అమెరికాలో మీ పిల్లలున్నారా..? ఇకపై మరిన్ని కష్టాలు.. ఎఫ్-1 విద్యార్థులకు OPT రద్దు చేసే అవకాశం..

మెరికాలో విదేశీ విద్యార్థులు పని అనుభవం (Work Experience) సంపాదించేందుకు అందుబాటులో ఉన్న ప్రముఖ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) కార్యక్రమం ప్రమాదంలో పడింది.


ఈ కార్యక్రమాన్ని రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదంటే కఠినమైన నిబంధనలతో ఈ కార్యక్రమంలో మార్పులు రానున్నాయి. అసలు ఇంతకీ OPT కార్యక్రమం అంటే ఏంటి? అది అమెరికాలో చదువుకునే విదేశీ విద్యార్థులు ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు ఎలా ఉపయోగపడుతోంది? లాంటి వివరాలను ఈ కథనంలో తెలుసుకోండి..

OPT అంటే ఏమిటి?

ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) అనేది అమెరికాలో ఎఫ్-1 వీసా కలిగిన విదేశీ విద్యార్థుల కోసం రూపొందించిన ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమం విద్యార్థులకు వారి అధ్యయన రంగంలో పని అనుభవం సంపాదించేందుకు అనుమతిస్తుంది. విద్యార్థులు చదువుకుంటున్న సమయంలో, అలాగే చదువు పూర్తయిన తర్వాత అమెరికాలో పని చేయడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ఇందులో భాగంగా సాధారణ OPT ప్రకారం విద్యార్థులు తమ చదువు పూర్తయిన తర్వాత 12 నెలల పాటు పని చేయవచ్చు. అదే స్టెమ్ OPT ఎక్స్‌టెన్షన్ కింద సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) రంగాల్లో డిగ్రీ పొందిన విద్యార్థులు అదనంగా 24 నెలలు (అంటే మొత్తం 36 నెలలు) పని చేయడానికి అర్హులవుతారు. అయితే విద్యార్థులుగా వచ్చి, చదువు పక్కనపెట్టి OPT విధానం కింద F-1 వీసాను దుర్వినియోగం చేస్తూ ఉద్యోగాలు చేస్తున్నారని, తద్వారా స్థానిక అమెరికన్లకు ఉద్యోగాలు లేకుండా పోతున్నాయని ట్రంప్, ఆయన వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు. పైగా అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వచ్చేవారు ఈ నాలుగు రంగాలకు చెందినవారే ఎక్కువగా ఉంటున్నారు. దీంతో చదువు పూర్తయిన తర్వాత అక్కడే తిష్టవేసి ఉద్యోగాలు చేస్తూ.. మెల్లగా H1B వీసాలు పొందుతూ స్థానిక అమెరికన్ల పొట్టకొడుతున్నారని ట్రంప్ భావిస్తున్నారు.

USCIS డైరెక్టర్‌గా జోసెఫ్ ఎడ్లో

OPT కార్యక్రమంపై మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేసిన వ్యక్తి జోసెఫ్ ఎడ్లో. ఆయన ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) డైరెక్టర్‌గా నియమితులయ్యారు. జూలై 16, 2025న అమెరికా సెనేట్ 52-47 ఓట్లతో ఎడ్లో నియామకాన్ని ఆమోదించింది. డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాలను ముందుకు తీసుకెళ్లడంలో USCIS డైరెక్టర్‌గా ఎడ్లో కీలక పాత్ర పోషించనున్నారు.

