అరటిపండు ప్రతి సీజన్‌లో సులభంగా లభించే పండు. అన్ని వయసుల వారు దీనిని తినడానికి ఇష్టపడతారు. రుచికరంగా ఉండటమే కాకుండా..
ఇందులో ఫైబర్, పొటాషియం, విటమిన్ B6 సమృద్ధిగా ఉంటాయి. కానీ ప్రతిరోజూ అరటిపండు తినడం వల్ల బరువు పెరుగుతారా? అనే ప్రశ్న కొందరిలో ఉత్పన్నమవుతుంది. ఈ ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకుందాం.. నిజానికి అరటిపండ్లు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ, మితంగా తీసుకోవడం చాలా కీలకమంటున్నారు నిపుణులు.
ఆరోగ్యానికి మంచి చేసే పండ్ల లిస్టులో అరటిపండ్లు ముందు వరుసలో ఉంటాయి. కానీ, వాటిని రోజూ మోతాదుకి మించి తింటే స్థూలకాయానికి ఆహ్వానం పలికినట్లేనని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే అరటిపండ్లలో చక్కెర, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఉండే చక్కెర సహజమైనది. దీనిని బాడీ త్వరగా గ్రహించదు. సాధారణంగా ఒక బనానాలో సుమారు 105 కేలరీలు ఉంటాయి. అదే మీరు డైలీ ఒకటి కంటే ఎక్కువ బనానాలను తింటే శరీరానికి కావాల్సిన దానికంటే ఎక్కువ కేలరీలు అందుతాయి. అంటే డైలీ 2 నుంచి 3 అరటిపండ్లు తినడం వల్ల 350 అదనపు కేలరీలు శరీరానికి అందుతాయి. ఫలితంగా బరువు పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.
































