భారతదేశ వ్యవసాయ, ప్రాసెస్డ్ ఫుడ్ ఎగుమతులు 7 శాతం కంటే ఎక్కువ పెరిగి, 5.96 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. బియ్యం, మాంసం, పండ్లు, కూరగాయల ఎగుమతులు ఈ పెరుగుదలకు కారణం. బియ్యం ఎగుమతులు 3.5 శాతం పెరిగి 2.9 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
వ్యవసాయ, ప్రాసెస్డ్ ఫుడ్ ఎగుమతుల్లో భారత్ గణనీయమైన వృద్ధిని కనబర్చింది. 2025 – 26 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) భారతదేశ వ్యవసాయ, ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతులు సంవత్సరానికి 7 శాతానికి పైగా పెరిగి 5.96 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. బియ్యం, మాంసం, పండ్లు, కూరగాయల ఎగుమతులు దీనికి కారణమయ్యాయని ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. బాస్మతి, బాస్మతియేతర రకాలు రెండూ సహా బియ్యం ఎగుమతులు 3.5 శాతం పెరిగి 2.9 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
2025 ఆర్థిక సంవత్సరంలో బియ్యం ఎగుమతులు రికార్డు స్థాయిలో 12.47 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది 2023-24తో పోల్చుకుంటే 20 శాతానికి పైగా పెరిగింది. ప్రపంచ బియ్యం మార్కెట్లో 40 శాతానికి పైగా వాటా కలిగి ఉన్న భారతదేశం, దశాబ్దానికి పైగా ప్రధాన బియ్యం ఎగుమతిదారుగా తన స్థానాన్ని నిలుపుకుంది. మాంసం, పాలు, పౌల్ట్రీ ఎగుమతులు 17 శాతం పెరిగి 1.18 బిలియన్ డాలర్లకు చేరుకోగా, పండ్లు, కూరగాయల ఎగుమతులు 13 శాతం పెరిగి 0.95 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. భారతీయ గేదె మాంసం నాణ్యత, పోషక విలువల కారణంగా ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోందని అధికారులు గుర్తించారు. భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద గేదె మాంసం ఎగుమతిదారుగా ఉంది. వియత్నాం, మలేషియా, ఈజిప్ట్, ఇరాక్, సౌదీ అరేబియా, యుఎఇలలో కీలక మార్కెట్లు ఉన్నాయి. అర్గికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (APEDA) బాస్కెట్ కింద ఎగుమతులు FY25లో 25.14 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది FY24 నుండి 12 శాతానికి పైగా పెరిగి మొత్తం వ్యవసాయ ఎగుమతుల్లో 51 శాతం వాటాను కలిగి ఉంది. మిగిలిన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో పొగాకు, కాఫీ, టీ ఉన్నాయి.
































