Tesla Opens First Showroom: టెస్లా.. ఆగయా

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన విద్యుత్‌ కార్ల కంపెనీ టెస్లా ఎట్టకేలకు భారత్‌లోకి ప్రవేశించింది.


ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌ (బీకేసీ)లో కంపెనీ ఏర్పాటు చేసిన తొలి షోరూమ్‌ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ మంగళవారం ప్రారంభించారు. టెస్లా భారత్‌లో కార్ల తయారీ ప్లాంట్‌, ఆర్‌ అండ్‌ డీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

బెస్ట్‌ సెల్లింగ్‌ మోడల్‌తో ఎంట్రీ: ఒకప్పుడు ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్‌ కారైన ‘మోడల్‌ వై’తో టెస్లా భారత మార్కెట్‌ విక్రయాలను ప్రారంభించింది. మన దగ్గర ఈ కారు రెండు వేరియంట్లలో లభించనుంది. రియర్‌ వీల్‌ డ్రైవ్‌ వేరియంట్‌ ధర రూ.59.89 లక్షలు. లాంగ్‌ రేంజ్‌ రియర్‌ వీల్‌ డ్రైవ్‌ వేరియంట్‌ రేటును రూ.67.89 లక్షలుగా నిర్ణయించింది. ఈ కారును బుక్‌ చేసుకున్న కస్టమర్లకు ఈ ఏడాది మూడు (జూలై-సెప్టెంబరు), నాలుగో (అక్టోబరు-డిసెంబరు) త్రైమాసికాల్లో డెలివరీ అందించనున్నట్లు వెల్లడించింది. కారు రిజిస్ట్రేషన్‌, డెలివరీ సేవలు తొలుత ఢిల్లీ, ముంబై, గురుగ్రామ్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపింది.

సింగిల్‌ చార్జింగ్‌తో 500 కి.మీ ప్రయాణం: రియర్‌ వీల్‌ డ్రైవ్‌ వేరియంట్‌ పూర్తి చార్జింగ్‌తో 500 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. లాంగ్‌ రేంజ్‌ రియర్‌ వీల్‌ డ్రైవ్‌ వేరియంట్‌లో 622 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది.

కస్టమైజ్‌ చేసుకోవచ్చు: తమ డిజైన్‌ స్టూడియో ద్వారా కొనుగోలుదారులు కారు ఎక్స్‌టీరియర్‌, ఇంటీరియర్‌తో పాటు ఫీచర్లనూ కస్టమైజ్‌ (తమ అవసరానికి లేదా అభిరుచికి అనుగుణంగా మార్చుకోవడం) చేసుకోవచ్చని టెస్లా స్పష్టం చేసింది.

అమెరికాతో పోలిస్తే చాలా కాస్ట్‌లీ!: టెస్లా మోడల్‌ వై కారును అమెరికా మార్కెట్లో 37,490 డాలర్లకు విక్రయిస్తోంది. ప్రస్తుత మారకం రేటు ప్రకారం మన కరెన్సీలో దాదాపు రూ.32.24 లక్షలు. యూఎ్‌సతో పోలిస్తే మన మార్కెట్లో కంపెనీ ఈ కారును సుమారు రెట్టింపు ధరకు విక్రయిస్తున్నది.

ఎందుకంటే, కంపెనీ ఈ కారును చైనా నుంచి దిగుమతి చేసుకుంటుడటమే కారణం. విదేశాల నుంచి కార్ల దిగుమతిపై భారత్‌ 70-110 శాతం వరకు సుంకాలు విధిస్తోంది.

ఢిల్లీలో రెండో షోరూమ్‌.. త్వరలో షురూ: టెస్లా రెండో షోరూమ్‌ను ఢిల్లీలో ఏర్పాటు చేస్తోంది. అందులో పనిచేసేందుకు సిబ్బందిని ఇప్పటికే నియమించుకుంటున్న కంపెనీ.. వాహనాలను నిల్వ చేసేందుకు గిడ్డంగిని కూడా సమకూర్చుకుంటోంది. ఈ నెలాఖరుకల్లా ఈ షోరూమ్‌ను ప్రారంభించే అవకాశాలున్నాయి.

బీమా భాగస్వాములుగా లిబర్టీ, అకో: టెస్లా భారత్‌లో విక్రయించే కార్లకు లిబర్టీ జనరల్‌ ఇన్సూరెన్స్‌, అకో బీమా కవరేజీని కల్పించనున్నాయి. భారత్‌లో టెస్లాకు బీమా భాగస్వాములుగా ఎంపికైనట్లు ఈ రెండు కంపెనీలు ప్రకటించాయి.

భారత్‌లో అంత ఈజీ కాదు..

చైనా ఎలక్ట్రిక్‌ కార్‌ బ్రాండ్ల నుంచి గట్టిపోటీ ఎదురవుతుండటంతో గడిచిన కొన్ని నెలల్లో ఐరోపా, అమెరికా మార్కెట్లో టెస్లా కార్ల విక్రయాలు బాగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ భారత్‌లోకి ప్రవేశించింది. ధర విషయంలో మన మార్కెట్‌పై పట్టు సాధించడమూ టెస్లాకు అంత సులువు కాదని ఇండస్ట్రీ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే, మెర్సిడెస్‌ బెంజ్‌, బీఎండబ్ల్యూ, ఆడీ వంటి జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజాలు భారత మార్కెట్లో ఇప్పటికే పలు ఎలక్ట్రిక్‌ మోడళ్లను అందుబాటులోకి తెచ్చాయి. చైనాకు చెందిన ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీ బీవైడీ కూడా మన దగ్గర కార్లను విక్రయిస్తోంది. విన్‌ఫా్‌స్ట సైతం త్వరలో తన ఈవీల బుకింగ్‌లు ప్రారంభించబోతోంది. టాటా మోటార్స్‌, మహీంద్రా వంటి దేశీయ కంపెనీలు రూ.30 లక్షల లోపే పలు ఎలక్ట్రిక్‌ వాహనాలను అందుబాటులోకి తెచ్చాయి.

చైనా ప్లాంట్‌ నుంచి దిగుమతి

టెస్లా భారత్‌లో విక్రయించే మోడల్‌ వై కార్లను చైనాలోని తన ప్లాంట్‌ నుంచి కంప్లీట్లీ బిల్ట్‌ యూనిట్‌ (సీబీయూ)గా దిగుమతి చేసుకోనుంది. కంపెనీ ఇప్పటికే కొన్ని కార్లను మన దేశంలోకి దిగుమతి చేసుకుంది కూడా. భారత మార్కెట్లోకి టెస్లా ప్రవేశించకపోవడానికి అధిక దిగుమతి సుంకాలే కారణమని ఎలాన్‌ మస్క్‌ గతంలో ఆరోపించారు. అయినప్పటకీ, కంపెనీ దిగుమతులే ఆధారంగా భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించడం గమనార్హం.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.