తెలంగాణ ప్రభుత్వం మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. ఎన్నికల్లో ఆరు గ్యారంటీల ద్వారా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేశారు.
ఆ తర్వాత 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రారంభించారు. అనంతరం రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించారు. తాజాగా రాష్ట్రంలోని మహిళల కోసం మరో పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతోంది.
తెలంగాణలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులనే చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయం అని సీఎం రేవంత్ రెడ్డి చాలా సార్లు ప్రకటన చేశారు. అందులో భాగంగానే మహిళలకు ఆరు గ్యారంటీల రూపంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. తాజాగా మహాలక్ష్మి పథకంలో భాగంగా 18-55 ఏళ్ల మహిళలకు నెలకు రూ. 2,500 ఆర్థిక సాయం అందించే దిశగా కాంగ్రెస్ సర్కార్ సిద్ధం అవుతోంది. ఈ మేరకు అధికారులు విధి విధానాలను రూపొందిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే మహిళల ఖాతాల్లోకి రూ. 2,500 జమ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రైతులకు రైతు భరోసా నగదు జమ చేసిన ప్రభుత్వం.. మహిళలకు సైతం ఈ పథకాన్ని అమలు చేసి ఎన్నికల్లోకి వెళితే మరింత లాభసాటిగా ఫలితాలు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే అధికారులు సెర్ప్, మెప్మా నుంచి మహిళల వివరాలను తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. తెల్ల రేషన్ కార్డు కలిగిన మహిళలను లబ్ధిదారులుగా ఎంపిక చేయనున్నారు.
ప్రస్తుతం మహిళా స్వయం సహాయక సంఘాలకు (SHGs) వడ్డీలేని రుణాల చెక్కులను పంపిణీ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 18 వరకు మహిళా సంఘాల ఖాతాల్లో వడ్డీ సొమ్ము జమ కానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రూ.344 కోట్లు విడుదల చేసింది. ఇందులో రూ.300 కోట్లు గ్రామీణ మహిళా సంఘాలకు, రూ.44 కోట్లు పట్టణ మహిళా సంఘాలకు విడుదల చేసింది.
సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల మాట్లాడుతూ.. తెలంగాణలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. అందుకు అనుగుణంగా ఇందిరా మహిళా శక్తి పాలసీ-2025 ను రూపొందించారు. మహిళల ఆర్థిక స్వేచ్ఛ, ఉపాధి కల్పన, సంపద సృష్టి ప్రధాన లక్ష్యాలుగా ఈ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రస్తుతం స్వయం సహాయక సంఘాలు గ్రామాల్లో సెర్ప్, పట్టణాల్లో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాయి. అయితే తాజాగా నూతన విధానంలో మహిళా శక్తి సంఘాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
