ఎడ్లో ఆందోళనలు

మే 21, 2025న జరిగిన సెనేట్ సమావేశంలో ఎడ్లో OPT కార్యక్రమం గురించి మాట్లాడుతూ… “విద్యార్థులు చదువు పూర్తి చేసిన తర్వాత వారికి OPT విధానం కింద వర్క్ పర్మిట్ ఇవ్వడాన్ని తొలగించాలి” అని అన్నారు. “గత నాలుగు సంవత్సరాలుగా OPT కార్యక్రమం నిర్వహణలో లోపాలున్నాయి. డీసీ సర్క్యూట్ కోర్టు తీర్పు కూడా ఈ కార్యక్రమం చట్టవిరుద్ధంగా నడుస్తోందని చూపించింది. నేను నియమితుడినైతే ఈ సమస్యను పరిష్కరించడానికి DHS, కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తాను” అని ఆయన తెలిపారు.

CPT పైనా సమీక్ష

కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (CPT) కార్యక్రమం విద్యార్థులు తమ కోర్సులో భాగంగా పని చేయడానికి అనుమతినిస్తుంది. అయితే ఎడ్లో మాట్లాడుతూ.. “CPT నిర్వహణ ICE (ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్) బాధ్యత అయినప్పటికీ, నేను నియమితుడినైతే CPT పై సమీక్షకు మద్దతు ఇస్తాను” అని వ్యాఖ్యానించారు. కొన్ని “డే-1 CPT” కళాశాలలు.. విద్యార్థులను పూర్తి సమయం పని చేయడానికి అనుమతించేందుకు కనీస చదువు లేదా హాజరు అవసరాలతో కోర్సులను రూపొందిస్తున్నాయని.. ఇది “వర్క్ వీసా మాస్క్”లా పనిచేస్తుందని అమెరికా అధికారులు భావిస్తున్నారు.

USCISలో మార్పులు

ఎడ్లో USCISని ఇమ్మిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీగా మార్చాలని భావిస్తున్నారు. “USCIS ప్రధానంగా దరఖాస్తుదారులను తనిఖీ చేయడం, మోసాలను గుర్తించడం, జాతీయ భద్రతను నిర్ధారించడంలో ఆధునిక సాంకేతికతలను ఉపయోగించాలి” అని ఆయన తన సమావేశంలో పేర్కొన్నారు. ఈ మార్పులు OPT, CPT కార్యక్రమాలపై కఠిన నిబంధనలను తీసుకురావచ్చు.

భారతీయ విద్యార్థులపై ప్రభావం

OPT కార్యక్రమం భారతీయ విద్యార్థులకు అమెరికాలో పని అనుభవం సంపాదించడానికి, H-1B వీసాల వంటి ఇతర ఇమ్మిగ్రేషన్ మార్గాలకు దారితీసే ముఖ్యమైన అవకాశం. ఈ కార్యక్రమం రద్దు లేదా నియమాలు కఠినతరం చేయడం వల్ల లక్షలాది భారతీయ విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడవచ్చు. అలాగే CPT పై సమీక్ష కూడా విద్యార్థులకు అందుబాటులో ఉన్న పని అవకాశాలను పరిమితం చేయనుంది. ఇప్పటికే విద్యార్థులు పార్ట్-టైమ్ ఉద్యోగాలు చేయకుండా నిబంధనలు కఠినతరం చేసిన విషయం తెలిసిందే. దీంతో అమెరికాలో చదువుకుంటున్న భారతీయులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూర్తిగా భారత్ నుంచి తల్లిదండ్రులు పంపే సొమ్ముపైనే ఆధారపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా USCIS డైరెక్టర్‌గా జోసెఫ్ ఎడ్లో నియామకం, OPT, CPT కార్యక్రమాల్లో కఠిన నిబంధనలను తీసుకురావడం ద్వారా అమెరికాలో చదువుకునే విదేశీ విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేయవచ్చు. ఒకవేళ ఈ కార్యక్రమాలను పూర్తిగా రద్దు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ మార్పులు అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానంలో కఠిన వైఖరిని సూచిస్తున్నాయి. మొత్తంగా భారతీయ విద్యార్థులకు అమెరికాలో కెరీర్ అవకాశాలను దెబ్బతీస్తున్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.