కేంద్రపాలిత ప్రాంతం యానాంలో సర్కారు మరో 12 పెట్రోల్ బంకుల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. ఆంధ్ర ప్రాతంతో పోల్చితే యానాంలో డీజిల్, పెట్రోల్ ధరలు రూ,14 తక్కువగా ఉండటమే ఇందుకు ప్రదాన కారణం.
కేంద్రపాలిత ప్రాతం పుదిచ్చేరికి మద్యం, డీజిల్,పెట్రోల్ ద్వారా వచ్చే పన్నులే ప్రధాన ఆదాయ వనరులు. ఆదాయం పెంచు కునేందుకు పెట్రోల్ స్టేషన్లు, మద్యం తయారీ రిటైల్ దుకాణాలపై దృష్టి సారించింది. తాజాగా 12 డీజిల్, పెట్రోల్ బంకుల ఏర్పాటుకు నిర్వాహకులను ఏర్పాటు చేసింది. దీనితో ఐవోసిఎల్-6, బీపీసీఎల్-3, హెచ్ పీసిఎల్-2, జాతీయ రహదారిపై మరో బంకు ఏర్పాటు కానున్నాయి.
అక్రమార్కులకు అడ్డాగా యానాం పెట్రోల్ బంకులు?..
అయితే యానాంలో ఇన్ని బంకులు ఏర్పాటు చేయడంపై కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. యానాం నుండి కొందరు వ్యక్తులు అక్రమంగా డీజిల్, పెట్రోల్ ఇతర ప్రాంతాలకు తరలిస్తూ వ్యాపారం చేస్తున్నారని.. ఇన్ని పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయడానికి అదే ప్రధాన కారణమని ప్రజలు విమర్శిస్తున్నారు. యానాం నుండి పెద్ద ఎత్తున మాఫియా డీజిల్, పెట్రోల్ ట్యాంకర్లనే మాయం చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. అక్రమ మార్గంలో డీజిల్,పెట్రోల్ మాఫియా తరలించుకు పోతున్నా అధికారులు అమ్యామ్యాలకు అలవాటుపడి అడపాదడపా పట్టుకుని కేసులు పెట్టి చేతులు దులుపు కుంటున్నారనే విమర్శలు ఉన్నాయి.
యానాంలో 70 వేల జనాభా 18 వేల వివిధ రకాల వాహనాలు ఉన్నాయి. కోనసీమ కాకినాడ ప్రాంతాల నుండి అసంఖ్యాకమైన వాహనాలు పెట్రోల్, డీజిల్ కోసం యానాం వస్తున్నాయి. యానాం పురపాలక సంఘం పరిధిలో జాతీయ రహదారి, ఏటిగట్టు మార్గాలలో బంకులు ఏర్పాటుకు ఆయా చమురు సంస్థలు దరఖాస్తుల కోరాగా.. 80 మంది దరఖాస్తు చేసుసుకున్నారు. వారిలో 11 మందిని లాటరీ పద్ధతిలో నిర్వాహకులుగా ఎంపిక చేశారు. దరఖాస్తు దారులకు నిర్దేశించిన ప్రాంతాల్లో వివిధ శాఖ అధికారులు అనుమతిస్తే ఈ ఏడాదిలోనే ఈ బంకులు ప్రారంభం అవుతాయి.
అయితే ఇప్పటివరకు కేటాయించిన 15 బంకుల్లోనూ వాహనదారులు, ప్రజల సౌకర్యార్థం టాయిలెట్స్, ఎయిర్ ఫిలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రజలు ఎన్ని ఫిర్యాదులు చేసిన అధికారులు పట్టించుకోకపోగా.. బంకులు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవడం విడ్డూరం.
































