కారు ఎక్కితే కడుపులో తిప్పుతోందా? ఈ చిట్కాలు పాటిస్తే హాయిగా ప్రయాణించవచ్చు!

ప్రశాంతంగా ఉన్నప్పుడు కళ్ళు, చెవులు ఒకలా పనిచేస్తే, ప్రయాణంలో కదలికల వల్ల మెదడుకు చేరే సంకేతాల్లో మార్పులు వచ్చి ఈ మోషన్ సిక్‌నెస్ తలెత్తుతుంది.


అయితే, ఈ సమస్యను అధిగమించడం అంత కష్టం కాదని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని సులభ చిట్కాలు పాటిస్తే ప్రయాణాన్ని హాయిగా ఆస్వాదించవచ్చు.

1. ఖాళీ కడుపుతో వద్దు:
మోషన్ సిక్‌నెస్ ఉన్నవారు ఖాళీ కడుపుతో ప్రయాణించడం మానుకోవాలి. ప్రయాణానికి కనీసం ఒక గంట ముందు తేలికపాటి ఆహారం లేదా స్నాక్స్ తీసుకోవాలి. నూనె పదార్థాలు, భారీ భోజనం నివారించాలి. ఖాళీ కడుపుతో ఉంటే వికారం మరింత పెరుగుతుంది. తక్కువ మొత్తంలో, సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం వల్ల కడుపులో అసౌకర్యం తగ్గుతుంది.

2. సీటింగ్ పొజిషన్ ముఖ్యం:
వాహనంలో ఎక్కడ కూర్చుంటున్నారు అనేది మోషన్ సిక్‌నెస్‌పై ప్రభావం చూపుతుంది. కారులో అయితే వెనుక సీట్ల బదులు డ్రైవింగ్ సీటు పక్కన కూర్చోవడం మంచిది. రైలులో ప్రయాణించేటప్పుడు కిటికీ పక్కన, రైలు ప్రయాణించే దిశలో కూర్చోవాలి. ఎదురు దిశలో కూర్చుంటే వాంతులు వచ్చే అవకాశం ఎక్కువ. స్లీపర్ బస్సుల్లో అయితే కింది బెర్తులో కూర్చోవడం మేలు. సౌకర్యవంతమైన సీటు ఎంచుకోవడం ప్రయాణ వికారాన్ని తగ్గిస్తుంది.

3. పుస్తకాలు, ఫోన్‌కు విరామం:
ప్రయాణంలో పుస్తకాలు చదవడం లేదా ఫోన్ ఎక్కువగా చూడటం వల్ల కళ్ళపై ఒత్తిడి పెరిగి మోషన్ సిక్‌నెస్ ఎక్కువవుతుంది. చుట్టూ ఉన్న పరిసరాలను గమనించడం, పాటలు వినడం వంటివి మెరుగైన ఎంపికలు. మణికట్టుపై ఒత్తిడి కలిగించే రిస్ట్ బ్యాండ్ (అకుప్రెషర్ బ్యాండ్) ధరించడం కూడా కొంత ఉపశమనం కలిగిస్తుంది. ఇది మణికట్టు వద్ద ఉండే నరాలపై ఒత్తిడి కలిగించి వికారాన్ని తగ్గిస్తుంది.

4. అల్లం అద్భుత ఔషధం:
మోషన్ సిక్‌నెస్‌ను తగ్గించడంలో అల్లం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ప్రయాణానికి వెళ్ళేటప్పుడు ఒక చిన్న అల్లం ముక్కను వెంట తీసుకెళ్లండి. కడుపులో వికారం అనిపించినప్పుడు వెంటనే ఆ అల్లం ముక్కను నోటిలో వేసుకుని చప్పరించండి. అల్లం రసం మింగడం వల్ల త్వరగా ఉపశమనం లభిస్తుంది. పిప్పర్ మెంట్స్, మింట్ గమ్స్ కూడా ఉపయోగపడతాయి, కానీ అల్లం మరింత మెరుగైనది. లవంగాలు, యాలకులు కూడా నోట్లో వేసుకుని నమిలితే వికారం తగ్గుతుంది.

5. బియ్యం, కర్పూరం చిట్కా: ఒక కర్చీఫ్‌లో ఒక టేబుల్ స్పూన్ బియ్యం, రెండు కర్పూరం బిళ్ళలను (పొడి చేసి) వేసి మూటకట్టండి. ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ మూటను అప్పుడప్పుడూ వాసన చూడటం వల్ల కడుపులో వికారం తగ్గుతుంది. అత్యవసర పరిస్థితుల్లో డాక్టర్ సలహా మేరకు మందులు తీసుకోవచ్చు, అయితే అవి మత్తుగా ఉంటాయని గుర్తుంచుకోండి. సమస్య మరీ తీవ్రంగా ఉంటే తప్ప మందులను తీసుకోకపోవడం మంచిది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.