాలు తెలిశాయి? ఇంతకీ ఆర్తిని టార్గెట్ చేసిన వ్యక్తులు ఎవరు? ఆమెకి జరిగిన అన్యాయం ఏమిటి? విక్రాంత్ ఎలా న్యాయం చేశాడు? తదితర విషయాలు తెరపై చూడాల్సిందే (The 100 Movie Review).

ఎలా ఉందంటే: నేర పరిశోధన నేపథ్యంలో సాగే కథ ఇది. వెండితెర పైనా.. ఓటీటీ వేదికల్లోనూ గత కొన్నేళ్లుగా ఇలాంటి కథలదే హవా. ఊహకందని కథనం, ఉత్కంఠ రేకెత్తించే మలుపులతో సాగాల్సిన కథలివి. తర్వాత ఏం జరుగుతుందా అనే ఆసక్తిని రేకెత్తిస్తూ.. ప్రేక్షకుడికి థ్రిల్ పంచిన సినిమాలకే విజయాలు దక్కుతుంటాయి. ఈ సినిమా కూడా అదే కోవలో థ్రిల్‌ పంచుతూ సాగుతుంది. ఈ కథకి ఐపీసీలోని సెక్షన్ 100ని ముడిపెడుతూ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ మలచడంలో దర్శకుడు తన వంతు మంచి ప్రయత్నమే చేశాడు. హీరోని, ఆయన కలని పరిచయం చేస్తూ ఆరంభ సన్నివేశాలు సాగుతాయి. హీరో కేస్ కోసం రంగంలోకి దిగడంతోనే అసలు కథ మొదలైన అనుభూతి ప్రేక్షకుడికి కలుగుతుంది. స్పాట్‌లో దొరికిన ఆధారాలతో ముసుగులు ధరించిన ముఠాని కనిపెట్టడం, నేరాల శైలిని అంచనా వేయడం, పక్కా ప్రణాళికతో పట్టుకోవడం వంటి సన్నివేశాలు ప్రథమార్ధంలో కీలకం. ఆ కేస్‌లోని మరో కోణాన్ని వెలికితీయడమే ద్వితీయార్ధం. కేస్ పరిశోధన చాలా సినిమాల్లో చూసినట్టే కాస్త రొటీన్‌గా అనిపిస్తుంది. ద్వితీయార్ధంలో మధుప్రియ (విష్ణుప్రియ) నేపథ్యంలో వచ్చే ఎపిసోడ్ కథ కీలకం (The 100 Movie Review). పతాక సన్నివేశాలు సాదాసీదాగానే అనిపిస్తాయి.

ఎవరెలా చేశారంటే: ఐపీఎస్ విక్రాంత్ పాత్రలో మరింత అథెంటిక్‌గా కనిపించాడు ఆర్కే సాగర్‌. బుల్లితెరపై ఆర్కే నాయుడు అనే పోలీస్ పాత్రతో ఆయన ఎంతో ప్రభావం చూపించారు. మరోసారి ఆ పాత్రని గుర్తు చేస్తూ ఇందులో నటించారు. యాక్షన్ సన్నివేశాలతోనూ ఆకట్టుకున్నాడు. కథానాయిక మిషా నారంగ్ ప్రాధాన్యమున్న పాత్రలో కనిపించింది. అందంగా కనిపించడంతోపాటు, ద్వితీయార్ధంలో సంఘర్షణకి గురయ్యే సన్నివేశాల్లో ఆమె నటన మెప్పిస్తుంది. ధన్య బాలకృష్ణ, విష్ణు ప్రియ కూడా ప్రాధాన్యమున్న పాత్రల్లో కనిపిస్తారు. కథానాయకుడి తల్లిగా, సైకియాట్రిస్ట్‌గా కల్యాణి నటరాజన్ కనిపిస్తారు. పుష్ప సినిమాలో మెరిసిన తారక్ పొన్నప్ప విలన్‌గా మెప్పిస్తాడు. సాంకేతిక విభాగాల్లో హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం, శ్యామ్ కె.నాయుడు ఛాయాగ్రహణం సినిమాకి బలం. దర్శకుడు హీరోని చూపించిన తీరు బాగుంది కానీ… కథ, కథనాలపై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేది.

  • + బలాలు
  • ఐపీఎస్ పాత్రలో ఆర్కే నాయుడు
  • ప్రథమార్ధంలో పరిశోధన
  • – బలహీనతలు
  • – ఊహకందే కథ, కథనం
  • చివరిగా: ది 100… రొటీన్‌ కథే అయినా, ఇన్వెస్టిగేషన్‌ మెప్పిస్తుంది.
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.