పడుకునే ముందు రీల్స్ చూడటం, లేదంటే కామెడీ షోలు చూశాకే నిద్రపోవడం (Sleep) చాలా మందికి అలవాటు. కొందరికైతే ఓ సినిమా చూడనిదే నిద్ర పట్టదు.
ఇలా నిద్రపోయే సమయాన్ని తగ్గించి.. స్క్రీన్ టైం పెంచేవాళ్లంతా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాలిఫోర్నియాలోని అమెన్ క్లినిక్స్ వ్యవస్థాపకుడు, ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డా. డేనియల్ అమెన్ ప్రకారం.. రాత్రి పూట స్క్రీన్ టైం పెంచుతున్నామంటే.. సరదాల కోసం నిద్రను అమ్ముకున్నట్లే. దీనివల్ల కలిగే నష్టం.. మనం పొందిన ఆనందం కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇటీవల ఓ వార్తా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మనిషి జీవితాన్ని నిద్రలేమి ఎంతలా ప్రభావితం చేస్తుందో వివరించారు.
మెదడు శుభ్రమవ్వాలంటే నిద్ర అవసరం
మానవ మెదడు సహజంగా రోజుకు 60 వేల నుంచి 80 వేల ఆలోచనలు చేస్తుంది. అందులో కొన్ని వ్యక్తిగతమైనవి, వృత్తిగతమైనవి, ఇతరుల కోసం ఇలా బోలెడు ఉండొచ్చు. ఒక రోజు పూర్తయ్యే సరికి ఇలాంటి ఆలోచనలతో మెదడు పూర్తిగా నిండిపోతుంది. మళ్లీ అది శుభ్రమవ్వాలంటే కచ్చితంగా నిద్ర అవసరం. ఆ సమయంలో మెదడుకు రక్తప్రసారం బాగా జరిగి శక్తిని కూడగట్టుకుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. సరిగా నిద్రపోకపోతే.. దాని ప్రభావం మెదడుతోపాటు అన్ని అవయవాలపైనా పడుతుంది. ఉదయాన లేచిన దగ్గరి నుంచి మత్తుగా అనిపిస్తుంది. వేగంగా నిర్ణయాలు తీసుకోలేం. ముందు రోజు సరిగా నిద్రపట్టకపోతే.. రేపటి కార్యాచరణకు సంబంధించిన నిర్ణయాలను ఇవాళ తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అరగంట అధికంగా ఫోన్చూడటం వల్ల.. ఇలా ఎంతో విలువైన నిర్ణయాలను పక్కన పెట్టాల్సి రావొచ్చు.
రాత్రి పూట టీవీలు ప్రమాదం సుమీ!
రాత్రిపూట టీవీ షోలు చూడటం, ఫోన్ చూస్తూ గడిపేయడం చాలా మందికి అలవాటు. ఇలాంటి వారంతా తమ కళ్లకు తీరని ద్రోహం చేస్తున్నట్లే. వాటి నుంచి వెలువడే నీలి కాంతికిరణాలు.. మన శరీరానికి విశ్రాంతి సమయం అని సూచించే మెలటోనిన్ అనే హార్మోన్‌ను అణిచివేస్తాయి. దీంతో విశ్రాంతి తీసుకోవాల్సిన మెదడు చురుకైపోతుంది. ఆ తర్వాత పడుకున్నా సరిగా నిద్రపట్టదు. ఇది ఒత్తిడికి దారి తీస్తుంది. క్రమంగా అనారోగ్యానికి కారణమవుతుంది. ఒక వేళ తప్పనిసరి పరిస్థితుల్లో స్క్రీన్ చూడాల్సి వస్తే.. డివైస్‌లో బ్లూ లైట్ బ్లాకింగ్ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవడం ఉత్తమం.
నిద్రను ప్రేమిస్తే..!
రోజులో పని చేయడం ఎంత ముఖ్యమో… పడుకోవడం కూడా అంతే ముఖ్యం అంటున్నారు డా. అమెన్. ఆరోగ్యంగా ఉండాలి, జ్ఞాపశక్తి కావాలి, కళ్ల సమస్యలు రావొద్దు, ఎలాంటి అడ్డంకులు లేకుండా లక్ష్యాన్ని చేరుకోవాలి, మెదడుకు ఎట్టి పరిస్థితుల్లోనూ హాని కలగకూడదు అని బలంగా కోరుకునేవాళ్లు కచ్చితంగా నిద్రను ప్రేమించాల్సిందేనట. సరిపడా నిద్రపోతే.. రోజుకు అవసరమైన శక్తిని మెదడు కూడగట్టుకుంటుందట.ఫలితంగా రోజువారీ పనులను చురుగ్గా చేసుకోవడమే కాకుండా ఉత్పాదకత పెరుగుతుంది. రేపు మీరు చక్కగా ఆలోచించి.. మంచి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే ఈ రోజు కచ్చితంగా అరగంట ముందే పడుకోవాలన్నది నిపుణుల మాట.
































