వెన్ను లేదా నడుము నొప్పి సమస్యతో బాధపడుతున్నారా? ఎన్ని మందులు వాడినా సమస్య మళ్లీ తిరగబెడుతుందా?
చింతించకండి. బ్యాక్ పెయిన్ సమస్యకు శాశ్వతంగా వదిలించుకునేందుకు ఓ చక్కటి పరిష్కారముంది. మందులతో పనిలేకుండానే దీర్ఘకాలిక వెన్ను లేదా నడుము నొప్పిని ఈ సింపుల్ అలవాటుతో పూర్తిగా నివారించవచ్చు. అది మరేదో కాదు. వాకింగ్. అవును. ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఇన్ని నిమిషాల పాటు నడిస్తే చాలు. శాశ్వతంగా తరిమికొట్టే చక్కటి పరిష్కారం వాకింగ్ అంటున్నారు పరిశోధకులు.
నిశ్చల జీవనశైలి పాటించే వ్యక్తులు, ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లేవారిలో కంప్యూటర్లు లేదా స్క్రీన్ల ముందు రోజూ గంటల తరబడి పనిచేసేవారిలోనే నడుము నొప్పి అనేది సర్వసాధారణమైన వ్యాధిగా మారింది. 2022 అధ్యయనం ప్రకారం , ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారతీయుల్లోనే నడుము లేదా వెన్ను నొప్పి బారిన పడిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రధానంగా మహిళలు, గ్రామీణ జనాభా, కార్మికుల్లోనే అధికం. ఎక్కువసేపు కూర్చోవడం, డ్రైవింగ్ చేయడం లేదా అధిక స్క్రీన్ సమయం ద్వారా బ్యాక్ పెయిన్ వస్తుంది. దీన్నే డెడ్ బట్ సిండ్రోమ్ అని పిలుస్తారు.
నిశ్చల జీవనశైలిని అనుసరించే వ్యక్తులలో వెన్నునొప్పి లేదా నడుము నొప్పి సర్వసాధారణం. దీర్ఘకాలిక వెన్నునొప్పిని నివారించడానికి ఒక వ్యక్తి ప్రతిరోజూ ఎన్ని నిమిషాలు నడవాలో తాజా అధ్యయనం వెల్లడించింది. JAMA నెట్‌వర్క్ ఓపెన్‌లో ప్రచురించిన ఓ అధ్యయనంలో రోజుకు సగటున 78 నిమిషాలకు పైగా నడిచే వ్యక్తుల్లో దీర్ఘకాలిక వెన్నునొప్పి వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గినట్లు వెల్లడైంది.
నార్వేలో 20 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 11,000 మందికి పైగా వ్యక్తులను పరిశోధకులు అనేక సంవత్సరాలు పరిశీలించారు. వాళ్లు రోజులో ఎంతసేపు నడిచారు. ఎంత వేగంతో నడిచారో యాక్సిలెరోమీటర్ ద్వారా రికార్డు చేసిన గణాంకాలను విశ్లేషించారు. రోజుకు 78 నిమిషాల కంటే తక్కువ నడిచే వారి కంటే సగటున 78 నిమిషాల నుంచి 100 నిమిషాల మధ్య నడిచేవారికి దీర్ఘకాలిక వెన్నునొప్పి వచ్చే ప్రమాదం 23 శాతం తగ్గిందని ఫలితాలు చూపించాయి. అధిక తీవ్రతతో నడచిన వ్యక్తులకు కూడా ఇవే ప్రయోజనాలు కలిగినట్లు పరిశోధకులు తెలిపారు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. )
































