నిరుద్యోగులకు ఎగిరి గంతేసే న్యూస్.. వరుస ఉద్యోగ నోటిఫికేషన్‌లు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నిరుద్యోగులకు కూటమి సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. త్వరలోనే వరుస జాబ్ నోటిఫికేషన్లు విడుదలకానున్నాయి.


ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) సన్నద్దమవుతోంది. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ అమల్లో భాగంగా సంబంధిత ప్రభుత్వ శాఖల నుంచి రోస్టర్‌ పాయింట్లు కమిషన్‌కు చేరాయి. దీంతో వరుస నోటిఫికేషన్‌లు ఇచ్చేందుకు ఏపీపీఎస్సీ సిద్ధమవుతోంది. అటవీ శాఖలో 691 ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్‌ (06/2025) జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులతోపాటు త్వరలోనే అటవీ శాఖలోనే 100 సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టులు, ఇతర శాఖలకు చెందిన మరో 75 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌లు రానున్నాయి. అటవీ శాఖలోని సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి మరో వారం రోజుల్లోనే నోటిఫికేషన్‌ వెలువడనుంది.

శాఖల వారీగా వెలువడనున్న నోటిఫికేషన్లు ఇవే..

ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ శాఖలో జూనియర్‌ ఎకౌంట్స్‌ ఆఫీసర్‌ కేటగిరీ 2, సీనియర్‌ ఎకౌంటెంట్‌ కేటగిరీ 3, జూనియర్‌ ఎకౌంటెంట్‌ కేటగిరీ 4 కింద మొత్తం మూడు కేటగిరీలు కలిపి 11 పోస్టులు, టెక్నికల్‌ అసిస్టెంట్‌ (భూగర్భ నీటిపారుదల) పోస్టులు 4, అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ (మత్స్యశాఖ) పోస్టులు 3, హార్టికల్చర్‌ ఆఫీసర్‌ (ఉద్యానవన) పోస్టులు రెండు ఉన్నాయి. ఇక అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ (వ్యవసాయ శాఖ)లో 10 పోస్టులు, కార్యనిర్వహణ అధికారి (దేవాదాయ) పోస్టులు 7, జిల్లా సైనిక అధికారి పోస్టులు 7, గ్రంథ పాలకులు (ఇంటర్‌ విద్య) పోస్టులు 2, అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు 1 (క్యారీ ఫార్వర్డ్‌), జూనియర్‌ అసిస్టెంట్‌ టైపిస్టు పోస్టులు 1 (ప్రిజన్స్‌) (క్యారీ ఫార్వర్డ్‌)-1, ఇతర శాఖల్లో ఇంకొన్ని పోస్టులకు నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉంది.

ఈ పోస్టులకు ఏపీపీఎస్సీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. సిలబస్‌ను అనుసరించి ఉమ్మడిగా పరీక్షలు నిర్వహించాలా? వద్దా? అనే దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టులు, ఇతర పోస్టుల భర్తీలోనూ ఉమ్మడి పరీక్ష విధానాన్ని ఏపీపీఎస్సీ అనుసరించింది. దీనిపై స్పష్టత వచ్చిన తర్వాత ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌లు జారీ చేసే అవకాశం ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.