మీరు యూపీఐ ద్వారా డబ్బులు పంపినప్పుడు, బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బు కట్ అయ్యి, అవతలివారికి చేరలేదా? అయితే మీకు ఒక శుభవార్త! నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నేటి నుంచి యూపీఐ లావాదేవీలకు సంబంధించి కొత్త చార్జ్ బ్యాక్ నిబంధనలను అమలు చేయబోతోంది.
ఈ కొత్త నియమాలతో యూపీఐ చెల్లింపుల వివాదాలకు త్వరగా పరిష్కారం లభిస్తుంది.
ఏమిటి ఈ కొత్త రూల్?
యూపీఐ ద్వారా మీరు ఎవరికైనా లేదా ఒక వ్యాపారికి డబ్బు పంపినప్పుడు, కొన్నిసార్లు మీ అకౌంట్ నుంచి డబ్బు కట్ అవుతుంది కానీ, అవతలివారికి చేరదు. ఇలాంటి సందర్భాల్లో, డబ్బు తిరిగి రావడానికి చార్జ్ బ్యాక్ రిక్వెస్ట్ ద్వారా మనం అప్పీల్ చేసుకోవచ్చు.
గతంలో, యూపీఐ వినియోగదారులు చార్జ్ బ్యాక్ రిక్వెస్ట్ పెట్టినప్పుడు, ఆ డబ్బు తిరిగి రావడానికి ఐదు లేదా ఆరు రోజులు పట్టేది. ఇప్పుడు, కొత్త నియమాల ప్రకారం ఈ సమస్యకు ఒకట్రెండు రోజుల్లోనే పరిష్కారం లభిస్తుంది.
బ్యాంకులకు మరింత స్వేచ్ఛ
గతంలో చార్జ్ బ్యాక్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు, బ్యాంకులు ఎన్‌పీసీఐని యూపీఐ రెఫరెన్స్ కంప్లైంట్ సిస్టమ్ ద్వారా ‘వైట్‌లిస్ట్’ చేయమని అడగాల్సి వచ్చేది. ఈ మొత్తం ప్రక్రియను ఇప్పుడు ఎన్‌పీసీఐ తొలగించింది. ఇప్పుడు బ్యాంకులు నేరుగా ఈ సమస్యలను పరిష్కరించే అధికారం కలిగి ఉంటాయి.
ఒక వ్యక్తికి డబ్బు పంపినప్పుడు లావాదేవీ విఫలమైతే, డబ్బు రీఫండ్ చేయడానికి బ్యాంకులకు ఒక రోజు గడువు ఉంటుంది. మీరు ఈరోజు ఫిర్యాదు చేస్తే, రేపటిలోగా సమస్య పరిష్కారం కావాలి. ఒక వ్యాపారికి చేసిన చెల్లింపు విఫలమైతే, రీఫండ్ ఇవ్వడానికి బ్యాంకులకు రెండు రోజులు గడువు ఉంటుంది.
ఎన్‌పీసీఐ తీసుకున్న ఈ కొత్త నిర్ణయం యూపీఐ వినియోగదారులకు చాలా సౌలభ్యాన్ని అందిస్తుంది. కొన్ని అనవసరమైన ప్రక్రియలను తొలగించడం వల్ల, బ్యాంకులు కూడా త్వరగా సమస్యలను పరిష్కరించగలుగుతాయి.
































