రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యవిద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ ప్రవేశాల ప్రక్రియ ఈనెల 16 నుంచి ప్రారంభమైంది. ఈనెల 25తో ముగియనుంది. ఈ ఏడాది నీట్ పరీక్షా పత్రం చాలా కఠినంగా రావడంతో అభ్యర్ధులకు మార్కులు తగ్గాయి. తెలంగాణ నుంచి ఈ ఏడాది 72,094 మంది దరఖాస్తు చేసుకోగా, 41,584 మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాదితో పొల్చితే ఈ సారి రాష్ట్రం నుంచి నీట్ రాసే వారి సంఖ్య 8 వేలు తగ్గింది. అయినా కూడా సీటు కోసం పోటీపడే వారి సంఖ్య భారీగానే ఉంది. సగటున ఒక్కొ సీటుకు ఐదుగురు పోటీ పడుతున్నారు. కాళోజీ యూనివర్సిటీ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటులో కలపి మొత్తం 5,500 వరకు కన్వీనర్ కోటా సీట్లున్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద సీటు వస్తే రూ.10 వేలు, ప్రైవేటులో అయితే రూ.60 వేలు వార్షిక ఫీజు చెల్లించాల్సి వుంటుంది. అందుకే ఈ కోటాలో సీటు తెచ్చుకునేందుకు అంతా యత్నిస్తారు. అయితే ఎంత ర్యాంకు వస్తే.. కన్వీనర్ కోటాలో సీటు దక్కుతుందనే అనే విషయంపై విద్యార్ధులు ఆరా తీస్తున్నారు. గతేడాది ఎంత స్థాయి ర్యాంకుకు కన్వీనర్ కోటాలో సీటు వచ్చిందనే విషయంలో ఇంటర్నెట్‌లో వెతుకుతున్నారు. ఈ ఏడాది ర్యాంకు పెరిగినా.. కన్వీనర్ కోటాలో సీటు దక్కే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
గతేడాది 3.31 లక్షల ర్యాంకుకు సీటు..
ప్రభుత్వ వైద్య కళాశాల్లో ఉన్న 4,090 సీట్లలో 15 శాతం అఖిల భారత కోటాకు వెళ్తాయి. మిగిలిన 3,476 సీట్లతో పాటు ప్రైవేటు వైద్య కళాశాల్లో 50 శాతం కూడా కన్వీనర్ కోటా కిందకే వస్తాయి. అలాగే రాష్ట్రంలో వైద్య విద్య ప్రవేశాల్లో ఎస్సీలకు 15 శాతం సీట్లు, ఎస్టీలకు 10 శాతం, బీసీలకు 29 శాతం దక్కనున్నాయి. కాగా గతేడాది ఆలిండియా జనరల్ కేటగిరిలో 2.12 లక్షల ర్యాంకు వచ్చిన ఓ విద్యార్థికి కన్వీనర్ కోటాలో సీటు రావడం విశేషం. అలాగే అమ్మాయిల్లో 1.98 లక్షల ర్యాంకు వారికి కూడా కన్వీనర్ కోటాలో సీటు దక్కింది. కాగా బీసీ ఏలో అమ్మాయిల కేటగిరిలో 3.31 లక్షల ర్యాంకుకు కన్వీనర్ కోటాలో సీటు దక్కింది.
సర్కారీలో 4,090 ఎంబీబీఎస్ సీట్లు
రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 34కు చేరుకుంది. ఇందులో 4,090 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అలాగే ఏయిమ్స్ బీబీనగర్‌లో 100, ఈఎ్‌సఐ సనత్‌నగర్‌లో 150 సీట్లున్నాయి. ఇక ప్రైవేటులో 30 కాలేజీలుండగా… అందులో 4,600 సీట్లున్నాయి. ఇందులో కొన్ని కాలేజీలు గతేడాది డీమ్డ్ యూనివర్సిటీ హోదా పొందాయి. దాంతో ఈ కాలేజీల్లో ఉన్న సుమారు 300 సీట్లు రాష్ట్ర పరిధిలోకి రావు. అలాగే ఈ ఏడాది వరంగల్‌లోని ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీ గుర్తింపును జాతీయ వైద్య కమిషన్ రద్దు చేయడంతో ఆ కాలేజీలో ఉన్న 150 సీట్లలో ప్రవేశాలకు అవకాశం లేకుండా పోయింది.
2024-25లో ఎంబీబీఎస్ సీట్లు దక్కిన చివరి ర్యాంకులు.. కేటగిరీల వారీగా ఇలా…
కేటగిరి మేల్ ఫీమేల్
జనరల్ కేటగిరి 2,12,617 1,98,126
ఈడబ్ల్యుఎస్ 1,80,510 1,73,724
బీసీ-ఏ 3,36,989 3,31,596
బీసీ-బీ 2,29,597 2,36,008
బీసీ-సీ 3,15,341 3,09,851
బీసీ-డీ 2,14,648 2,11,904
బీసీ-ఈ 2,23,906 2,29,718
మైనార్టీ 2,29,439 2,23,599
ఎస్సీ 3,11,648 3,11,126
ఎస్టీ 2,93,753 2,93,873
































