ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం దీపం మరింత సులభ తరంగా అమలు చేసేందుకు సిద్దమైంది. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా దీపం స్కీం ఇప్పటికే అమలు చేస్తున్నారు.
కాగా, ఈ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ కు సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేకుండా కొత్త విధానం పైన కసరత్తు చేస్తున్నారు. దీని పైన పైలెట్ ప్రాజెక్టు కింద పరిశీలన చేస్తోంది. విజయవంతం అయితే ఈ విధానం అమల్లోకి రానుంది.
ఏపీ ప్రభుత్వం దీపం పథకం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లను అందిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ 31న ప్రారంభించిన ఈ పథకం కింద తొలి విడతలో రూ.846 కోట్లు ఖర్చుతో 97 లక్షల మందికి, రెండో విడతలో రూ.712 కోట్లతో 91.10 లక్షల మందికి ఉచిత గ్యాస్ అందించారు. అర్హులైన అందరికీ ఈ పథకం అమలు చేస్తా మని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, ఇప్పుడు ఈ పథకం అమల్లో భాగంగా కొత్త విధానం ప్రవేశ పెట్టేందుకు కసరత్తు మొదలైంది. అందులో భాగంగా ఇప్పటి నుంచి లబ్దిదారులు ముందే సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేకుండా కొత్త విధానం అమల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది.
ప్రభుత్వం ఈ తాజా ఆలోచన అమలు దిశగా పైలెట్ ప్రాజెక్టు ప్రారంభించింది. సిలిండర్ బుక్ చేసిన వెంటనే రాయితీని బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని ఆరు గ్యాస్ ఏజెన్సీల పరిధిలో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఇక్కడ ఈ విధానం విజయవంతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటి వరకు అర్హత కలిగిన రేషన్ కార్డు దారులు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకొని మొత్తం సొమ్ము చెల్లిస్తే.. తర్వాత కొన్ని రోజులకు ఆ మొత్తం వారి ఖాతాల్లో జమ అయ్యేది. ఇక పై వారు ఆ మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు. సిలిండర్ బుక్ చేసిన వెంటనే లబ్దిదారుల డిజిటల్ వాలెట్ లోకి సొమ్ము జమ అవుతుంది. దాన్ని గ్యాస్ ఏజెన్సీలకు చెల్లించవచ్చు. ప్రస్తుతం అమలు చేస్తున్న పైలెట్ ప్రాజెక్టు ఫలితం చూసిన తరువాత అమలుపైన అధికారికంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
































