అనేక విలక్షణ పాత్రలతో ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్రవేసిన కోట శ్రీనివాసరావు కన్ను మూసారు. SV రంగారావు, కైకాల తరువాత అంత గొప్పనటుడిగా పేరు తెచ్చుకున్న కోట దాదాపు 800 సినిమాల్లో నటించారు.
రీసెంట్ గా 83 వ పుట్టినరోజు జరుపుకున్న ఆయన మూడు రోజుల వ్యవధిలోనే కన్నూమూయటం చాలా విషాదకరం. అయన మృతిపై టాలీవుడ్ సంతాపం వ్యక్తం చేస్తుంది. సినిమా నటుడిగానే కాకుండా రాజకీయనాయకుడిగా విజయం సాధించిన కోట, 1999 నుండి 2004 వరకు బీజేపీ తరుపున MLA గా పనిచేసారు. అనేక చిత్రాల్లో నటించిన కోట శ్రీనివాసరావు ఆస్తుల విలువెంతో తెలుసా? కన్నుమూసేవరకు నటుడిగా చాలా బిజీగానే ఉన్న ఆయన ఎంత రెమ్యూనరేషన్ తీసుకునేవారు, ఆయన రాజకీయ జీవితం గురించి ఇంట్రస్టింగ్ విషయాలు మీకోసం…
హీరో, హీరోయిన్ లలా క్యారెక్టర్ ఆర్టిస్టులు, విలన్లకు సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు పని చెయ్యాలిసిన అవసరం ఉండదు. వారి కాంబినేషన్ సీన్ల వరకు పూర్తి చేస్తే వారి పనిఅయిపోతుంది. మళ్ళీ డబ్బింగ్లోనే పని. అయితే కోట లాంటి డిమాండ్ ఉన్న ఆర్టిస్టులకు మాత్రం ఒక్కోసారి ఒక్కో విధానంలో రెమ్యూనరేషన్ ఇస్తారు. ఎక్కువ రోజులకు పని చేసే సినిమాలకు బల్క్ అమౌంట్, తక్కువ రోజుల సినిమాలకు రోజుకు ఇంత అని. ఒక సందర్భంలో కోట స్వయంగా చెప్పారు కాల్షీటుకు అంటే ఒక రోజులో కొన్ని గంటలకు తాను లక్షన్నరకంటే ఎక్కువ తీసుకోను అని. అయితే పెద్దసినిమాలకు ఆయన ఒకే మొత్తం గా 25 లక్షలు వరకు తీసుకునే వారని ఇండస్ట్రీ వర్గాల్లో బోగట్టా. ఒక సందర్భంలో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ 20 సంవత్సరాలక్రితం సినిమాకి ఆయన రెమ్యూనరేషన్ 6 లక్షలు ఉండేదని చెప్పుకొచ్చాడు. ఆ లెక్కన చూస్తే చాలా బిజీ ఆర్టిస్టుగా ఆయన బాగానే కూడబెట్టారు అని చెప్పొచ్చు. మీకు తెలుసా అతనికి ఎంతో పేరు తెచ్చిపెట్టిన శివ సినిమాలో మాచిరాజు పాత్రకు ఆయన ఒకే రోజు నటించాడని, అలాగే మనీ సినిమాకు అతని మొత్తం రెమ్యూనరేషన్ ఆ రోజులో 50 వేలు మాత్రమే తీసుకున్నాడని.
బీజేపీ తరుపున ఎమ్మెల్యే గా పోటీ చేసే సమయం లో ఆయన ఎలక్షన్ అఫిడవిట్ లో తన ఆస్తుల విలువ కేవలం 10 లక్షల రూపాయలుగా పేర్కొన్నారు. BJP ఈస్ట్ ఎమ్మెల్యే గా గెలిచి సంచలనం సృష్టించిన కోట ఆ తరువాత రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. సినిమాల్లో మళ్ళీ చాలా బిజీ అయిపోయిన ఆయన నివాసం హైదరాబాద్ ఫిలింనగర్ లో ఉంది. శ్రీనివాసం పేరుతో ఉన్న ఆ ఇంటి మార్కెట్ వేల్యూ కోట్లలోనే ఉంటుందని చెప్తారు. అలాగే ఆయన కెరీర్ లో బిజీ గా ఉండే కాలంలో రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ లు పెట్టేవారని వాటి విలువ కూడా ఇప్పుడు పెరగడంతో ఆయన ఆస్తుల విలువ దాదాపు 80 కోట్లకు పై మాటే అని ఇండస్ట్రీలో ఆయన సన్నిహితుల మాట.
కోట హిందీ నటులకు ఎక్కువ పారితోషికాలు ఇచ్చి తెలుగు సినిమాల్లో తీసుకోవడంపై తన అసంతృప్తి వ్యక్తం చేసేవారు. ఇక్కడ తమ ఉపాధి దెబ్బతింటుందని బాధపడేవారు. అలాగే డబ్బుకోసమే తాను నటించడం లేదనీ, నటన తనకు ఇష్టమైన వృత్తి అని చాలా సార్లు చెప్పేవారు. అలాగే స్టార్ట్ హీరోలు కోట్లలో పారితోషికాలు తీసుకుంటున్నామని చెప్పటం పై కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో పవన్ కళ్యాణ్ గురించే ఆయన వ్యాఖ్యలు చేసారని దుమారం రేగింది. ముక్కు సూటిగా మాట్లాడే అలవాటు ఉన్న కోట తన నటజీవితం లో ఎన్నో అవార్డులు తీసుకున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ తో సత్కరించింది. ఇక వారసుల విషయానికి వస్తే కోట కుమారుడు రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారికి పెళ్లిళ్లు అయి పిల్లలతో ఉన్నట్టు సమాచారం.
































