ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నాయి. ఆయన హిందీ భాషను ‘రాజ్యభాష’గా పేర్కొన్న వ్యాఖ్యలపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్రంగా స్పందించారు.
ట్విట్టర్ (X) వేదికగా స్పందించిన ప్రకాశ్ రాజ్, ‘ఈ రేంజ్‌కీ అమ్ముకోవడమా? ఛీ.. ఛీ..’ అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వీడియోను పంచారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ప్రకాశ్ రాజ్ విమర్శకు మిశ్రమ స్పందనలు
ప్రకాశ్ రాజ్ (Prakash Raj) చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు పవన్ కళ్యాణ్‌పై ప్రకాశ్ విమర్శలను సమర్థిస్తుంటే, మరికొందరు మాత్రం ఆయనను రాజకీయ ప్రేరణతో మాట్లాడుతున్నారంటూ విమర్శిస్తున్నారు. గతంలోనూ ప్రకాశ్ రాజ్ అనేక సందర్భాల్లో పవన్ రాజకీయాలపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తాజా ట్వీట్‌తో మరోసారి ఇద్దరి మధ్య మాటల యుద్ధం చెలరేగేలా కనిపిస్తోంది.
పవన్ వ్యాఖ్యలపై పెరుగుతున్న విమర్శలు
పవన్ కళ్యాణ్ హిందీని రాజ్యభాషగా ప్రకటించిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు పెరుగుతున్నాయి. భాషాపై ఈ విధమైన వ్యాఖ్యలు చేసే స్థాయికి ఓ నాయకుడు ఎలా వెళ్ళగలడన్న ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. తెలుగువారి గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై పవన్ స్పష్టత ఇవ్వాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. మల్టీలింగ్వల్ దేశంలో స్థానిక భాషల ప్రాముఖ్యతను బలపరచాల్సిన అవసరముందని పలు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
































