సెలవుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. ఆప్షనల్ హలీడేగా ఉన్న దానిని పబ్లిక్ హలీడేగా మార్చివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
విద్యార్థి లోకం.. ఉద్యోగ వర్గాల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటూ ప్రకటన చేసింది. ప్రభుత్వం తీసుకున్న తాజాగా నిర్ణయంతో పాఠశాలలు, విద్యాలయాలతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సెలవు లభించనుంది.
కొన్ని రోజుల్లో పవిత్రమైన శ్రావణ మాసం ప్రారంభం కానుంది. ఈ నెలలో అనేక పండుగలు, పర్వదినాలు వస్తుంటాయి. హిందూవులకు అతి ముఖ్యమైనది శ్రావణ మాసం. ఈ శ్రావణంలో అనేక పండుగలు ఉండగా అన్నింటికి సెలవు ఇవ్వలేదు. వాటిలో మహిళలు పవిత్రంగా చేసుకునే వరలక్ష్మి వ్రతం ఒకటి. వరలక్ష్మి వ్రతానికి సంబంధించి ప్రభుత్వం ఆప్షనల్ హలీడేగా ఇన్నాళ్లు ప్రకటించేది. అయితే మహిళలు, ఉద్యోగుల నుంచి డిమాండ్ రావడంతో వరలక్ష్మి వ్రతం రోజు సెలవును జనరల్ హలీడేగా మార్చివేసింది.
ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మి వ్రతం వచ్చింది. ఈరోజును ఆప్షనల్ హలీడేగా సెలవుల జాబితాలో ప్రకటించింది. దానిని కాస్త జనరల్ హాలిడేస్ జాబితాలో ఏపీ ప్రభుత్వం చేర్చింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులు, పాఠశాలలు భారీగా సెలవులు రానున్నాయి. ఎందుకంటే ఆ తర్వాతి రోజు అంటే ఆగస్టు 9వ తేదీ రెండో శనివారం వచ్చింది. అనంతరం ఆగస్టు 10వ తేదీ ఆదివారం ఉంది. ఒక నిర్ణయంతో మూడు రోజుల సెలవులు కలిసి రానుండడం విశేషం. దీంతో ఉద్యోగులు, విద్యార్థులకు పండుగలాంటి వార్త అని ఇది చెప్పవచ్చు.
ఆగస్టు నెలను పరిశీలిస్తే మరోసారి వరుసగా మూడు రోజులు సెలవులు వస్తున్నాయి. యథావిధిగా ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సెలవు ఉండనుంది. ఆ తర్వాతి రోజు ఆగస్టు 16వ తేదీ శ్రీ కృష్ణాష్టమి వచ్చింది. ఆ తర్వాతి రోజు ఆగస్టు 17వ తేదీ ఆదివారం రావడంతో ఇక్కడ కూడా మూడు రోజులు సెలవు వచ్చాయి. ఇలా ఆగస్టు మొత్తం ఉద్యోగులు, విద్యార్థులకు సెలవు కలిసి రావడం విశేషం. మరి ఈ సెలవులను పక్కాగా సద్వినియోగం చేసుకోవాలని ఉద్యోగులు, విద్యార్థుల కుటుంబాలు భావిస్తున్నాయి.
































