రష్యాను భూకంపం గజగజ వణికించింది. రష్యా తూర్పు తీరంలోని కమ్చట్కాలో 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. గంటలోనే వరుసగా 5 సార్లు భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇదే సమయంలో కమ్చట్కా ద్వీపకల్పం, హవాయిలోని కొన్ని ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.
భూకంప కేంద్రం రష్యాలోని కమ్చట్కా నగరానికి 147 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహా సముద్రంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. సముద్రంలో10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు వివరించారు. 6.6, 6.7, 7.4, 6.7, తీవ్రతతో వరుసగా ఐదు సార్లు భూకంపం వచ్చింది. 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల సునామీ వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో కమ్చట్కా, హవాయి ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు ప్రజలను సరక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
































