కుమార్ మెట్లు దిగుతుండగా తూలి పడ్డాడు. కుడికాలు ఎముక చిట్లింది. కనీసం నాలుగు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుడు సూచించారు. ప్రవీణ్ ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగి.
ఆఫీసుకు వెళ్తుండగా బైకు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు… ఇలాంటి ప్రమాదాలు ఎప్పుడు ఎలా జరుగుతాయన్నది ఎవరూ ఊహించలేరు. ఆర్జించే వ్యక్తి కొన్నాళ్లపాటు ఇంటికే పరిమితమైతే.. ఆదాయం ఎలా? ఇలాంటప్పుడే వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ నేనున్నానంటూ భరోసానిస్తుంది.
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే ఆరోగ్య బీమా చికిత్స ఖర్చులను చెల్లిస్తుంది. దురదృష్టవశాత్తూ మరణిస్తే.. జీవిత బీమా పాలసీలున్న వారికి అవి పరిహారం చెల్లిస్తాయి. ఇదే తరహాలో ప్రమాదం బారిన పడినప్పుడు ఆర్థికంగా ఆదుకునేదే వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ. ఇందులో ఉండే ప్రయోజనాలు కాస్త భిన్నంగా ఉంటాయి.
ఆదాయం ఆగిపోకుండా
గాయాలపాలై, ఉద్యోగం లేదా వ్యాపారం నిర్వహించలేని సందర్భంలో ఆదాయం ఆగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పాలసీ తీసుకున్న వ్యక్తికి కొన్ని వారాల పాటు నిర్ణీత మొత్తంలో ఇది కొంత పరిహారం చెల్లిస్తుంది. ఉదాహరణకు ఒక సాధారణ బీమా సంస్థ అందిస్తున్న రూ.50లక్షల విలువైన పాలసీ తీసుకున్నారనుకుందాం. వారానికి రూ.10వేల చొప్పున గరిష్ఠంగా 104 వారాల పాటు చెల్లించే ఏర్పాటు ఉంటుంది. అదే రూ.కోటి పాలసీ తీసుకుంటే.. వారానికి రూ.20వేల వరకూ ఇస్తుంది. ఆసుపత్రిలో ఉన్నప్పుడూ 30 రోజుల వరకూ రోజుకు నిర్ణీత మొత్తాన్ని అందించే
పాలసీలూ ఉన్నాయి.
ఎందుకు అవసరం?
అనుకోకుండా ప్రమాదం జరిగినప్పుడు మరణం సంభవించవచ్చు. కొన్నిసార్లు శాశ్వత, పాక్షిక వైకల్యం ఏర్పడవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఈ పాలసీలు పరిహారం చెల్లిస్తాయి. పాలసీదారుడు మరణిస్తే అతని నామినీకి పాలసీ విలువ మేరకు పరిహారం అందుతుంది. కుటుంబానికి ఆర్థికంగా ఇబ్బంది ఏర్పడకుండా ఇది కాపాడుతుంది. వైకల్యం బారిన పడినప్పుడూ.. పాలసీలో ముందుగానే పేర్కొన్న మేరకు చెల్లింపులు ఉంటాయి.
ఎంత చెల్లించాలి?
టర్మ్ పాలసీలతో పోల్చి చూస్తే వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలకు ప్రీమియం తక్కువే. టర్మ్తోపాటు ఈ పాలసీని అనుబంధంగానూ ఎంచుకోవచ్చు. జీవిత, ఆరోగ్య బీమా పాలసీలకు వయసును బట్టి, ప్రీమియం మారుతుంది. కానీ, ఈ పాలసీల్లో సాధారణంగా అన్ని వయసుల వారికీ ప్రీమియం ఒకే విధంగా ఉంటుంది. వ్యక్తుల ఆదాయం, వారికి ఎదురయ్యే ప్రమాదాల జాబితాను బట్టి, పాలసీ విలువ, ప్రీమియాన్ని బీమా సంస్థలు నిర్ణయిస్తుంటాయి. ఉదాహరణకు ఒక ప్రముఖ సాధారణ బీమా సంస్థ అందిస్తున్న వ్యక్తిగత ప్రమాద బీమాను రూ.50లక్షల వరకూ తీసుకుంటే.. ప్రీమియం ఏడాదికి రూ.7,920 వరకూ ఉంది. అదే కోటికి రూ.14,279 చెల్లించాలి. రూ.5 కోట్ల పాలసీకి రూ.60,660 వరకూ ప్రీమియం ఉంటుంది.
ఎవరికి కావాలి?
వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీని 30 రోజుల వయసు నుంచి 70 ఏళ్ల వరకూ తీసుకునే వీలుంది. ఈ పాలసీ ప్రతి ఒక్కరికీ అవసరమనే చెప్పాలి. ఉద్యోగులు, వ్యాపారులు అనే తేడా లేదు. ప్రయాణాలు అధికంగా చేసే వారు ఈ పాలసీని మర్చిపోకూడదు. ముఖ్యంగా గృహరుణాల్లాంటివి తీసుకున్న వారికి ఈ పాలసీ కచ్చితంగా ఉండాలి. ఆదాయం ఆగిపోయిన సందర్భంలో ఈ పాలసీ ద్వారా వచ్చే మొత్తంతో వాయిదాలు చెల్లించేందుకు వీలవుతుంది.
రూ.25 కోట్ల వరకూ
ఒక వ్యక్తికి ఎంత విలువైన వ్యక్తిగత పాలసీని ఇవ్వాలనేది బీమా సంస్థల విచక్షణ మేరకు ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో బీమా సంస్థలు ఒకే తరహా నిబంధనలు పాటించవు. కొన్ని సాధారణ సంస్థలు వ్యక్తుల నెలవారీ ఆదాయానికి 72 రెట్ల వరకూ పాలసీని అందిస్తుంటాయి. కొన్ని వార్షికాదాయానికి 5 రెట్ల వరకూ విలువైన పాలసీని ఇస్తున్నాయి. కొన్ని సంస్థలు గరిష్ఠంగా రూ.25 కోట్ల వరకూ పాలసీని తీసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఇప్పుడు చాలా బీమా సంస్థలు నిర్ణీత మొత్తాన్ని ముందే నిర్ణయించి అందిస్తున్నాయి. రూ.5 లక్షల నుంచీ తీసుకునే వెసులుబాటు ఉన్నా.. కనీసం రూ.50 లక్షలు లేదా రూ.కోటి పాలసీని ఎంచుకోవడం మంచిది.
ఏయే సందర్భాల్లో..
- ప్రమాదంలో మరణించినప్పుడు పాలసీ విలువ మేరకు
- ఒక వ్యక్తి ఆరు నెలలకు మించి కనిపించని సందర్భాల్లో పాలసీ విలువ
- ప్రమాదం బారినపడి కోమాలోకి వెళ్లినప్పుడు.. పాలసీ విలువలో సగం
- శాశ్వత వైకల్యం సంభవిస్తే పూర్తిగా
- పాక్షిక వైకల్యం బారిన పడితే.. కొన్ని వారాల పాటు కొంత మొత్తం చెల్లింపు
- అత్యవసర వైద్య ఖర్చుల కోసం రూ.50వేల వరకూ
- ఆధారపడిన పిల్లల చదువులు/తల్లిదండ్రుల సంరక్షణకు నిర్ణీత మొత్తం
































