Dengue Vaccine: త్వరలోనే డెంగ్యూ వ్యాక్సిన్‌ వచ్చేస్తోంది

పనాసియా బయోటెక్ అభివృద్ధి చేసిన టెట్రావాలెంట్ డెంగ్యూ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో విజయవంతంగా ఉంది. యూఎస్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (NIH) సహకారంతో అభివృద్ధి చేయబడిన ఈ వ్యాక్సిన్ నాలుగు రకాల డెంగ్యూ వైరస్‌ల నుండి రక్షణను అందించనుంది.

డెంగిఆల్‌ పేరుతో యూఎస్‌ నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (NIH) సహకారంతో పనాసియా బయోటెక్ అభివృద్ధి చేసిన టెట్రావాలెంట్ డెంగ్యూ వ్యాక్సిన్ త్వరలోనే అదుబాటులోకి రానుంది. ఇది నాలుగు డెంగ్యూ వైరస్ సెరోటైప్‌ల నుండి రక్షించడానికి రూపొందించిన లైవ్-అటెన్యూయేటెడ్ టీకా. ఈ టీకా ప్రస్తుతం భారతదేశంలో మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉంది. దీనిని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నారు. ICMR శాస్త్రవేత్తల ప్రకారం.. స్వదేశీ వన్-షాట్ పనాసియా బయోటెక్ అభివృద్ధి చేసిన డెంగ్యూ వ్యాక్సిన్ డెంగిఆల్.. ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్‌లో అక్టోబర్ నాటికి భారతదేశంలోని 20 కేంద్రాలలో దాదాపు 10,500 మంది వాలంటీర్ల నమోదు పూర్తయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు పూణే, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, భువనేశ్వర్‌లోని వివిధ కేంద్రాలలో 8,000 మంది పాల్గొన్నారు. ICMR, పనాసియా బయోటెక్ స్పాన్సర్ చేసిన ట్రయల్‌లో భాగంగా టీకా లేదా ప్లేసిబోను పొందారు.


ఈ ట్రయల్‌ను పూణేలోని ICMR-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్‌లేషనల్ వైరాలజీ అండ్ AIDS పరిశోధన, చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ (NIE), పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో డెంగ్యూకు వ్యతిరేకంగా యాంటీవైరల్ చికిత్స లేదా లైసెన్స్ పొందిన వ్యాక్సిన్ లేదు. ఒకటి , రెండు ట్రయల్‌ దశల్లో ఫలితాలు వన్-షాట్ వ్యాక్సిన్‌కు ఎటువంటి భద్రతా సమస్యలను చూపించలేదని NIE డైరెక్టర్ డాక్టర్ మనోజ్ ముర్హేకర్ అన్నారు. మూడో దశ ట్రయల్‌లో భాగంగా టీకాలు వేయించుకున్న వారిని రెండేళ్ల పాటు పర్యవేక్షిస్తారు. ఈ టెట్రావాలెంట్ డెంగ్యూ వ్యాక్సిన్ సామర్థ్యాన్ని ఈ ట్రయల్ అంచనా వేస్తుంది అని డాక్టర్ ముర్హేకర్ వెల్లడించారు.

టీకా సమర్థత, భద్రత, దీర్ఘకాలిక రోగనిరోధక శక్తిని అంచనా వేయడానికి మల్టీ-సెంటర్, డబుల్-బ్లైండ్, రాండమైజ్డ్, ప్లేసిబో-నియంత్రిత మూడో దశ ట్రయల్ గత సంవత్సరం ఆగస్టులో ప్రారంభించారు. ఈ ట్రయల్‌లో మొదట పాల్గొనేవారికి గత సంవత్సరం రోహ్‌తక్‌లోని పండిట్ భగవత్ దయాళ్ శర్మ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (PGIMS)లో టీకాలు వేశారు. అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (NIH) మొదట అభివృద్ధి చేసిన టెట్రావాలెంట్ డెంగ్యూ వ్యాక్సిన్ స్ట్రెయిన్ (TV003/TV005) బ్రెజిల్‌లో క్లినికల్ ట్రయల్స్‌లో ఆశాజనకమైన ఫలితాలను చూపించిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గతంలో ఒక ప్రకటనలో తెలిపింది. ఈ స్ట్రెయిన్‌ను స్వీకరించిన మూడు భారతీయ కంపెనీలలో ఒకటైన పనాసియా బయోటెక్ అభివృద్ధిలో అత్యంత అధునాతన దశలో ఉంది. పూర్తి స్థాయి వ్యాక్సిన్ ఫార్ములేషన్‌ను అభివృద్ధి చేయడానికి ఈ స్ట్రెయిన్‌లపై కంపెనీ విస్తృతంగా పనిచేసింది. ఈ పనికి ప్రాసెస్ పేటెంట్‌ను కలిగి ఉంది.

ఇండియాలో డెంగ్యూ ప్రధాన సమస్య..

భారతదేశంలో డెంగ్యూ ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్యగా ఉంది. ఈ వ్యాధి అత్యధికంగా ఉన్న టాప్ 30 దేశాలలో మన దేశం కూడా ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, 2023 చివరి నాటికి 129 కంటే ఎక్కువ దేశాలు డెంగ్యూ వైరల్ వ్యాధిని నివేదించడంతో గత రెండు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా డెంగ్యూ సంభవం క్రమంగా పెరుగుతోంది. భారతదేశంలో దాదాపు 75-80 శాతం ఇన్ఫెక్షన్లు లక్షణరహితంగా ఉన్నాయి, అయినప్పటికీ ఈ వ్యక్తులు ఇప్పటికీ ఏడిస్ దోమల కాటు ద్వారా ఇన్ఫెక్షన్‌ను వ్యాప్తి చేయవచ్చు. లక్షణాలు వైద్యపరంగా స్పష్టంగా కనిపించే 20-25 శాతం కేసులలో పిల్లలు ఆసుపత్రిలో చేరడం, మరణాల ప్రమాదం ఎక్కువగా ఉంది. పెద్దవారిలో ఈ వ్యాధి డెంగ్యూ హెమరేజిక్ జ్వరం, డెంగ్యూ షాక్ సిండ్రోమ్ వంటి తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తుంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ఈ సంవత్సరం మార్చి వరకు దాదాపు 12,043 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. 2024లో 2.3 లక్షల కేసులు, 297 మరణాలు నమోదయ్యాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.