రిఫండు కోసం తప్పులు చేయొద్దు

దాయపు పన్ను రిటర్నులు దాఖలు చేస్తున్నారా? రిఫండు రావాలనే లక్ష్యంతో తప్పుడు సమాచారం ఇవ్వొద్దని ఆదాయపు పన్ను శాఖ హెచ్చరిస్తోంది. ఆదాయాన్ని తక్కువ చేసి చూపడం, మినహాయింపులు లేకున్నా క్లెయిం చేయడంలాంటివి నేరాలని పేర్కొంది.


జరిమానా, కొన్నిసార్లు జైలు శిక్షలాంటివీ ఉంటాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ఐటీఆర్‌ సమర్పిస్తున్న వారు కాస్త జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి.

గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఆర్జించిన ఆదాయానికిగాను ప్రస్తుత మదింపు సంవత్సరం (2025-26)లో రిటర్నులు దాఖలు చేసే సమయం ఇది. గడువు తేదీ సెప్టెంబరు 15 వరకూ ఉంది. పరిమితికి మించి ఆదాయం ఉన్న వారు కొత్త, పాత పద్ధతుల్లో తమకు ప్రయోజనం కలిగించే విధానాన్ని ఎంచుకొని, రిటర్నులు సమర్పించే వీలుంది. ఇక్కడే కొంతమంది తప్పుడు క్లెయింలకు పాల్పడుతున్నారు.

బోగస్‌ క్లెయిం అంటే..

పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయాన్ని తక్కువగా నివేదించడం, వివిధ సెక్షన్ల కింద పెట్టుబడులు, ఖర్చులను నమోదు చేయడంలాంటివి మోసపూరిత చర్యల కిందకు వస్తాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి పాత పన్ను విధానంలో పన్ను రిటర్నులు దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు. వాస్తవంగా అతనికి సెక్షన్‌ 80సీ కింద రూ.50వేల వరకే మినహాయింపులున్నాయి. కానీ,
రూ.1,50,000 క్లెయిం చేసుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు సెక్షన్‌ 80డీ కింద మెడికల్‌ పాలసీ లేకపోయినా.. రూ.25,000 ప్రీమియం చెల్లించినట్లు దాఖలు చేశారు. వీటివల్ల రిఫండు
వచ్చేందుకు అవకాశం ఉంది. కానీ, ఆదాయపు పన్ను శాఖ ప్రతి పెట్టుబడి, ఖర్చుకూ ఆధారాలు ఉండాలని చెబుతోంది. పేర్కొన్న ఆధారాలు తప్పు అని తెలిస్తే.. నోటీసులు అందుకోవాల్సి వస్తుంది.

ఆధారాలు ఉండాలి..

పాత పన్ను విధానంలో క్లెయిం చేసిన ప్రతి మినహాయింపును తగిన ఆధారాలతో ధ్రువీకరించాలి. నోటీసులు వస్తే సంబంధిత పత్రాలను పన్ను అధికారులకు సమర్పించాల్సి వస్తుంది. ఇప్పటికే రిఫండు వచ్చింది కదా.. ఇబ్బందేమీ లేదు అని అనుకోవడానికి వీల్లేదు.

  • ముఖ్యంగా విరాళాలకు సంబంధించి సెక్షన్‌ 80జీ, సెక్షన్‌ 80జీజీసీలను చాలామంది క్లెయిం చేస్తున్నట్లు ఐటీ విభాగం గుర్తించింది. మీరు ఇవ్వని విరాళాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ క్లెయిం చేసుకోవద్దు.

ఏం చేయాలి?

  • మీ ఆదాయం, మినహాయింపులు నివేదించేప్పుడు సరైన సమాచారాన్ని నమోదు చేయండి.
  • రిఫండులు ఇప్పిస్తామని చెప్పే వారి మాటలు నమ్మొద్దు.
  • ఆదాయపు పన్ను శాఖ కృత్రిమ మేధ (ఏఐ)లాంటి అధునాతన సాంకేతికతలను వాడి, సమాచారాన్ని విశ్లేషిస్తోంది. కాబట్టి, ఎక్కడ పొరపాటు ఉన్నా తెలుసుకోగలదు.
  • ఆదాయపు పన్ను శాఖ నుంచి వచ్చిన నోటీసులకు సకాలంలో స్పందించండి.
  • అనుమానాలున్నప్పుడు పన్ను నిపుణుల సహాయం తీసుకోవడం మంచిది.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.