జగన్ వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం ఫైర్

పోలీసులను ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు ఫైర్ అయ్యారు.


జగన్ వ్యాఖ్యలను ఏపీ పోలీసు అధికారులు సంఘం అధ్యక్షులు జనకుల శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. ప్రతీ అంశంలో పోలీసులపై విమర్శలు చేయడం పరిపాటిగా మారిందన్నారు. వైసీపీ నాయకులను అరెస్టు చేసేందుకు పోలీసు వ్యవస్థ ఉందన్నారు. తనకు రక్షణ కల్పించకుండా కుట్రలు చేస్తున్నారని సీఎంగా పని చేసిన వ్యక్తి మాట్లాడటం సబబు కాదని విమర్శించారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని తెలుసుకోవాలని ఆయన హితవుపలికారు.

డీజీపీని టార్గెట్ చేయడం ఏంటి..

వైసీపీ ప్రభుత్వంలో కూడా తాము చట్ట విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కేసులు పెట్టామని.. అరెస్ట్‌లు చేశామన్నారు. పోలీసులను వీఆర్‌లో పెట్టడం అనేది గత ప్రభుత్వంలో చేశారని మండిపడ్డారు. ఆరోపణలు వచ్చిన అధికారులపై చర్యలు సహజమని చెప్పుకొచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎంత మంది పోలీసులను పక్కన పెట్టారో గుర్తు చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు పోలీసులు వాటాలు పంచుతున్నారని చెప్పడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఐజీ స్థాయి అధికారిని డాన్ అని చెప్పడం సరికాదన్నారు. పోలీసు వ్యవస్థను నడిపే డీజీపీని టార్గెట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఆయన సారధ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని తెలిపారు. ఎక్కడో ఒకచోట పోలీసు శాఖలో కొన్ని లోపాలు ఉండొచ్చని, పొరబాట్లు జరిగి ఉండవచ్చన్నారు. అలా అని పోలీసులు మొత్తాన్ని కించ పరిచేలా మాట్లాడటం సరికాదని శ్రీనివాసరావు వ్యాఖ్యలు చేశారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.