ఏపీ ప్రభుత్వం(AP Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. అనారోగ్య కారణాలతో మరణించిన విద్యార్థులు కుటుంబాలకు రూ.3 లక్షల ఆర్థిక సహాయం చేయనున్నట్టు ప్రకటించింది.
ఈ మేరకు ఏపీ మంత్రి డోలాబాల వీరాంజనేయస్వామి(Minister Dolabala Veeranjaneyaswamy) మీడియాకు తెలియజేశారు. నేడు సాంఘిక సంక్షేమ హాస్టళ్లపై అధికారులతో మంత్రి వీరాంజనేయస్వామి సమావేశం నిర్వహించారు. హాస్టల్లో ప్రవేశాలు, విద్యార్థులు ఆరోగ్యం, ఆహారం, భద్రత, అట్రాసిటీ బాధితులకు పరిహారం, పీఎం ఆదర్శ్ గ్రామ్ యోజన తదితర అంశాలపై చర్చించారు.
రాష్ట్రంలో ఏదేని అనారోగ్య కారణాలతో మరణించిన గురుకుల, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులు కుటుంబాలకు రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. గురుకులాల్లో, సంక్షేమ పాఠశాలల్లోని పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ముందే అందజేయాలని సూచించారు. విద్యార్థులు విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
































